అవంతిక, అరబిందో గురించి నోరుమెదపరేం? CM Revanth counters KTR as X platform on coal mine auction | Sakshi
Sakshi News home page

అవంతిక, అరబిందో గురించి నోరుమెదపరేం?

Published Sat, Jun 22 2024 4:01 AM | Last Updated on Sat, Jun 22 2024 4:05 AM

CM Revanth counters KTR as X platform on coal mine auction

బొగ్గు గనుల వేలంపై ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ కౌంటర్‌ 

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రజల బాధలు, మాటలు పట్టించుకోలేదని విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: గత పదేళ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకోకుండా కనీసం వారి మాటలను వినడానికి కూడా ఇష్టపడని బీఆర్‌ఎస్‌ నేతలు... ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అయినా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్‌ వైఖరిని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌ శుక్రవారం రాత్రి ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చా రు.

‘కేటీఆర్‌ గారు... మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం, గత కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ శ్రేణు లు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసి రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే.

అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? మా ఉప ముఖ్యమంత్రి సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. అవంతిక, అరబిందో కంపెనీలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి సింగరేణికి ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్‌ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కులను కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడతాం. అటు సింగరేణిని, ఇటు ఓఆర్‌ఆర్‌ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం’ అని సీఎం రేవంత్‌ ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌లో విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement