హోదా ఉన్నా.. నిఘా సున్నా! - | Sakshi
Sakshi News home page

హోదా ఉన్నా.. నిఘా సున్నా!

Published Thu, Apr 18 2024 10:35 AM | Last Updated on Thu, Apr 18 2024 10:35 AM

- - Sakshi

టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం

సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్ల కోసం దేశ వ్యాప్తంగా వేట.. నకిలీ కరెన్సీ కేసుల్లో సరిహద్దుల ఆవలి వరకు ప్రయాణం.. ఉగ్రవాద కేసుల్లో ఫీల్డ్‌ ఆపరేషన్లు.. కేవలం ఇవేనా..? నగర వ్యాప్తంగా ఎలాంటి సంచలనాత్మక నేరం చోటు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చిన పేరు హైదరాబాద్‌ కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ విభాగం ప్రతిష్ట ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాస్పద అంశాలతో మసకబారుతోంది. అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌, బెదిరింపు వసూళ్లు, ఎన్నికల డబ్బు రవాణా, వ్యాపారుల కిడ్నాప్‌–బెదిరింపులు.. ఇలా అనేక వివాదాలు ఈ విభాగాన్ని చుట్టుముడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ పరిస్థితుల నెలకొనడానికి నగరంలోని రెండు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయాల్లో సరైన నిఘా లేకపోవడమూ ఓ కారణంగా నిలుస్తోంది.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం..

కస్టోడియల్‌ మరణాలకు చెక్‌ చెప్పడం, మానవహక్కుల ఉల్లంఘనలు లేకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచడం, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలీసింగ్‌లో పూర్తి పారదర్శకత కోసం ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్పీం కోర్టు దాదాపు పదేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. డీకే బసు వర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ కేసులో తీర్పు ఇస్తూ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పలుమార్లు గడువు పెంచిన పోయిన సుప్రీం కోర్టు 2020 డిసెంబర్‌ను తుది గడువుగా నిర్దేశించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. పని చేస్తున్నాయా? లేదా? అనేది పక్కన పెడితే నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ కనిష్టంగా 11 కెమెరాలు ఏర్పాటయ్యాయి. కేవలం పోలీసుస్టేషన్‌లో మాత్రమే కాదు.. ఠాణా హోదా ఉన్న సీసీఎస్‌, సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌ల్లోనూ ఇవి ఉన్నాయి.

28 ఏళ్ల క్రితమే పోలీసుస్టేషన్‌ హోదా..

హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అధీనంలో పని చేసే కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది కేవలం యాంటీ గూండా స్క్వాడ్‌ మాదిరిగా కేవలం ఆపరేషనల్‌ విభాగంగా ఉండేది. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, పోస్టులు పొండటంలో, జీతభత్యాల విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో 1996లో అప్పటి పోలీసు శాఖ ప్రభుత్వానికి కీలక నివేదిక పంపింది. దీని ఆధారంగా సర్కారు కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌కు సైతం పోలీసుస్టేషన్‌ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నెల వారీ నిర్వహణ ఖర్చులు కూడా దీనికి వస్తున్నాయి. ఇలా దాదాపు 28 ఏళ్లుగా ఠాణా హోదా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయాలు (సికింద్రాబాద్‌లో ఒకటి, పాతబస్తీలో మరోటి) సీసీ కెమెరాలు లేకుండానే కాలం గడిపేస్తున్నాయి. అన్నింటిలోనూ ఏర్పాటు చేయకుండా ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయంటూ నివేదిక ఇవ్వడం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌కు పోలీసుస్టేషన్‌ హోదా

1996లోనే జీవో జారీ చేసిన అప్పటి ప్రభుత్వం

‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం ఠాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి

ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏర్పాటు చేయని అధికారులు

ఫిర్యాదు చేసే విధానానికీ స్వస్తి..

టాస్క్‌ఫోర్స్‌ విభాగం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తే దానిపై పని భారం పెరిగి, ఫలితాలు దెబ్బతింటాయనే వాదన ఉంది. దీన్ని అంగీకరించినప్పటికీ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు ఏంటనేది మాత్రం అంతు చిక్కట్లేదు. మరోపక్క టాస్క్‌ఫోర్స్‌ విభాగం పట్టుకునే నేరగాళ్లపై నమోదయ్యే వాటిలో అత్యధికం సుమోటో కేసులే. అంటే.. పోలీసులే ఫిర్యాదుదారుడిగా ఉంటారు. ఓ నేరగాడిపై సమాచారం అందుకుని, వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారే సంబంధిత పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుండేవారు. దీనివల్ల భవిష్యత్తులో సాక్ష్యం చెప్పడం వంటివి తప్పనిసరి కావడంతో ఈ విభాగం అధికారుల్లో జవాబుదారీతనం ఉండేది. 2015 నుంచి ఈ విధానం పూర్తిస్థాయిలో, పక్కాగా అమలు కావట్లేదు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ స్థానిక పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్న సందర్భాలూ అనేకం ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఆయా ఠాణాల అధికారులే ఫిర్యాదు చేస్తూ సుమోటో కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ కారణాలే టాస్క్‌ఫోర్స్‌ అభాసుపాలు కావడానికి మూలం అనే వాదన బలంగా వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement