వేసవిలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు - | Sakshi
Sakshi News home page

వేసవిలో విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు

Published Wed, Apr 17 2024 8:25 AM | Last Updated on Wed, Apr 17 2024 8:25 AM

- - Sakshi

సాహిత్య, సాంస్కృతిక, సంప్రదాయ సంరంభం

మండు వేసవి. నిప్పులు చెరిగే ఎండలే కాదు ఆహ్లాదభరితమైన ఉదయ సంధ్యలు కూడా పలకరించనున్నాయి. కొత్త దృక్పథాలు, సరికొత్త ఆలోచనలు రూపుదిద్దుకొనే ఒక విలువైన సమయం. ఏడాది పొడవునా చదువులు, పరీక్షలు అంటూ పరుగులు తీసే విద్యార్థులకు వేసవి ఒక విహారాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే విలువైన సమయం. పటిష్టమైన కెరీర్‌ నిర్మాణానికి, ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసానికి బాటలు పరుచుకోవచ్చు. అభిరుచులను ఆవిష్కరించుకోవచ్చు. నృత్యం, శిల్పం, చిత్రలేఖనం వంటి నచ్చిన కళలకు రంగులద్దుకునే తీరిక సమయం ఈ వేసవి కాలమే. ఈ క్రమంలోనే పలు విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వేసవిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. పిల్లల అభిరుచికి తగిన విధంగా వాటిని రూపొందిస్తున్నాయి. చిన్నారులూ.. ఇక ఆలస్యమెందుకు మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు ఈ వేసవిలో సిద్ధం కండి. – సాక్షి, సిటీబ్యూరో

‘చదువుకుందాం’ కార్యక్రమంలో...

సంగీత సాధనపై..

ఎంతోమంది గానగంధర్వులను సినీరంగానికి పరిచయం చేసిన ప్రముఖ లలిత సంగీత శిక్షణ సంస్థ లిటిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ తన రెగ్యులర్‌ విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అకాడమీ వ్యవస్థాపకులు కె.రామాచారి తెలిపారు. నెల రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణనివ్వనున్నామని పేర్కొన్నారు. మే ఒకటో తేదీ నుంచి 31 వరకు రవీంద్రభారతిలోని మినీ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు లలిత సంగీతం, సినిమా సంగీతం, అన్నమాచార్య సంకీర్తనలు తదితర అంశాలలో శిక్షణనిస్తారు.

సంస్కారమే ఆభరణం..

స్థితప్రజ్ఞత ఒక అద్భుతమైన వరం వంటిది. ఎంపిక చేసుకొన్న రంగంలో విజయతీరాలను చేరుకొనేందుకు, తమను తాము ఉన్నతమైన వ్యక్తులుగా రూపొందించుకొనేందుకు ఒక గొప్ప సాధనం. ఇదే లక్ష్యంగా రామకృష్ణమఠం ‘సంస్కార్‌–2024’ నిర్వహిస్తోంది. ఈ నెల 28న ఇది ప్రారంభం కానుంది. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణనిస్తారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సంప్రదాయ విలువలను బోధిస్తారు. భజనలు, శ్లోకాలు నేర్పిస్తారు. ఽయోగా, ప్రాణాయామం, ధ్యానం తదితర అంశాల్లోనూ శిక్షణ ఉంటుంది. నైతిక విలువలను అలవరుస్తారు. ఉత్తమ చేతిరాతలో తర్ఫీదు ఉంటుంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు ఈ అంశాలన్నింటితో పాటు స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవడం, ఆత్మస్థ్యైర్యాన్ని పెంపొందించుకోవడం, తమను తాము ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దుకొనేందుకు పాటించాల్సిన పద్ధతులు, దైనందిన జీవితంలో కాలం విలువ తెలుసుకోవడం, కెరీర్‌ను నిర్మించుకోవడం వంటి అంశాలపైన ఈ ‘సంస్కార్‌–24’ శిక్షణనిస్తుంది. ఈ నెల 29 నుంచి మే 10 వరకు 12 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ అంశాల్లో ఈ శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు సంజీవ్‌ తెలిపారు. ప్రస్తుతం విద్యార్ధుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 91772 32696.

మొక్కలు చెప్పే పాఠాలు విందామా..

ఏపుగా పెరిగిన ఆకుపచ్చ మొక్క ఒకటి కొమ్మలను గాలిలో ఊపుతూ సృష్టిలో తన ఉనికిని, ప్రత్యేకతను చాటుకుంటుంది. ఆ కొమ్మలపై వాలిన పక్షులు, చుట్టూ పరుచుకున్న ప్రకృతి, పర్యావరణం జీవవైవిధ్యాన్ని ప్రబోధిస్తాయి. అక్కడ ప్రతి మొక్క, చెట్టు, కొమ్మ, రెమ్మ ప్రతి ఒక్కటీ పాఠాలు చెబుతాయి. మనిషికి, ప్రకృతికి ముడిపడిన బంధాన్ని, అనుబంధాన్ని వివరిస్తాయి. తరగతి గదుల్లో, నాలుగు గోడల మధ్య టీచర్లు బోధించే అంశాలను సమున్నతంగా ఆవిష్కరించేందుకు బొటానికల్‌ గార్డెన్‌ చిన్నారులను ఆహ్వానిస్తోంది. ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యంపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు, ఆసక్తిని పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రత్యేక కార్యక్రమాలతో పాటు వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు మేనేజర్‌ సుమన్‌ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా ఇక్కడ గడపవచ్చు. నిర్వాహకులే మధ్యాహ్నం భోజనం, స్నాక్స్‌, టీ అందజేస్తారు. ఈ నెల 20, 27, మే నెలలో 4, 11, 18, 25, 31 తేదీల్లో బొటానికల్‌ గార్డెన్‌ టూర్‌ నిర్వహించనున్నారు. వివరాలకు 94935 49399ను సంప్రదించవచ్చు.

చదువుకుందాం ‘డియర్‌’...

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌ ‘చదవడాన్ని’ ఒక పాఠ్యాంశంగా పరిచయం చేస్తోంది. ప్రతి నెలా మొదటి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నర్సరీ నుంచి ప్రాథమిక, మాధ్యమిక స్థాయి పిల్లల వరకు ప్రతి ఒక్కరిలో పఠనాభిలాష, ఆసక్తి పెంపొందేవిధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని స్కూల్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సువర్ణ తెలిపారు. పిల్లలను వారి తల్లిదండ్రులతో పాటు పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తున్నాం. ఇందుకోసం పాఠశాల ఆవరణ మొత్తాన్ని రీడింగ్‌ జోన్‌గా మార్చినట్లు పేర్కొన్నారు.

బొటానికల్‌ గార్డెన్‌లో చిన్నారులకు పర్యావరణ పాఠాలు

ఉత్తమ వ్యక్తిత్వ వికాసానికి ‘సంస్కార్‌’

‘చదువే’ ప్రామాణికంగా పఠనాభిలాష

No comments yet. Be the first to comment!
Add a comment
1/5

రామకృష్ణమఠంలో సంస్కార్‌ తరగతులు నిర్వహిస్తున్న దృశ్యం
2/5

రామకృష్ణమఠంలో సంస్కార్‌ తరగతులు నిర్వహిస్తున్న దృశ్యం

3/5

4/5

5/5

Advertisement
 
Advertisement
 
Advertisement