Seasonal Infections Fear Due To Covid And Omicron Cases Spike In Hyderabad - Sakshi
Sakshi News home page

జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని?

Published Tue, Jan 18 2022 8:05 AM | Last Updated on Tue, Jan 18 2022 1:35 PM

As Covid Cases Spike in Hyderabad, And Surge In Seasonal Infections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎల్లారెడ్డిగూడకు చెందిన సతీష్‌కు 10 రోజులుగా జలుబు, దగ్గు. రాత్రిళ్లు శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. ఇంటి వైద్యాలు, అలవాటైన మందులు వాడుతున్నా తగ్గినట్టే తగ్గుతూ పెరుగుతూ ఉంది. జలుబూ దగ్గు వదలకపోవడం ఒళ్లునొప్పులు, తేలికపాటి జ్వరం.. ఇవన్నీ చూసి కరోనా పరీక్షలు చేయించుకోమంటూ సన్నిహితులు పోరు చేస్తున్నారు.. ప్రస్తుతం నగరంలో అనేక మందికి సతీష్‌ లాంటి పరిస్థితి ఎదురవుతోంది. తమకు వచ్చింది సాధారణ సీజనల్‌ సమస్యా? కరోనా? అనే సందేహాలతో సతమతమవుతున్నవారు. ఇలాంటివారు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నారు.  

కష్టాలు పెంచిన వర్షాలు... 
గత కొన్ని రోజులుగా నగరంలో చలి తీవ్రతను మించి వర్షాలు,  చలిగాలుల తాకిడి ఎక్కువైంది. ఇది సహజంగానే సిటిజనుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ వైపు వింటర్‌ సీజన్‌. మరోవైపు అకాల వర్షాలు.. దీంతో సీజనల్‌గా వచ్చే జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‌.. వంటివి మరింతగా పెరిగాయి. మరోవైపు  కరోనా సైతం విజృంభిస్తుండడం దీని లక్షణాలు కూడా దాదాపుగా అవే కావడంతో ఏది సాధారణ వ్యాధో, ఏది మహమ్మారో తెలియక నగరవాసులు అయోమయానికి, భయాందోళనకు గురవుతున్నారు. పరీక్షకు వెళ్లాలంటే ఓ రకమైన భయం, వెళ్లకపోతే మరో రకమైన భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కంగారు పడవద్దని కాస్త అప్రమత్తంగా ఉంటే చాలని వైద్యులు చెబుతున్నారు.  
చదవండి: ‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు’

సాధారణమైతే సందేహం వద్దు.. 
జలుబు, దగ్గు కొందరికి సీజనల్‌గా దాదాపు ప్రతి యేటా  వస్తుంటాయి. అలాంటివారికి ఈ అకాల వర్షాల వాతావరణంలో మరింత సులభంగా వస్తాయి. అంతేకాకుండా అస్తమా, డయాబెటిస్‌ వంటి వ్యాధులున్నా, బైపాస్‌ సర్జరీ చేయించుకున్నా, స్టంట్‌ వేయించుకున్న వారిలో సహజంగానే ఇమ్యూనిటీ తక్కువగా ఉండి శ్వాసకోస వ్యాధులు, సీజనల్‌ ఫ్లూ రావచ్చు.

► ఇలాంటి వారు చల్లటి వస్తువులు తీసుకోవడం, చల్లటి ప్రదేశాల్లో ఉండడం, వర్షంలో తడవాల్సి రావడం వల్ల ఈ సమస్యలు రెట్టింపవుతాయి. వెంటనే ఇది కరోనా కావచ్చని ఆందోళన చెందనక్కర్లేదు. అలాగే ఎక్కువగా బయటకు వెళ్లాల్సిన, సమూహాల్లో పనిచేయాల్సిన అవసరం లేనివాళ్లు కూడా బెంబేలెత్తనవసరం లేదు. అలాగని మరీ నిర్లక్ష్యం చేయకూడదనీ వైద్యులు చెబుతున్నారు. 
చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్‌!

3 రోజులు దాటితే... 
తగినంత ఇమ్యూనిటీ ఉండి, సీజనల్‌ వ్యాధులకు గురయ్యే మెడికల్‌ హిస్టరీ లేనివాళ్లు, జ్వరం, ఒళ్లునొప్పులు తదితర సమస్యలు 3 రోజులు దాటి ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ కరోనా అని తేలినా ఆందోళన చెందనవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే 2 వారాల వ్యవధిలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఏదేమైనా భయాందోళనలకు గురికాకపోవడం అన్నిరకాలుగా మంచిది. ఏ సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభం నుంచే వైద్యుల సలహా మేరకు నడచుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో అవసరం.  పాజిటివ్‌ పెరుగుతున్నా...

తీవ్రత లేదు 
సీజనల్‌ వ్యాధులన్నీ కరోనా కావచ్చనే భయం సహజమే అయినా అన్నీ అవుతాయనుకోలేం.  ఫ్లూ లక్షణాలు 3 రోజులు పైబడి ఉన్నవారికి కరోనా పరీక్షలు తప్పనిసరిగా సిఫారసు చేస్తున్నాం. అలా సిఫారసు చేస్తున్నవారిలో ప్రస్తుతం గత 10 రోజులుగా చూస్తే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారే ఎక్కువ. గతంలో ఉన్నంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకపోవడం మాత్రం ఊరట కలిగించే అంశం. 
– డా.జి.నవోదయ, కేర్‌ ఆస్పత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement