ఏఐ.. పార్కింగ్ ఎక్కడోయ్ AI to help solve parking problems in Telangana | Sakshi
Sakshi News home page

ఏఐ.. పార్కింగ్ ఎక్కడోయ్

Published Sun, Jun 30 2024 2:57 AM | Last Updated on Sun, Jun 30 2024 3:00 AM

AI to help solve parking problems in Telangana

నగరంలో పార్కింగ్‌ సమస్యకు కృత్రిమ మేధతో చెక్‌

రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఈజీపార్క్‌ ఏఐ’ సంస్థ ప్రతిపాదనలు 

ఎక్కడెక్కడ పార్కింగ్‌ స్థలాలు ఉన్నాయో తెలిపేలా ప్రత్యేక యాప్‌ 

పార్కింగ్‌ స్లాట్‌ బుకింగ్, ఆన్‌లైన్‌ పేమెంట్‌ వెసులుబాట్లు కూడా.. 

వాహనదారుల కష్టాలు తీరడంతోపాటు ట్రాఫిక్‌ అంతరాయాలకూ చెక్‌

షాపింగ్‌ కోసం కోఠి వెళ్లారు. అదసలే బిజీ ఏరియా.. ఫుల్‌ ట్రాఫిక్‌.. కారు పార్క్‌ చేయడానికి స్థలం లేదు. దగ్గరలో ఎక్కడ పార్కింగ్‌ ఉందో తెలియదు. రోడ్డు పక్కనే పార్క్‌ చేస్తే.. ట్రాఫిక్‌కు అంతరాయం. పోలీసుల కంట్లో పడితే ఫైన్‌ కట్టక తప్పదు. అదే ఓ యాప్‌ ఉండి, దగ్గరలో పార్కింగ్‌ ఎక్కడుందో తెలిస్తే..? అదీ పార్కింగ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్‌ చేసేసుకోగలిగితే..? ఈ తిప్పలన్నీ తప్పుతాయి కదా.

బిజీ ప్రాంతాల్లో పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుతోపాటు ఇలాంటి వెసులుబాట్లు తెస్తే.. వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై ‘ఈజీపార్క్‌ ఏఐ’ అనే సంస్థ ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్‌ కూడా ఇచి్చంది. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో  పార్కింగ్‌ సమస్యను పరిష్కరించవచ్చని ప్రతిపాదన చేసింది.

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ నగరం ఇప్పటికే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఏటా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అవన్నీ రోడ్లపై తిరగడం సంగతి పక్కనపెడితే.. ఎక్కడో ఓ చోట పార్క్‌ చేయక తప్పదు. షాపింగ్‌ కోసం వెళ్లినా, ఏదైనా పని మీద వెళ్లినా.. పార్కింగ్‌ కోసం తిప్పలే. కార్లే కాదు బైకులు పెట్టడానికీ ఎక్కడా స్థలం లేని దుస్థితి. దీనితో షాపుల ముందు, రోడ్ల పక్కన, గల్లీల్లో వాహనాలను పార్క్‌ చేస్తున్నారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సమస్యగా మారుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటోంది. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, సాయంత్రాలు ఆహ్లాదంగా గడపడానికి వెళ్లే చోట్ల పార్కింగ్‌ పెద్ద ప్రహసనంగా మారింది.

ఎలా పనిచేస్తుంది..
కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) సాయంతో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించే విధానాన్ని ఈజీపార్క్‌ ఏఐ సంస్థ రూపొందించింది. ఆ వివరాల మేరకు.. పార్కింగ్‌ స్థలం నిర్వహించే వారికి ఒక డాష్‌ బోర్డు ఏర్పాటు చేస్తారు. వాహనాలు ఎన్ని వస్తున్నాయి? ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ఎంతసేపు వాహనాలు పార్క్‌ చేస్తారన్న డేటాను దాని ద్వారా అందిస్తుంది. అలా అన్ని పార్కింగ్‌ స్థలాల వివరాలను ఒకచోట క్రోడీకరిస్తుంది.

ఈ వివరాలను ఓ యాప్‌ సాయంతో వాహనదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్‌ ద్వారా ఎక్కడెక్కడ పార్కింగ్‌ స్థలాలు అందుబాటులో ఉన్నాయనేది తెలుస్తుంది. ముందుగానే పార్కింగ్‌ స్లాట్లను బుక్‌ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్‌ చేసుకోవచ్చు. పార్కింగ్‌ ఫీజును కూడా ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించేయొచ్చు. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్లకపోతే.. స్లాట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవచ్చు.  

పార్కింగ్‌ ప్రదేశాల్లో ఇంటర్నెట్‌ ఆధారిత కెమెరాలతో నిఘా ఉంటుంది. వాహనానికి సంబంధించిన అలర్ట్స్‌ వస్తాయి. దొంగతనం, మరేదైనా జరిగితే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉంటాయి. వాహనాలు వెళ్లిపోయి పార్కింగ్‌ స్లాట్లు ఖాళీ అయితే.. వెంటనే యాప్‌లో అప్‌డేట్‌ అయి ఖాళీగా చూపిస్తుంది. కావాల్సిన వారు బుక్‌ చేసుకోవచ్చు. పార్కింగ్‌ స్థలం వద్ద వాహనాలు బయటికి వెళ్లడం, లోపలికి రావడం ప్రత్యేక పరికరాలతో నమోదవుతూ ఉంటుంది. ఆటోమేటిగ్గా వాటి నంబర్లను గుర్తించి అప్‌డేట్‌ చేసే వ్యవస్థ ఉంటుంది.

మల్టీలెవల్‌ పార్కింగ్‌తో.. 
అలాగే హైదరాబాద్‌లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రధాన ప్రాంతాల్లో స్థలాలకు కొరత ఉండటంతో.. మలీ్టలెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఏర్పాటు చేసినా.. అవి ఎక్కడున్నాయో అందరికీ తెలిసే అవకాశం తక్కువ. తెలిసినా పార్కింగ్‌ ఖాళీగా ఉందో లేదో తెలియదు. అక్కడిదాకా వెళ్లి ఖాళీ లేకుంటే.. మళ్లీ మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పార్కింగ్‌ ఖాళీగా ఉందో, లేదో తెలిసి.. ముందే స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ‘ఈజీపార్క్‌ ఏఐ’ అనే సంస్థ ముందుకొచి్చంది. ఇటీవల దీనిపై రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చింది.

భవనాల్లో పార్కింగ్‌ సరిగా లేక.. 
హైదరాబాద్‌లో 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. కార్లు, టూ వీలర్లతోపాటు విద్యాసంస్థల వాహనాలు, ఆటోలు వంటివీ భారీగా ఉన్నాయి. ఇందులో కార్లు, టూవీలర్ల పార్కింగ్‌ కోసం ఇబ్బంది వస్తోంది. ట్రాఫిక్‌లో ఎలాగోలా గమ్యస్థానానికి చేరుకున్న వాహనదారులకు పార్కింగ్‌ విషయంలో తిప్పలు తప్పట్లేదు. పార్కింగ్‌కు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.

పార్కింగ్‌ సమస్యపై జనం ఏమంటున్నారు?
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడంపై ఫోకస్‌ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఓ సమీక్ష సందర్భంగా ప్రకటించారు. ‘ఈజీపార్క్‌ఏఐ’ సంస్థ ప్రజెంటేషన్‌ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి ఐటీని వినియోగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి వాహనాల పార్కింగ్‌ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు కూడా.  

ఎక్కడికెళ్లినా పార్కింగ్‌కు ఇబ్బందే.. 
హైదరాబాద్‌లో, ముఖ్యంగా బిజీ ఏరియాల్లో పార్కింగ్‌ చేయాలంటే చాలా కష్టంగా ఉంటోంది. చాలాసేపు వెతికితే కానీ బండి పెట్టుకోవడానికి ప్లేస్‌ కనబడటం లేదు. చాలా షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో పార్కింగ్‌ ఉండట్లేదు. అంతా రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తున్నారు. అది ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతోంది. – నరేశ్‌గౌడ్‌ లోడి, అంబర్‌పేట

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి 
హైదరాబాద్‌లో పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్‌ విషయంలో ప్రభుత్వం సరైన పాలసీ రూపొందించాలి. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, దుకాణాలకు, వాహనదారులకు అవగాహన కలి్పంచాలి. అప్పుడే నగరవాసులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కల్యాణ్, దిల్‌సుఖ్‌నగర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement