కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు KTR Comments On Congress Over Party Defections Issue | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు

Published Tue, Jun 25 2024 6:25 AM | Last Updated on Tue, Jun 25 2024 6:25 AM

KTR Comments On Congress Over Party Defections Issue

ఆ పార్టీ గతంలోనూ ఫిరాయింపులు ప్రోత్సహించింది 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజం 

ఎన్‌డీఏ జాతీయ విధ్వంస కూటమిగా మారిందని విమర్శ  

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు స్పష్టం చేశారు. అధికార మత్తుతో విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి అధికారంలో ఉన్న వారి బలం కంటే ఎప్పుడూ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో సోమవారం ఆయన ఈ మేరకు పోస్ట్‌ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్‌ అనేకసార్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ నీతిలేనితనంపై గతంలోనూ తెలంగాణ ప్రజలు ఆందోళన చేశారని, చరిత్ర పునరావృతమవుతుందని కేటీఆర్‌ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌కు ఇలాంటి కష్ట సమయాలు కొత్త కాదని అన్నారు.  

బీజేపీ తలాతోకా లేని నిర్ణయాలు 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకుంటున్న తలాతోకా లేని నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌ 4న నీట్‌ యూజీ పేపర్‌ లీక్, 19న యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు, 21న సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ వాయిదా, 22న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా వంటివి బీజేపీ అసంబద్ధ నిర్ణయాలకు తార్కాణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఓ వైపు నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ జూలై 6 నుంచి కౌన్సెలింగ్‌కు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విమర్శించారు. మరోవైపు ఎలాంటి సహేతుక కారణాలు లేకుండానే నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కొద్ది గంటల ముందు రద్దు చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ్ధత విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారిందని, ఎన్‌డీఏ నేషనల్‌ డిజాస్టర్‌ అలయెన్స్‌ (జాతీయ విధ్వంస కూటమి)గా మారిందని కేటీఆర్‌ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement