అజ్ఞాత బాట.. కన్నీటి ఊట.. | Parents passed away without a trace of their son Srinivas | Sakshi
Sakshi News home page

అజ్ఞాత బాట.. కన్నీటి ఊట..

Published Wed, Jul 3 2024 5:13 AM | Last Updated on Wed, Jul 3 2024 5:13 AM

Parents passed away without a trace of their son Srinivas

కొడుకు శ్రీనివాస్‌ జాడ తెలియకుండానే కన్నుమూసిన తల్లిదండ్రులు

‘వెనకచ్చే ఆవుల్లారా.. ఎర్ర ఆవుల్లారో.. శ్రీరామ రామచంద్రుడా.. 
మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామచంద్రుడా.. 
ముందొచ్చే లేగల్లారా.. ముద్దు లేగల్లారో.. శ్రీరామ రామచంద్రుడా..
మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామచంద్రుడా..’ 
అంటూ చదువు కోసం పట్నం వెళ్లిన కొడుకు కనిపించకుండా  పోవడంతో కొడుకు తలపుల్లో తల్లి పడిన వేదనకు అద్దం పట్టే ఈ పాట ‘ఎన్‌కౌంటర్‌’ సినిమాలోనిది.

సిరిసిల్ల:  రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తు­మ్మ­ల శ్రీనివాస్‌ అలియాస్‌ విశ్వనాథ్‌ సిద్దిపే­టలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి నక్సలై­ట్‌ గ్రూపులో చేరి అడవిబాట పట్టాడు. 26 ఏళ్లు శ్రీనివాస్‌ జాడ తెలి­యక అతడి తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయ­ణ, భూ­ద­మ్మలూ ఇదే తరహాలో తల్లడిల్లిపోయారు. చివ రికి శ్రీనివాస్‌ను కడసారి చూడకుండానే కన్నుమూశారు. 

పోలీస్‌ కౌన్సెలింగ్‌తో వెలుగులోకి..
చాలాకాలం పాటు శ్రీనివాస్‌ ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గుర­య్యా­రు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్‌ అలియాస్‌ విశ్వనాథ్‌ పేరుతో నక్సలైట్‌ ఉద్యమంలో పని చేస్తున్నాడని గుర్తించారు. దీంతో బండలింగంపల్లిలోని మ్యాదరి నారా­యణ ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ కొడుకు లొంగిపోయేలా చూడండి’ అంటూ.. కౌన్సె­లిం­గ్‌ నిర్వహించారు. 

ప్రజాఉద్య­మ నిర్మా­ణంలో భాగంగా శ్రీనివాస్‌ ఒడిశా ప్రాంతంలో పనిచేస్తున్నాడని కొద్ది కాలం కిందట తెలిసింది. కానీ, అతని ఆచూకీ లేక కుటుంబసభ్యులు మనోవేదనకు గురయ్యా­రు. రాత్రి­ళ్లు వాకిట్లో అలికిడి అయితే చాలు కొడు­కు వచ్చాడేమోననని ఆశ పడ్డారు. ఏళ్ల­తరబడి అతను ఎలా ఉన్నాడో... ఎక్కడు­న్నాడో తెలియలేదు.

శ్రీనివాస్‌ అజ్ఞాతవాసం ఆ కన్నవారికి తీరని వేదన మిగిల్చింది. ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా, ఆ మృతుల్లో ‘మావోడు ఉన్నాడో’నని ఆందోళన చెందారు. చివరకు కొడుకును చూడకుండానే 2017లో తల్లి భూదమ్మ చనిపోయింది. కొడుకు జాడ లేక, భార్య కన్నుమూసిన వేదనలో ఆ తండ్రి కూడా జూన్‌ 23న బండలింగంపల్లిలో కన్నుమూశాడు. నారాయణ దశదినకర్మ బుధవారం జరగ­నుంది.  అజ్ఞాతంలో ఉన్న శ్రీనివాస్‌ ఎక్కడ, ఎలా ఉన్నారో జనశక్తి అగ్రనేతలు కూడా చెప్పలేకపోతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement