మరో హైదరాబాద్‌గా వరంగల్‌ CM Revanth Reddy Special Focus On Warangal Development | Sakshi
Sakshi News home page

మరో హైదరాబాద్‌గా వరంగల్‌

Published Sun, Jun 30 2024 4:32 AM | Last Updated on Sun, Jun 30 2024 4:32 AM

శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ,  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్కతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి.. ఇక నుంచి వరంగల్‌పై ప్రత్యేక ఫోకస్‌: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో చేపడుతున్న కొత్త పద్ధతులు అమలుచేస్తాం 

త్వరలోనే వరంగల్‌కు కొత్త మాస్టర్‌ప్లాన్‌–2050 

రింగ్‌ రోడ్డుకు, మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు భూసేకరణ చేస్తాం 

నగరం అభివృద్ధికి రూ.6,115 కోట్లు అవసరమని అంచనా  

మహా నగర పాలక సంస్థ అభివృద్ధిపై సమీక్ష సమావేశం  

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అంచనాల పెంపుపై సీఎం సీరియస్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతి పెద్దదైన వరంగల్‌ మహానగరాన్ని.. హైదరాబాద్‌తో పోటీపడేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వరంగల్‌ సమగ్రాభివృద్ధిపై తాను ప్రత్యేక ఫోకస్‌ పెడతానన్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా శనివారం మధ్యాహ్నం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు చేరుకున్న ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. ముందుగా వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం టెక్స్‌టైల్‌ పార్కును పరిశీలించాక రోడ్డు మార్గంలో నగరానికి చేరుకుని నిర్మాణంలో ఉన్న సూపర్‌స్పెషాలిటీ అస్పత్రి పనులను పరిశీలించారు. 

అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్‌లో వరంగల్‌ మహానగర పాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి రేవంత్‌ సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రింగ్‌ రోడ్డు నిర్మాణం, స్మార్ట్‌సిటీ పనులు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, విమానాశ్రయం పరిస్థితి, కాళోజీ కళాక్షేత్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర వరంగల్‌ నగరాభివృద్ధికి సంబంధించి 8 అంశాలపై సుమారు మూడు గంటలపాటు చర్చించారు. 

తక్షణమే రింగ్‌రోడ్డుకు భూసేకరణ 
హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య మొదట రింగ్‌ రోడ్డు నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు దశల్లో 13 కిలోమీటర్ల వరకు చేపట్టనున్న రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూ సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఆ తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. వరంగల్‌ నుంచి ఇతర జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా జాతీయ రహదారుల కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని, నాలాల ఆక్రమణపై దృష్టి సారించాలని, నాలాల్లో సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తొలగించాలని నిర్దేశించారు. హైదరాబాద్‌లో చేపడుతున్న కొత్త పద్ధతులను వరంగల్‌లోనూ చేపట్టాలని, అక్కడ వరదలు వచి్చనప్పుడు ఏ చర్యలు తీసుకుంటున్నారో ఇక్కడ కూడా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంపై సమగ్ర నివేదిక (డీపీఆర్‌) తయారు చేయాలన్నారు.   

మహిళా సంఘాలు మరింత బలోపేతం 
వరంగల్‌ నగరాభివృద్ధికి రూ.6115 కోట్ల నిధులు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందో లేదో తెలుసుకోవాలన్నారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, సెపె్టంబర్‌ 9 నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. 

అత్యవసర సమయంలో ఆపరేషన్లు ఇతర వైద్య సేవలకు నిమ్స్‌లో అందిస్తున్నట్లుగా ఎంజీఎం ఆస్పత్రిలో ఎన్‌ఓసీ ఇచ్చే అంశంపై పరిశీలన జరుపుతామని చెప్పారు. రాష్ట్రంలో స్వశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కూల్‌ విద్యార్థుల యూనిఫాంలకు సంబంధించిన పెండింగ్‌ బిల్స్‌ వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖల యూనిఫామ్‌లు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. 

ఇందిరా మహాశక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలో వరంగల్‌ అభివృద్ధిపై జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తారన్నారు. అనంతరం స్వశక్తి మహిళలకు రూ.518.71 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. తర్వాత హంటర్‌రోడ్డులో మెడికవర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిని ప్రారంభించి హైదరాబాద్‌కు బయలుదేరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్‌ మొదటిసారిగా వరంగల్‌లో పర్యటించారు. 

ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ప్రభుత్వ కార్యదర్శులు రోనాల్డ్‌రోస్, క్రిస్టియానా, జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదదేవి, సీపీ అంబర్‌ కిషోర్‌ ఝాతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

‘సూపర్‌ స్పెషాలిటీ’పై సీఎం సీరియస్‌ 
వరంగల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల అంచనా వ్యయం ఎందుకు పెరిగింది? అని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ‘ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) పద్ధతిన పనులు చేపడుతున్నందున అలా పెంచే వీలులేదు. రూ.1,100 కోట్లను ఎలాంటి అనుమతులు లేకుండా రూ.1,726 కోట్లకు పెంచారు. రూ.626 కోట్లు ఎలా పెంచుతారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పనుల విలువ అంచనాల పెంపుపై ప్రత్యేక రిపోర్టు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్‌ ప్లాన్‌ను 2050 సంవత్సరం వరకు డిజైన్‌ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రి లాగా వరంగల్‌లోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  

వినతిపత్రాలు తీసుకోకుండానే.. 
హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్షకు వచి్చన సీఎంను కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సుమారు మూడు గంటలపాటు సమీక్ష సాగటంతో జనం వేచి ఉన్నారు. ఈ క్రమంలో జోరువాన రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

భద్రతా కారణాలతో సిబ్బంది లోనికి కూడా అనుమతించలేదు. సమావేశం ముగిశాక బయటికి వచ్చిన రేవంత్‌ నేరుగా బస్సు ఎక్కారు. సీఎంకు వినతిపత్రాలు చూపిస్తూ బస్సు వెంట జనం పరుగులు తీశారు. అయినా రేవంత్‌ అలానే వెళ్లిపోయారు. దీంతో వారు అక్కడే ఉన్న అధికారులు, నాయకులకు వినతులు అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement