ఎంబీబీఎస్‌ ఫీజు నాలుగున్నరేళ్లకే తీసుకోవాలి      MBBS fee should be taken for four and a half years | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ ఫీజు నాలుగున్నరేళ్లకే తీసుకోవాలి     

Published Thu, Jun 27 2024 3:59 AM | Last Updated on Thu, Jun 27 2024 3:59 AM

MBBS fee should be taken for four and a half years

ఐదేళ్లకు వసూలు చేస్తే కఠినచర్యలు... 

 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు ఫీజు రెగ్యులేటరీ కమిటీ హెచ్చరిక  

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీ బీఎస్‌ ఫీజును ఐదేళ్లకు కాకుండా నాలుగున్నరేళ్లకే తీసుకోవాలని తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ప్రైవేట్‌ కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీచేసింది. ఎంబీబీఎస్‌ కోర్సు నాలుగున్నర ఏళ్లు మాత్రమేనని, అందుకు తగ్గట్టుగానే ఫీజు తీసుకోవాలని సూచించింది. కొన్ని కాలేజీలు ఐదేళ్లకు ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి స్పష్టతను ఇస్తున్నామని తెలిపింది. 

ఉదాహరణకు కోర్సు ఫీజు ఏడాదికి రూ. 14.5 లక్షలు అనుకుంటే, మొత్తం నాలుగున్నర ఏళ్లకు కలిపి రూ. 65.25 లక్షలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తాన్ని ఐదు ఇన్‌స్టాల్‌మెంట్లలో విద్యార్థుల నుంచి తీసుకోవాలని, ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు రూ. 13.05 లక్షలు మాత్రమే తీసుకోవాలని సూచించింది. దీనివల్ల ఆరు నెలలు అదనంగా వసూలు చేస్తున్న ఫీజుల భారం విద్యార్థులపై పడదని తెలిపింది. 

ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజును ఐదు సమాన వాయిదాలలో వసూలు చేయాలని, మేనేజ్‌మెంట్లు ముందుగా ఫీజును వసూలు చేయరాదని కమిటీ సిఫార్సు చేసింది. అంటే ఎంబీబీఎస్‌ విద్యార్థుల వద్ద కోర్సు మొత్తానికి ఒకేసారి ఫీజు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలను ఫీజు రెగ్యులేటరీ కమిటీ హెచ్చరించింది. ఏ యేడాది ఫీజును ఆ ఏడాది మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, ప్రతీ ఏడాది టీఏఎఫ్‌ఆర్‌సీ ఇలా ఆదేశాలు ఇస్తున్నా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు లెక్కచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement