ఈ టీమిండియా స్టార్ల సక్సెస్‌ వెనుక హీరోలు తండ్రులే..! | Father's Who Played Key Roles In Indian Star Cricketers Career | Sakshi
Sakshi News home page

ఈ టీమిండియా స్టార్ల సక్సెస్‌ వెనుక హీరోలు తండ్రులే..!

Published Sun, Jun 16 2024 9:25 AM

Father's Who Played Key Roles In Indian Star Cricketers Career

ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి హీరో, మొదటి గురువు నాన్నే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాలంటే అందులో కీలకపాత్ర తండ్రిదే. నాన్న పిల్లల చేయి పట్టుకుని ప్రపంచానికి పరిచయం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. పిల్లల ఉన్నతి కోసం అహర్నిశలూ శ్రమించి సర్వస్వం ధారపోస్తాడు.

తాను పడ్డ కష్టాలు, తాను చేసిన త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తి నాన్న. అలాంటి త్యాగమూర్తికి 'ఫాదర్స్ డే'ను (జూన్‌ 16) పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేద్దాం.

ప్రతి మనిషి సక్సెస్‌ వెనుక నిజమైన హీరో తండ్రే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాడంటే దాని వెనుక తండ్రిదే ప్రధానపాత్ర. ఫాదర్స్‌ డే సందర్భంగా క్రీడారంగానికి (క్రికెట్‌) సంబంధించి బిడ్డల కోసం త్యాగాలు చేసిన తండ్రులపై ఓ ప్రత్యేక కథనం.

శుభ్‌మన్‌ గిల్‌-లఖ్విందర్‌ సింగ్‌: భారత క్రికెట్‌ జట్టు ప్రిన్స్‌గా పిలువబడే శుభ్‌మన్‌ గిల్‌ తండ్రి పేరు లఖ్విందర్‌ సింగ్‌. లఖ్విందర్‌ సింగ్‌ తన కొడుకు క్రికెట్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. గిల్‌ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో రాణిస్తున్నాడంటే అది తండ్రి లఖ్విందర్‌ చలువే. గిల్‌ కెరీర్‌ కోసం లఖ్విందర్‌ ఎన్నో త్యాగాలు చేశాడు. 

ఇండియా-పాకిస్తాన్‌ బోర్డర్‌లోని ఫాజిల్కా అనే కుగ్రామానికి చెందిన లఖ్విందర్‌.. కొడుకు కెరీర్‌లో కోసం 300 కిమీ దూరంలో ఉన్న మొహాలీ నగరానికి మకాం మార్చాడు. గిల్‌ను క్రికెటర్‌ చేసేందుకు లఖ్విందర్‌ 15 సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నాడు. తిండి పెట్టే వ్యవసాయాన్ని సైతం వదిలి పెట్టి నగరవాసం చేశాడు.

గిల్‌ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో లఖ్విందర్‌ తన గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి హాజరు​కాలేదు. తాను ఫంక్షన్లకు వెళితే కొడుకు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఏవో కారణాలు చెప్పి హాజరయ్యేవాడు కాదు. గిల్‌కు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించిన లఖ్విందర్‌ ఊరిలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. తానే కోచ్‌గా మారి గిల్‌ను ప్రతి రోజు 500-700 బంతులు ఆడేలా చేసేవాడు. బ్యాట్‌తో ఆడేప్పుడు మిడిల్‌ చేసేందుకు తోడ్పడుతుందని వికెట్‌తో ప్రాక్టీస్‌ చేయించేవాడు. గిల్‌ ప్రస్తుత తరం క్రికెటర్లలో అగ్రగణ్యుడిగా ఉన్నాడంటే దాని వెనుక తండ్రి లఖ్విందర్‌ చేసిన ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి.

యువరాజ్‌ సింగ్‌-యోగ్‌రాజ్‌ సింగ్‌: టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్‌, టు టైమ్‌ వరల్డ్‌కప్‌ విన్నర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి పేరు యోగ్‌రాజ్‌ సింగ్‌. స్వతాహాగా క్రికెటర్‌ అయిన యోగ్‌రాజ్‌ సింగ్‌.. యువరాజ్‌ క్రికెట్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్‌ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన యోగ్‌రాజ్‌.. క్రికెట్‌లో తాను సాధించలేని ఉన్నతిని తన కొడుకు ద్వారా సాకారం చేసుకోవాలని కోరుకున్నాడు. 

ఇందుకోసం తన కొడుకు చాలా కష్టపెట్టాడు. యువరాజ్‌కు చిన్నతనంలో క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. యువరాజ్‌ స్కేటింగ్‌లో రాణించాలని అనుకున్నాడు. ఇందులో ఓ గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించాడు. తన కొడుకు క్రికెటర్‌గానే రాణించాలని భీష్మించుకు కూర్చున్న యోగ్‌రాజ్‌.. యువరాజ్‌ సాధించిన గోల్డ్‌ మెడల్‌ను విసిరికొట్టి, క్రికెట్‌పై ఏకగ్రాత సాధించేలా చేశాడు. 

తొలుత అయిష్టంగానే క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన యువరాజ్‌ నెమ్మదిగా ఆటపై పట్టు సాధించి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకున్నాడు. యువరాజ్‌ తండ్రి మాట పెడచెవిన పెట్టి ఉంటే భారత్‌ క్రికెట్‌ ఓ గొప్ప యోధుడి సేవలను కోల్పోయి ఉండేది. యువరాజ్‌ సభ్యుడిగా ఉన్న భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ టైటిళ్లను సొంతం చేసుకుంది.

సర్ఫరాజ్‌ ఖాన్‌-నౌషద్‌ ఖాన్‌: టీమిండియా యంగ్‌ తరంగ్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి పేరు నౌషద్‌ ఖాన్‌. సర్ఫరాజ్‌ అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో (టెస్ట్‌ల్లో) అడుగుపెట్టిన తొలినాళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నాడంటే దాని వెనుక అతని తండ్రి ఊహకందని త్యాగం, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. చిన్నతనం నుంచి సర్ఫరాజ్‌ను క్రికెటర్‌ చేయాలని పరితపించిన నౌషద్‌ ఖాన్‌ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన కొడుకు ఉన్నతి కోసం​ అహర్నిశలు శ్రమించాడు. 

ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు నౌషద్‌ తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు. సర్ఫరాజ్‌కు తండ్రే కోచ్‌గా, మెంటార్‌ వ్యవహరించాడు. సర్ఫరాజ్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నౌషద్‌ బిడ్డతో పాటు శ్రమించి తాననుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్‌ టీమిండియా అరంగేట్రం ప్రతి క్రికెట్‌ అభిమానిని భావోద్వేగానికి గురి చేసింది. సర్ఫరాజ్‌ తొలి టెస్ట్‌కు ముందు నౌషద్‌ మైదానంలో కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి భారతీయుడి మనసును హత్తుకున్నాయి.  


 

 

Advertisement
 
Advertisement
 
Advertisement