జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ - | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ

Published Thu, Apr 18 2024 10:35 AM | Last Updated on Thu, Apr 18 2024 10:35 AM

శ్రీనివాస్‌    - Sakshi

రూ.70 లక్షల విలువైన నగలు మాయం

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్త డీవీఎస్‌ సోమరాజు నివాసంలో భారీ చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–62లోని ప్లాట్‌నెంబర్‌ 1242 (బి)లో సోమరాజుతో పాటు ఆయన తల్లిదండ్రులు శివరామరాజు, అన్నపూర్ణ, భార్య పద్మసూర్య కుమారి, కుమారులు యశ్వంత్‌ వర్మ, శివ మితీష్‌వర్మ ఉంటున్నారు. ఈ నెల 4న వీరంతా ఓ వివాహానికి హాజరై సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఆభరణాలను బెడ్రూంలోని అల్మరాలో భద్రపరిచారు. ఈ నెల 15న రాత్రి మరో శుభకార్యానికి వెళ్లే క్రమంలో ఆభరణాలు కోసం చూడగా అల్మరాలో కనిపించలేదు. ఇందులో 100 గ్రాముల గోల్డ్‌ బిస్కెట్‌తో పాటు బంగారు గాజులు, చంద్రహారం, డైమండ్‌ నెక్లెస్‌, మరో మూడు గోల్డ్‌ బిస్కెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.70 లక్షలు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంట్లో నలుగురు పని మనుషులు ఉంటారని, ఇందులో ఇద్దరు బయటి నుంచి వస్తారని, మరో ఇద్దరు సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపైనే అనుమానం ఉందన్నారు. చోరీకి గురైన ఆభరణాల పక్కనే ఉన్న రూ.40 లక్షల విలువ చేసే నగలు భద్రంగానే ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

జీడిమెట్ల: కుటుంబ కలహాల కారణంగా ఎస్‌పీఓ పోలీస్‌ డ్రైవర్‌ ఉరి వేసుకుని మృతిచెందిన ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాసరావు చెప్పిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ వెంకటేశ్వరనగర్‌లో ఉండే గుంటి శ్రీనివాస్‌ ఆర్మీలో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్డ్‌ అయ్యాడు. అనంతరం సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఎస్‌పీఓ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్‌కు భార్య భార్గవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16వ తేదీన రాత్రి శ్రీనివాస్‌ తన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం 17వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో భార్య, పిల్లలను బెడ్‌రూంలోకి పంపించి బయట నుంచి గడియపెట్టాడు. అనంతరం బయట గదిలో బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. అనుమానం వచ్చిన భార్గవి తలుపులు తీయాలని ఎంత పిలిచినా పలకలేదు. కిటికీలోంచి చూడగా శ్రీనివాస్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో భార్గవి పక్కింటి వారికి ఫోన్‌ చేయడంతో వారు వచ్చి తలుపులు తీయగా శ్రీనివాస్‌ అప్పటికే మృతిచెంది ఉన్నాడు. భార్గవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement