పేదవాడి ప్రాణం.. ఖరీదెంత?! - | Sakshi
Sakshi News home page

Medical Mafia: పేదవాడి ప్రాణం.. ఖరీదెంత?!

Published Mon, Feb 19 2024 6:08 AM | Last Updated on Mon, Feb 19 2024 10:31 AM

- - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌ : ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రికి వస్తే.. వచ్చిన రోగం పోవడం దేవుడెరుగు.. అసలు ప్రాణమే లేకుండా పోతే..! ఆ ప్రాణానికి ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారు కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు. పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారు సైతం వైద్యులకే వత్తాసు పలుకుతూ బాధిత కుటుంబాల్లో కన్నీరు మిగిలిస్తున్నారు.

ఒక్కోసారి రోగులు, వారి బంధువులును సైతం బెదిరించి విషయం బయటికి పొక్కకుండా పెద్ద మనుషులు (రౌడీ షీటర్లు) ఆయా ఆస్పత్రులకు అండగా నిలుస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు వారిని పెంచి పోషిస్తున్నారని ప్రజలకు తెలిసిన విషయమే.

అనేక చావులను బయటికి రానీయకుండా ప్రాణాలకు ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీరికి అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా వైద్యధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వైద్యుల నిర్లక్ష్యాన్ని తెలిపే ఘటనలు ఇలా..
● దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామానికి చెందిన దాసరి యల్లయ్య తన కూతురు మీనాక్షి(9)తో కలిసి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఈ నెల 14వ తేదీన మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డీకాలనీలో గల ఓ వైద్యశాలకు తీసుకొచ్చారు. బాలికలను పరీక్షించిన ఎముకల వైద్యుడు కాలికి ఆపరేషన్‌ చేయాలని థియేటర్‌కు తీసుకెళ్లి ఎముకల వైద్యుడే మత్తు మందు ఇచ్చాడు.


మిర్యాలగూడలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న రోగి బంధువులు (ఫైల్‌)

కొద్ది సేపటికే బాలిక అపస్మారక స్థితిలోకి పోవడంతో ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన వైద్యుడు బాలిక పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాలని చెప్పి స్వయంగా అంబులెన్స్‌ ఏర్పాటు చేసి హడావుడిగా వారిని హైదరాబాద్‌ తరలించి ఆస్పత్రికి తాళం వేసి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌కు తీసుకెళ్లే సరికి ఆ బాలిక మృతిచెందింది. వెంటనే పెద్ద మనుషులు రంగంలోకి దిగి బాలిక ప్రాణానికి రూ.5లక్షలు ఖరీదు కట్టారు.

● గత సంవత్సరం ఆగస్టు 30న త్రిపురారం మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన మాతంగి రాధ (38) కడుపునొప్పితో బాధపడుతూ మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్‌ కాలనీలో గల ఓ మల్టీసెపషాలిటీ ఆస్పత్రికి వచ్చింది.

ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు ఆపరేషన్‌ చేసి గర్భసంచి తొలగించారు. వారంరోజుల తరువాత డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రాధకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడిన కుటుంబ సభ్యులు తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు వైద్య సేవలు ప్రారంభించారు. అయినప్పటికీ మహిళ ఆరోగ్యం బాగు పడకపోగా మరింత క్షీణించింది.

దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండకు తరలించి చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. కాగా పెద్ద మనుషుల జోక్యంతో మృతురాలి కుటుంబానికి రూ.3 లక్షలు ఇచ్చారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిబంధనలకు నీళ్లు..
అన్నీ మావే.. అంతా మాకే.. అన్నట్లుగా ఉంది మిర్యాలగూడలో వైద్యులు తీరు. ఆస్పత్రులతోపాటు ల్యాబ్‌, మెడికల్‌ షాప్‌ వంటి వ్యాపారాలన్నీ వారే ఏర్పాటు చేసుకుని ఎలాంటి అర్హత లేని సిబ్బందిని పనిలో పెట్టుకుని రోగుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ఏదైనా రోగం వచ్చిందని వైద్యుడి వద్దకు వెళ్తే.. అవసరం లేకపోయినా అన్ని రకాల పరీక్షలు రాసి తమవద్దే చేయించుకోవాలని వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారని రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు.


ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రోగి మృతిచెందడంతో ఆందోళన చేస్తున్న బంధువులు (ఫైల్‌)

తమకు నచ్చిన విధంగా ల్యాబ్‌ నుంచి రిపోర్టులు రాయించుకుని ఏ జబ్బూ లేకున్నా వేల రూపాయల మందులు తమ సొంత మెడికల్‌ షాపుల ద్వారా అంటగడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికై నా జిల్లా వైద్యాధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యం పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అకారణంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement