హైపర్‌టెన్షన్‌కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా? Hypertension is Increasing Among the Youth | Sakshi
Sakshi News home page

హైపర్‌టెన్షన్‌కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?

Published Sun, May 26 2024 10:04 AM | Last Updated on Sun, May 26 2024 10:52 AM

Hypertension is Increasing Among the Youth

రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్‌ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.

చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్‌టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి  ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌ మే 17 నుండి 25 వరకు ‘హైపర్‌టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్‌ వైద్యులు మాట్లాడుతూ హైపర్‌టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్‌టెన్షన్‌ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్‌ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.

పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్  సీసీఎం విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్‌టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్‌టెన్షన్‌ సమస్య తలెత్తుతున్నదన్నారు.

అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం,  ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్‌ చేసుకోవాలి. తద్వారా  శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement