‘లాలా’ కోసం భగత్‌సింగ్‌ ఏం చేశారు? విప్లవకారుల పొరపాటు ఏమిటి? Lala Was Badly Injured by the Sticks of the British, Bhagat Singh Took Revenge | Sakshi
Sakshi News home page

Lala Birth Anniversary: ‘లాలా’ కోసం భగత్‌సింగ్‌ ఏం చేశారు? విప్లవకారుల పొరపాటు ఏమిటి?

Published Sun, Jan 28 2024 9:29 AM | Last Updated on Sun, Jan 28 2024 11:35 AM

Lala was Badly Injured by the Sticks of the British Bhagat Singh Took Revenge - Sakshi

బ్రిటీషర్ల బానిసత్వ సంకెళ్ల నుండి దేశానికి విముక్తి కల్పించడంలో స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ విశేష కృషి చేశారు. ఆయన నిష్ణాతుడైన రాజకీయవేత్త, చరిత్రకారుడు, న్యాయవాది, రచయితగా పేరుగాంచారు. లాలా లజపతిరాయ్ కాంగ్రెస్‌లో అతివాద గ్రూపు నేతగా, పంజాబ్ కేసరిగా గుర్తింపు పొందారు. 

స్వాతంత్య్ర వీరుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా విప్లవకారులకు లాలా లజపతిరాయ్ అంటే ఎంతో గౌరవం. యువతను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడేలా లాలా లజపతిరాయ్‌ పురిగొల్పారు. నేడు లాలా లజపతిరాయ్ జయంతి. పంజాబ్‌లోని మోగా జిల్లాలోని అగర్వాల్ కుటుంబంలో 1865, జనవరి 28న లాలా లజపతిరాయ్‌ జన్మించారు.

1928, అక్టోబర్‌ 30న సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో భారీ ప్రదర్శన జరిగింది. దీనిలో లాలా లజపతిరాయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిపై లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో, లాలా మాట్లాడుతూ ‘నా శరీరంపై పడే ప్రతీ లాఠీ దెబ్బ.. బ్రిటిష్ ప్రభుత్వ శవపేటికపై దిగబడే మేకులా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు.

1927, నవంబరు 8న భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దానికి సైమన్ కమిషన్ అనే పేరు పెట్టింది. దీనిలో ఏడుగురు బ్రిటిష్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. భారతీయులకు దానిలో స్థానం దక్కలేదు. మాంటేగ్ చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల పరిశీలనకు ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. 

సైమన్ కమిషన్ 1928, ఫిబ్రవరి 3న భారతదేశానికి వచ్చింది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్‌తో సహా దేశమంతా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘సైమన్‌ కమిషన్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. పంజాబ్‌లో జరిగిన ఈ నిరసనకు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. లాహోర్ పోలీస్ ఎస్పీ జేమ్స్ ఎ స్కాట్ నేతృత్వంలో లాఠీ ఛార్జ్ జరిగింది. లాలా తీవ్రంగా గాయపడి 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరకు 1928 నవంబర్ 17న కన్నుమూశారు.

లాలా లజపతి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భగత్ సింగ్‌తో సహా పలువురు విప్లవకారులు బ్రిటిష్ అధికారి జేమ్స్ ఎ. స్కాట్ హత్యకు ప్లాన్ చేశారు. అయితే అతనిని గుర్తించడంలో పొరపాటు జరిగి, 1928, డిసెంబరు 17న భగత్ సింగ్, రాజ్‌గురులు బ్రిటీష్‌ పోలీసు అధికారి జాన్ పి. సాండర్స్‌ను కాల్చిచంపారు. ఆ సమయంలో సాండర్స్ లాహోర్ ఎస్పీగా ఉన్నారు. లాలా లజపతిరాయ్ మృతి విషయంలో దేశం మౌనంగా ఉండదని, బ్రిటిష్ వారికి తగిన సమాధానం చెప్పాలని భావించిన విప్లవకారులు బ్రిటిష్ వారికి  ఇటువంటి సందేశం ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement