‘శ్రీశైలం విద్యుత్‌’కు త్వరలో మరమ్మతులు Repairs to Srisailam hydropower station soon | Sakshi
Sakshi News home page

‘శ్రీశైలం విద్యుత్‌’కు త్వరలో మరమ్మతులు

Published Fri, Jun 28 2024 5:05 AM | Last Updated on Fri, Jun 28 2024 5:05 AM

Repairs to Srisailam hydropower station soon

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జెన్‌కో చర్యలు     

టెండర్ల నిర్వహణకు కసరత్తు 

2020లో పూర్తిగా కాలిపోయిన 4వ యూనిట్‌ 

మరమ్మతుల తర్వాత మళ్లీ కాలిపోయిన వైనం 

మళ్లీ మరమ్మతులకు నిరాకరించిన కాంట్రాక్టర్‌ బ్లాక్‌ లిస్టులోకి.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోనే అతి పెద్దదైన శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రానికి మరమ్మతులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) చర్యలు చేపట్టింది. విద్యుదుత్పత్తి సంస్థ స్థాపిత సామర్థ్యం 900 (6 ్ఠ150) మెగావాట్లు కాగా, అందులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ యూనిట్‌లోని జనరేటర్‌ స్టేటర్, రోటర్‌లు గత జూలైలో రెండోసారి కాలిపోయాయి. 2020 ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలోని కంట్రోల్‌ ప్యానెల్స్‌కి డీసీ విద్యుత్‌ను సరఫరా చేసే బ్యాటరీలను మార్చే సమయంలో మంటలు చెలరేగి భారీ అగి్నప్రమాదం చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంలో జెన్‌కోఇంజనీర్లతోపాటు మొత్తం 9 మంది మృత్యువాతపడగా, విద్యుత్‌ కేంద్రంలోని కొన్ని యూనిట్లు పూర్తిగా, మరికొన్ని యూనిట్లు పాక్షికంగా కాలిపోయాయి. అప్పట్లో 4వ యూనిట్‌కే అత్యధిక నష్టం జరిగింది. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ వైత్‌ ఆధ్వర్యంలో జెన్‌కో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించింది. గతేడాది దాదాపుగా 80 గంటలపాటు విద్యుదుత్పత్తి చేసిన తర్వాత మళ్లీ 4వ యూనిట్‌లో వాల్ట్‌ వచ్చి కాలిపోయింది. ఒప్పందం ప్రకారం డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లోనే 4వ యూనిట్‌ కాలిపోవడంతో సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించాలని ‘వైత్‌’గ్రూపును జెన్‌కో కోరగా, ఆ సంస్థ నిరాకరించింది. 

4వ యూనిట్‌కు ఇతర మరమ్మతులు నిర్వహించడంతోనే ఫాల్ట్‌ ఏర్పడిందని, దీనితో తమకు సంబంధం లేదని వైత్‌ గ్రూపు స్పష్టం చేసింది. మరమ్మతులకు మళ్లీ డబ్బులు చెల్లించాలని కోరింది. ఏడాది కాలంగా ఆ కంపెనీతో వివాదం నడవడంతో మరమ్మతుల నిర్వహణ మరుగున పడిపోయింది. కొత్తగా మరోసారి టెండర్లు నిర్వహించి మరమ్మతులు నిర్వహించడానికి జెన్‌కో యత్నించగా, ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించక ప్రక్రియ ముందుకు సాగలేదు. మరమ్మతులకు రూ.3 కోట్ల దాకా ఖర్చు కానుండగా, అంతకు ఎన్నో రెట్లు విలువ చేసే జల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం లభించనుంది.  

ఉత్పత్తి వచ్చే ఏడాదే.. 
రాష్ట్రంలోని కీలకమైన జలవిద్యుత్‌ కేంద్రాలకు సకాలంలో మరమ్మతులు నిర్వహించకపోవడంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోయిన అంశంపై ఈ నెల 21న ‘హైడల్‌ పవర్‌ డౌన్‌! ’శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ప్రభుత్వం స్పందించి తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో మరమ్మతులు నిర్వహించిన ‘వైత్‌’సంస్థకు ఇటీవల జెన్‌కో తుది నోటీసులు జారీ చేసి ఆ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టింది. 

మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహించడానికి జెన్‌కో యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. మరమ్మతులు పూర్తై 4వ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం మూడు నెలల సమయం పట్టొచ్చని, ఆలోగా కృష్ణా నదిలో వరదలు ముగిసిపోతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement