ఓయూలో వైద్య పరికరాల కోర్సు! | Medicine Courses At Osmania University | Sakshi
Sakshi News home page

ఓయూలో వైద్య పరికరాల కోర్సు!

Published Sat, Nov 20 2021 12:54 AM | Last Updated on Sat, Nov 20 2021 12:54 AM

Medicine Courses At Osmania University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్‌... ఉస్మానియా యూనివర్సిటీతో జట్టు కట్టనుంది. ఓయూలో ఏడాది కాలవ్యవధిగల వైద్య పరికరాల పీజీ కోర్సు ఏర్పాటులో సాంకేతిక సహకారాన్ని అందించనుంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో ఇంజనీరింగ్, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన మెడ్‌ట్రానిక్‌... ఈ అంశంపై ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ సహా జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ తదితర విభాగాల ప్రొఫెసర్లతో చర్చించింది. ఈ విషయాన్ని మెడ్‌ట్రానిక్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ నిరంజన్‌ ఎస్‌.గౌడ్‌ తెలిపారు. అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆయన ఇందుకు సంబంధించిన అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఏడాదిలోగా కోర్సు...
‘ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్‌ డివైజెస్‌పై ఏడాది పీజీ కోర్సు ప్రవేశపెట్టాలని సూచించాం. దీనివల్ల విద్యార్థులకు వైద్య పరికరాలకు సంబంధించి పూర్తి విజ్ఞానం అందుతుంది. ఇది రాష్ట్రంలో హెల్త్‌ కేర్‌ రంగం పురోభివృద్ధికి దోహదపడుతుంది. ఏడాదిలోగా కోర్సును ప్రారంభించాలని యోచిస్తున్నాం. డివైజ్‌ అండ్‌ పేషెంట్‌ సేఫ్టీపై పీజీ కోర్సు ఉంటుంది. మేము యువ శాస్త్రవేత్తలను తయారు చేస్తాము.

తత్ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మెడికల్‌ డివైజెస్‌ను విదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనూ వాటి వినియోగం పెరిగింది. మేము చేస్తున్న కృషితో భవిష్యత్తులో రాష్ట్రంలో వైద్య పరికరాలను తయారు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల విదేశాల నుంచి ఖరీదైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వివిధ రకాల చికిత్సలు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి’ అని నిరంజన్‌ గౌడ్‌ తెలిపారు.

జీవనశైలి వ్యాధులు పెరిగాయి
‘భారతీయుల జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోట్లు, మూత్రపిండాల వ్యాధులు అధికమయ్యాయి. ఇలాంటి వ్యాధుల బారినపడ్డ వారి జీవితకాలాన్ని పెంచేందుకు అత్యాధునిక వైద్య పరికరాలను ఉపయోగిస్తారు. దీనివల్ల వారి జీవిత కాలాన్ని పెంచవచ్చు. ఈ తరహా పరికరాలు తయారు చేసే మా కంపెనీని హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఇటీవల ప్రారంభించాం.

నూతన వైద్య పరికరాల భద్రతను మేం పరీక్షిస్తాం. అయితే వాటికి సంబంధించిన శాస్త్రవేత్తలు మన వద్ద లేరు. కొత్త వారికి శిక్షణ ఇవ్వడం, శాస్త్రవేత్తలను ఇక్కడ ఉంచాలనేది మా ప్రయత్నం’ అని నిరంజన్‌ గౌడ్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement