ఏపీ బీజేపీని ముంచేసిన పురందేశ్వరి | Bjp Circles Criticized On Purandeswari | Sakshi
Sakshi News home page

ఏపీ బీజేపీని ముంచేసిన పురందేశ్వరి

Published Thu, Apr 25 2024 2:31 PM | Last Updated on Thu, Apr 25 2024 2:31 PM

Bjp Circles  Criticized On Purandeswari

ఏపీ బీజేపీని పూర్తిగా ముంచారు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి. బీజేపీ తరపున టికెట్ కావాలంటే వారు టీడీపీ నుంచి వచ్చిన వారైనా అయి ఉండాలి లేదంటే మనోళ్లు అయినా అయి ఉండాలి. ఈ రెండూ కాకపోతే మాత్రం టికెట్‌పై ఆశలు పెట్టుకోవలసిన అవసరం లేదు. చంద్రబాబు పార్టీకి బీజేపీని బ్రాంచి కార్యాలయంగా మార్చేశారని పురందేశ్వరిపై బీజేపీ వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా చంద్రబాబు ఆదేశించడమే ఆలస్యం బీజేపీ నేతకు కేటాయించిన సీటును కూడా వెనక్కి తీసుకున్నారు పురందేశ్వరి. దీనిపై నిన్నటిదాకా ప్రచారం చేసిన నాయకుని అనుచరులు నిప్పులు చెరుగుతున్నారు. పురందేశ్వరి తీరుతో ఏపీ బీజేపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ట్వీట్ చేశారు. మరో నేత ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇదేం పొత్తుల ధర్మం అంటూ ట్వీట్ చేశారు.

ఏపీ బీజేపీలో మొదట్నుంచీ ఉన్న సీనియర్ నాయకులు జీవిఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి వారికి టికెట్లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు పురందేశ్వరి. తాజాగా  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానంలోనూ చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు  ఒరిజినల్ బీజేపీ నేతకు ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకుని.. ఆ సీటును చంద్రబాబు నాయుడి పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టారు.

అనపర్తి నియోజక వర్గంలో టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణకు టికెట్ ఇవ్వకుండా ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. దీనిపై నల్లమిల్లి వర్గం నిప్పులు చెరిగింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేయాల్సిందే అని నల్లమిల్లిని ఆయన అనుచరులు పట్టుబట్టారు.

తమకి కేటాయించిన ఈ సీటులో బీజేపీ నాయకత్వం మాజీ సైనికుడు  బీజేపీకి మొదట్నుంచీ విధేయుడు అయిన శివరామ కృష్ణంరాజుకు కేటాయించారు. అప్పట్నుంచీ శివరామకృష్ణంరాజు నియోజక వర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. నల్లమిల్లి రామకృష్ణ వర్గం తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు కంగారు పడ్డారు. నల్లమిల్లిని దూరం చేసుకోవడం ఎందుకనుకున్న చంద్రబాబు బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటులోనూ తమ అభ్యర్ధినే బరిలో దింపాలని అనుకున్నారు. అంతే పురందేశ్వరితో మంతనాలు జరిపి అనపర్తి సీటులో టీడీపీ నాయకుడైన నల్లమిల్లికి బీజేపీ కండువా కప్పి టికెట్ కేటాయించాల్సిందిగా సూచించారు.

చంద్రబాబు నాయుడి కోసమే  ఏపీ బీజేపీ పనిచేయాలని అనుకుంటోన్న పురందేశ్వరి మరో ఆలోచనే చేయకుండా నల్లమిల్లికి టికెట్ ఇవ్వడానికి సై అన్నారు.  ప్రచారం చేసుకుంటోన్న బీజేపీ నాయకుడు శివరామ కృష్ణం రాజును ఇక ప్రచారం చేయద్దని ఆదేశించారు.

రాజమండ్రి రూరల్ సీటు విషయంలోనూ ఇంతే. నిజానికి అక్కడ బీజేపీ సీనియర్ నేత  సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వాలి. అయితే ఆయన బీజేపీ చీఫ్‌గా ఉండగా నిత్యం చంద్రబాబును విమర్శించేవారు. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వద్దని పురందేశ్వరిని ఆదేశించారు చంద్రబాబు. ఆ సీటును ముందుగా జనసేనకు కేటాయించిన చంద్రబాబు.. జనసేనకు కూడా వెన్నుపోటు పొడిచి ఆ సీటును తమ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారు.

హిందూపురం సీటు ఆశించిన పరిపూర్ణానంద స్వామికి కూడా చివరి నిముషంలో చుక్కెదురైంది. ఆయన్ను పక్కన పెట్టి ఆ సీటును టీడీపీకి వదులు కున్నారు పురందేశ్వరి. దీంతో  కుత కుతలాడిపోతోన్న పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. విశాఖ ఎంపీ స్థానాన్ని ఆశించిన జీవీఎల్ నరసింహారావుకు మొండి చెయ్యి చూపించి తమ బంధువు, తన తమ్ముడి అల్లుడు అయిన గీతం భరత్‌కు కేటాయించారు పురందేశ్వరి. రాయలసీమలో విష్ణువర్ధన్‌రెడ్డికి కూడా ఇలానే మోసం చేశారు. సంప్రదాయ బీజేపీ నేతలు ఎవరికీ  టికెట్లు కేటాయించలేదు పురందేశ్వరి.

పురందేశ్వరి వైఖరితో ఏపీ బీజేపీ భూస్థాపితం అయ్యేలా కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు మండి పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ   బ్రాంచి కార్యాలయంగా మారిపోయిందని.. చంద్రబాబే ఏపీ బీజేపీకి అనధికార సిఇఓగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో  సెటైర్లు వినిపిస్తున్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement