చదువుకు షాన్ దార్! international education available in hyderabad | Sakshi
Sakshi News home page

చదువుకు షాన్ దార్!

Published Sun, Jun 23 2024 1:18 AM | Last Updated on Sun, Jun 23 2024 1:18 AM

international education available in hyderabad

నగరంలో అందుబాటులో ‘అంతర్జాతీయ’విద్య

సువిశాల ప్రాంగణాలు, సకల సదుపాయాలతో పాఠశాలలు

సీబీఎస్‌ఈతో పాటు ఐబీ, కేంబ్రిడ్జి స్థాయి సిలబస్‌తో బోధన

విదేశీ సంస్థలు, బడులతో అనుసంధానం.. అనుభవాలు పంచుకునేలా ఏర్పాట్లు 

పాఠాలతో పాటు మానసిక, శారీరక వికాసానికి ప్రత్యేక శ్రద్ధ 

ఆటలు, పాటలు, సృజనాత్మకత పెంపొందేలా కార్యక్రమాలు 

ఫీజులు కూడా ‘అంతర్జాతీయ స్థాయి’లోనే..!

ఎండాకాలం సెలవుల తర్వాత స్కూల్స్‌ మళ్లీ తెరుచుకున్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు మళ్లీ బిజీ బిజీ అయిపోయారు. విద్యార్థుల్ని పాఠశాలలకు తీసుకెళ్లే వాహనాలతో ఉదయం వేళ రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. పిల్లల భవిష్యత్తును నిర్దేశించేది పాఠశాలే కదా..అందుకే కొత్తగా పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అందుబాటులో ఉన్న స్కూళ్లలో వసతులు, బోధన సౌకర్యాలు ఇతరత్రా అన్నీ పరిశీలించి పిల్లలను చేర్పిస్తుంటారు.

అయితే హైదరాబాద్‌లో అన్ని రకాల స్కూళ్లూ ఉన్నాయి. వీటిల్లో ఆ స్కూలు స్థాయిని బట్టి ఫీజుల్లో అంతరం, సిలబస్‌లో తేడా ఉంటుండగా.. వివిధ రకాల ప్రత్యేకతలతో యాజమాన్యాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌లో వేల సంఖ్యలో స్కూల్స్‌ ఉన్నాయి. కొన్ని స్కూల్స్‌లో స్టేట్‌ సిలబస్‌.. కొన్నింటిలో సీబీఎస్‌ఈ, మరికొన్నింటిలో ఐసీఎస్‌ఈ సిలబస్‌ చెబుతుంటారు. ఇక అంతర్జాతీయ పాఠశాలలు పరిగణించే కొన్ని స్కూళ్లు కూడా నగరంలో ఉన్నాయి. అలాంటి పాఠశాలలు ఏవి? ఎలాంటి వసతులు అందిస్తున్నాయి? నిజంగానే అంతర్జాతీయ స్థాయి విద్య, బోధన ఉందా?, ఫీజుల మాటేమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  ..సాక్షి, హైదరాబాద్‌..

అంతర్జాతీయ సిలబస్‌..
విద్యా బోధన, వసతులు, ప్రత్యేకతల్లో కొత్త పుంతలు తొక్కుతూ కార్పొరేట్‌ స్థాయి స్కూల్స్‌ అనేకం నగరంలో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులతో హైదరాబాద్‌లో అనేక స్కూళ్లు వెలిశాయి. సీబీఎస్‌ఈతో పాటు ఇంటర్నేషనల్‌ బాకలరేట్‌ (ఐబీ), ఇంటర్నేషనల్‌ జనరల్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ఐజీసీఎస్‌ఈ), కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (సీఐఈ), బ్రిటిష్‌ కౌన్సిల్, ఇంటర్నేషనల్‌ బాకలరేట్‌ ప్రైమరీ ఇయర్స్‌ ప్రోగ్రామ్‌ (ఐబీ పీవైపీ), కౌన్సిల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ (సీఐఎస్‌) తదితర సిలబస్‌ల పేరిట తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి.

మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ (యూనిసెఫ్‌) వంటి సంస్థలతో, విదేశాల్లోని పాఠశాలలతో అను సంధానమై.. అక్కడి విద్యార్థులతో నేరుగా మాట్లాడేలా, చదువులో వారి అనుభవాలను ఇక్కడి విద్యార్థులతో పంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. తద్వారా విద్యార్థుల్లో చదువుపై ఉన్న అవగాహనలో మార్పు వచ్చేలా, అంతర్జాతీయ స్థాయి ఆలోచనా విధానం అలవడేలా కృషి చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు.

వసతులు ఎలా ఉంటాయి?  
దాదాపుగా అన్ని పాఠశాలలు సమాన స్థాయిలో వసతులు అందిస్తున్నాయి. విశాలమైన తరగతి గదులు, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్, ఆర్ట్‌ స్టూడియోలు, లాంగ్వేజ్‌ ల్యాబ్స్, డ్యాన్స్, మ్యూజిక్‌ రూమ్స్, విశాలమైన ప్లే గ్రౌండ్, ఆడిటోరియం, ఆంఫీ థియేటర్, డైనింగ్‌ హాల్స్‌ వంటి ఎన్నో సౌకర్యాలు ఉంటున్నాయి. ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంతో కళా నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తు న్నారు.

 గుర్రపు స్వారీ, స్విమ్మింగ్‌తో పాటు క్రీడల్లోనూ తర్ఫీదునిస్తున్నారు. దాదాపు అన్ని ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ కూడా సువిశాలమైన ప్రాంగణాల్లో వ్యక్తిత్వ వికాసం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని ఓ స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. మానసిక ఎదుగుదల కోసం కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపుగా అన్ని స్కూళ్లు 100 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఉన్నాయి. చెట్లు, పచ్చిక బయళ్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు.

బోధన ఎలా?
విద్యార్థులకు పుస్తకాలే ప్రపంచం అనేలా కాకుండా వినూత్నమైన బోధనా పద్ధతులు అవలంభిస్తున్నారు. వివిధ రకాల సిలబస్‌ల్లో శిక్షణ పొందిన నిష్ణాతులైన టీచర్లను యాజమాన్యాలు నియమించుకుంటున్నాయి. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో విద్యార్థులకు ఎలాంటి బోధన అందిస్తున్నారో పరిశోధనలు చేసి అలాంటి పద్ధతులను ఇక్కడ అనుసరిస్తున్నారు. బొమ్మల రూపాల్లో, కళాత్మక రూపాల్లో పిల్లలకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తున్నారు.

కామన్‌ గ్రౌండ్‌ కొలాబరేటివ్‌ మెథడాలజీ విధానంలో పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా చెబుతున్నారు. దీంతో పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందని ఓ నిర్వాహకుడు చెప్పారు. ఈ క్రమంలో కొన్ని స్కూళ్లు విదేశీ టీచర్లను సైతం నియమిస్తున్నాయి. ఇక్కడి బోధనా పద్ధతులు నచ్చి విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడ చేరుతుండటం గమనార్హం.

పిల్లల్ని చేర్పించాలంటే..
ముందుగా పాఠశాల వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత స్కూల్‌ టూర్‌ ఏర్పాటు చేస్తారు. స్కూల్‌లో ఉన్న వసతులు చూసుకున్నాక నచ్చితే ఫీజు, కర్రిక్యులమ్, లొకేషన్, రవాణా సదుపాయాలు వంటి వివరాలను అడ్మిషన్‌ అధికారితో మాట్లాడుకోవాలి. ఆ తర్వాత మీకు అప్లికేషన్‌ ఫారం లింక్‌ పంపిస్తారు.

అందులో మీ పిల్లల పూర్తి వివరాలు నింపి సబ్మిట్‌ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలను అడ్మిషన్‌ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వాళ్లు మీ వివరాల విషయంలో సంతృప్తి చెందితే సమాచారం పంపిస్తారు. ఆ తర్వాత టర్మ్‌ ఫీజు చెల్లించి సీటు పొందాలి. అయితే కొన్ని పాఠశాలల్లో ఎంట్రన్స్‌ పరీక్ష కూడా ఉంటుంది. అందులో మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఫీజుల మాటేమిటి? 
ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ కాబట్టి ఫీజులు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ప్రీ నర్సరీకే ఏడాదికి కనీసం రూ.3.2 లక్షల ఫీజు ఉంది. ఇక సీబీఎస్‌ఈ సిలబస్‌ అయితే ఒకలా.. ఐబీ ప్రోగ్రామ్‌ అయితే మరోలా ఫీజులు ఉన్నాయి. 12వ తరగతికి కనీసం రూ.10.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.16 లక్షల వరకు ఉంది.  

టాప్‌ స్కూల్స్‌ ఇవే..  
ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, ఆగాఖాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, మ్యాన్‌చెస్టర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, గాడిమయ్‌ స్కూల్, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ హైదరాబాద్, శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్, బిర్లా ఓపెన్‌ మైండ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, గ్లెండేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, మెరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వంటివి టాప్‌ స్కూల్స్‌ జాబితాలో ఉన్నాయి.

చదువుతో పాటు నైపుణ్యాల పెంపుదల
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య అందించేందుకు చాలా కృషి చేస్తున్నాం. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా ఇక్కడ నేర్పిస్తాం. మేం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్‌లో బోధిస్తున్నాం. బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత స్కూళ్లతో అనుసంధానమై అక్కడి బోధనా పద్ధతులను అనుసరిస్తున్నాం. చదువుతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంపొందించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. – కందాడి కొండల్‌రెడ్డి, మాంచెస్టర్‌ గ్లోబల్‌ స్కూల్‌ చైర్మన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement