బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు.. | Sakshi
Sakshi News home page

బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..

Published Sun, Jun 16 2024 9:38 AM

Mutual Curses Of Brahma Narada Sunday Devotional Story

శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.

బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. 
     ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.
తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు.
      బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.

ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.

బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు.
      ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.

‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.

బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.
అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.

‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!

సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన

Advertisement
 
Advertisement
 
Advertisement