నాగ్‌ అశ్విన్‌ సక్సెస్‌ స్టోరీ.. ప్రియాంక దత్‌తో ప్రేమ ఎలా మొదలైంది..? Nag Ashwin And Priyanka Dutt Love Story | Sakshi
Sakshi News home page

నాగ్‌ అశ్విన్‌ సక్సెస్‌ స్టోరీ.. ప్రియాంక దత్‌తో ప్రేమ ఎలా మొదలైంది..?

Published Thu, Jun 27 2024 12:08 PM | Last Updated on Thu, Jun 27 2024 12:44 PM

Nag Ashwin And Priyanka Dutt Love Story

డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. ఆయన మాటలు చాలా పొదుపు కానీ, తనలోని ప్రతిభకు అవధులంటూ ఉండవు.  నాగ్‌ అశ్విన్‌ గురించి తెలియని వారు ఆయన సింప్లిసిటీని చూస్తే ఇతను దర్శకుడా..? అని ఆశ్చర్యపోతారు. సెట్స్‌లో నాగ్‌ అశ్విన్‌ ప్రతిభను చూసి మెచ్చుకోని వారు అంటూ ఉండరు.  ఈ ‍క్రమంలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి స్టార్స్‌ నాగ్‌ టాలెంట్‌కు ఫిదా అయ్యారు. నేడు ఆయన డైరెక్ట్‌ చేసిన 'కల్కి 2898 ఏడీ' విడుదలైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. హాలీవుడ్‌ స్థాయికి టాలీవుడ్‌ను నాగ్‌ అశ్విన్‌  తీసుకుబోయాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగ్‌ అశ్విన్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అసలు పేరు నాగ్‌ అశ్విన్‌ రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు జయరాం రెడ్డి, జయంతి దంపతులకు నాగ్‌ జన్మించారు. హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్లో చదివిన నాగ్‌ అశ్విన్‌ ఆపై మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్  డిగ్రీ పూర్తి చేశారు. స్కూల్‌లో టాప్‌ టెన్‌ ర్యాంక్‌లో ఉన్న నాగ్‌ తల్లిదండ్రుల మాదిరి డాక్టర్‌ అవుతాడని అనుకుంటే.. మణిపాల్‌ మల్టీమీడియా కోర్సులో చేరారు. అక్కడ వీడియో ఎడిటింగ్‌తో పాటు సినిమాకు అవసరమైన నాలెడ్జ్‌ను సంపాదించుకున్నాడు.

సినిమాల్లోకి ఎంట్రీ ఎలా..?
సినిమాలపై నాగ్‌ అశ్విన్‌ చూపుతున్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. ఈ క్రమంలో వారు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల వద్దకు నాగ్‌ అశ్విన్‌ను పంపారు. ఆ సమయంలో 'గోదావరి' సినిమా చిత్రీకరణ జరుగుతుండటంతో తర్వాత ప్రాజెక్ట్‌లో తన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేర్చుకుంటానని శేఖర్‌ కమ్ముల మాట ఇచ్చారు. ఈ గ్యాప్‌లో మంచు మనోజ్‌ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అందుకు రెమ్యునరేషన్‌గా రూ. 4 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల నుంచి పిలుపు వచ్చింది. లీడర్‌, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నాగ్‌ ప్రతిభను శేఖర్‌ కమ్ముల మెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

డైరెక్టర్‌గా ఛాన్స్‌ ఎవరిచ్చారు..?

శేఖర్‌ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో 'యాదోం కీ బరాత్' అనే ఇంగ్లీష్‌ లఘు చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేశారు. ఈ చిత్రానికి ప్రియాంక దత్‌ నిర్మాత కావడం విశేషం. కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఈ చిత్రం ఎంపిక చేయబడింది. దీంతో ఆయన జీవితం టర్న్‌ అయిపోయింది. ఆ షార్ట్‌ఫిల్మ్‌ వల్ల  నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అప్పుడు వారికి 'ఎవడే సుబ్రమణ్యం' కథను నాగ్‌ వినిపించారు. 

ఆ చిత్రాన్ని నిర్మిస్తామని ప్రియాంక, స్వప్న మాట​ ఇచ్చారు. అలా నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో 2015లో నాగ్‌ అశ్విన్‌ తొలి సినిమా వెండితెరపై మెరిసింది. తక్కువ బడ్జెట్‌లో చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని అశ్విన్‌ తీశాడు. సినిమాకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా దక్కింది. ఇదే సమయంలో ఆయన పలు యాడ్‌ చిత్రాలకు కూడా డైరెక్ట్‌ చేయడం విశేషం.

ప్రియాంక దత్‌తో ప్రేమ, పెళ్లి
ప్రియాంక దత్‌.. తన 21వ యేట 2004లో పవన్‌ కల్యాణ్‌ 'బాలు' చిత్రం ద్వారా సహనిర్మాతగా చిత్ర రంగంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత 'శక్తి'  చిత్రాన్ని కూడా ఆమె నిర్మించారు. త్రీ ఏంజల్స్ స్టుడియో పేరుతో సారొచ్చారు, బాణం, ఓం శాంతి, యాదోంకీ బరత్ వంటి చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. ప్రియాంక కొన్ని యాడ్స్‌ కూడా నిర్మించారు. ఆ సమయంలో ఆమెకు నాగ్‌ అశ్విన్‌  పరిచయం కావడం.. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి యాదోంకీ బరత్ అనే లఘు చిత్రం కోసం పనిచేయడం జరిగింది. అలా 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది.

ప్రియాంక దత్‌కు తన ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా ప్రపోజ్‌ చేశారు. 'మీకు ఎవరైనా నచ్చితే సరే... లేదంటే మనం పెళ్లి చేసుకుందాం' అని  నాగ్‌ అశ్విన్‌ తన ప్రేమ గురించి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు. అప్పటికే చాలా కాలంగా నాగ్ అశ్విన్‌తో ఆమె  ట్రావెల్ చేశారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనలోని మంచితనాన్ని గ్రహించిన ప్రియాంక కూడా వెంటనే ఓకే చెప్పడంతో వారి పెళ్లి 2015లో జరిగింది. 

అలా  దర్శకుడుగా నాగ్ అశ్విన్ మంచి విజయం సాధించకముందే అతన్ని ఆమె నమ్మారు. సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్‌- ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు.  ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా స్టేట్‌ నంది అవార్డు అందుకున్న అశ్విన్‌.. మహానటి చిత్రంతో నేషనల్‌ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు కల్కి సినిమాతో అంతర్జాతీయ అవార్డును నాగ్‌ అశ్విన్‌ తప్పకుండా అందుకోవాలని కోరుకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement