పార్లమెంట్‌లో డిష్యుం.. డిష్యుం Taiwan MPs brawl In Parliament, Video Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: తగ్గేదే లే.. పార్లమెంట్‌లో ఎంపీల డిష్యుం.. డిష్యుం

Published Sat, May 18 2024 10:30 AM | Last Updated on Sat, May 18 2024 10:48 AM

Taiwan MPs brawl In Parliament, Video Goes Viral

చట్ట సభల్లో సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే.  ఒక్కోసారి అవి శ్రుతి మంచి దాడులకు దారి తీసిన దాఖలాలు లేకపోలేదు. అయితే తైవాన్‌లో ఆ పరిస్థితి ముష్టి యుద్ధానికి దారి తీసింది. పార్లమెంట్‌లోనే చట్ట సభ్యులు తన్నుకున్న వీడియోలు ఎక్స్‌లో వైరల్‌ అవుతోంది. నూతన సంస్కరణలపై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేసే వాళ్లకు కఠిన శిక్ష పడేలా చేసిన తైవాన్‌ పార్లమెంట్‌ చట్టం చేయాలనుకుంది. ఇందుకుగానూ చట్ట సభ్యులకు అధిక అధికారం కట్టబెట్టే చట్ట ప్రాతిపాదనలపై శుక్రవారం చర్చ జరిగింది. ఆ సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం డిష్యుం.. డిష్యుంకి దారి తీసింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. ఇష్టానుసారం తన్నుకున్నారు. 

 

మహిళా ప్రతినిధులు సైతం తమ వంతుగా ఈ గొడవలో భాగం అయ్యారు. జుట్టు జుట్టు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకుంటూ.. కిందపడి పడి గుద్దులు గుద్దుకున్నారు. ఆ ఘర్షణల్లో ఓ ఎంపీ అక్కడి బిల్లు సంబంధిత ఫైల్స్‌ను తీసుకుని బయటకు పరిగెత్తడం బాగా వైరల్‌ అయ్యింది.  

డెమొక్రటిక్‌ ప్రొగెసివ్‌ పార్టీ, కువోమింటాంగ్‌ పార్టీ ఎంపీల మధ్య చర్చ సమయంలో జరిగిన వాగ్వాదమే ఈ ఘర్షణలకు కారణమైంది. మరికొందరు స్పీకర్‌ కుర్చీ చుట్టు చేరడం, టేబుళ్ల మీద నుంచి దూకడం ఆ వీడియోలలో చూడొచ్చు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ గలాట.. మధ్యాహ్నం దాకా కొనసాగింది. 

తైవాన్‌ పార్లమెంట్‌లో 113 సీట్లు ఉన్నాయి.  తైవాన్‌ నూతన అధ్యక్షుడు లై చింగ్‌ టె సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందే పార్లమెంట్‌ రణరంగంగా మారడం గమనార్హం. విశేషం ఏంటంటే.. చట్ట సభలో మెజారిటీ లేకున్నా చింగ్‌ టె అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతుండడం.డీపీపీ కంటే కేఎంటీకి సీట్లు అధికంగా వచ్చాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన బలం లేదు. దీంతో.. టీపీపీ మద్దతు తీసుకోవాలని కేఎంటీ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement