ఒత్తిళ్లకు లొంగొద్దు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్‌ BRS Leader KCR Comments With Party Leaders | Sakshi
Sakshi News home page

ఒత్తిళ్లకు లొంగొద్దు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్‌

Published Thu, Jun 27 2024 4:48 AM | Last Updated on Thu, Jun 27 2024 4:48 AM

BRS Leader KCR Comments With Party Leaders

తొందరపాటు నిర్ణయాలతో చెడ్డపేరు తెచ్చుకోవద్దు 

బీఆర్‌ఎస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది 

ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఎత్తిచూపేలా కార్యాచరణ 

పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: పార్టీలో చేరాలంటూ ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోకుండా పార్టీ కోసం పనిచేయాలని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిలో మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కాలేరు వెంకటేశ్‌ (అంబర్‌పేట), మర్రి రాజశేఖర్‌ రెడ్డి (మల్కాజిగిరి), లక్ష్మారెడ్డి (ఉప్పల్‌)తో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఉన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత చర్చించారు. 

అధికార పార్టీ పెట్టే ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గి పొరపాట్లు చేయొద్దని, బీఆర్‌ఎస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారమే పరమావధిగా పనిచేసే వారికి ప్రజల్లో ఆదరణ ఉండదని గతంలో అనేక పర్యాయాలు నిరూపితమైందన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రజా జీవితంలో చెడ్డపేరు తెచ్చుకోవద్దని చెప్పినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కేసీఆర్‌ కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ సర్కారు పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ సంకేతాలు ఇచ్చారని సమాచారం.  

ఎర్రవల్లికి తరలివస్తున్న నేతలు 
ట్రాఫిక్, పార్కింగ్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతున్న నాయకులకు ఎర్రవల్లి నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానం అందుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎర్రవల్లికి వస్తున్నారు. అలాగే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఇతర ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా కేసీఆర్‌ను కలుస్తున్నారు. 

ఆయన ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారితో ఫోటోలు దిగుతున్నారు. త్వరలో జిల్లాల వారీగా కేసీఆర్‌ పర్యటనలు ఉంటాయని, స్థానికంగా బస చేసి కార్యకర్తలను కలుస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాష్ట్ర కార్యవర్గం పునర్వ్వస్థీకరణ, క్షేత్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు, అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై త్వరలో కేసీఆర్‌ షెడ్యూల్‌ ప్రకటించే అవకాశముంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement