లైక్‌ కొడితే రూ.50...కామెంట్‌ పెడితే రూ.100 | Cyber ​​Security Expert Advice And Warning Over Latest Cyber Scam On Telegram And Task Based Scams - Sakshi
Sakshi News home page

Cyber Scam On Telegram: లైక్‌ కొడితే రూ.50...కామెంట్‌ పెడితే రూ.100

Published Mon, Sep 25 2023 1:58 AM | Last Updated on Mon, Sep 25 2023 11:33 AM

Latest Cyber Scam on Telegram - Sakshi

కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను ఓపెన్‌ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్‌ కొట్టడమే.. అలా లైక్‌ కొట్టిన స్క్రీన్‌షాట్‌ మాకు పంపితే ఒక్కో అకౌంట్‌ స్క్రీన్‌షాట్‌కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్‌ వీడియోకు లైక్‌ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం....

ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..?
ఇదో సరికొత్త సైబర్‌ మోసం.. టెలిగ్రామ్‌ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

టాస్క్‌బేస్డ్‌ స్కాం అంటే..
సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్‌ యూజర్లను టార్గెట్‌ చేసుకుని టాస్క్‌బేస్డ్‌ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్‌ యూజర్లకు సైబర్‌ నేరగాళ్లు కొన్ని మెసేజ్‌లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్‌పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్‌బేస్డ్‌ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్‌బేస్డ్‌ మోసాలు చూస్తే... 

ఈ ఖాతాలు ఫాలోకండి..
టెలిగ్రామ్‌ యూజర్లకు పంపే మెసేజ్‌లలో మేం పంపే లింక్‌ ఓపెన్‌ చేసి ఈ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్‌ చేసి స్క్రీన్‌షాట్‌ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు.  

యూ ట్యూబ్‌ వీడియోలకు లైక్‌లు..:
సైబర్‌ మోసగాళ్లు పంపే మెసేజ్‌లలో కొన్ని యూట్యూబ్‌ వీడియోల లింక్‌లు పెడతారు. వాటిని ఓపెన్‌ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్‌ చేయడంతోపాటు లైక్‌ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు.  

హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్‌ పేరిట..:  
ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్‌ ఐటమ్స్‌ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్‌ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు.  

సినిమా రివ్యూలకు రేటింగ్‌..
మేం పంపే లింక్‌ ఓపెన్‌ చేసి అందులోని వెబ్‌సైట్‌లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్‌ ఇవ్వాలని టాస్క్‌ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్‌ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్‌ ఇస్తారు.  

మోసానికి తెరతీస్తారు ఇలా..  
ముందుగా ఇచ్చిన టాస్క్‌పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్‌ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు.

మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్‌లైన్‌లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్‌ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. 

ఇలాంటి మెసేజ్‌లు చూస్తే అనుమానించాల్సిందే.. 

  • ఆన్‌లైన్‌లో సైబర్‌ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయవద్దు. 
  • అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్‌ మోసమని గ్రహించాలి. 
  • వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి.  
  • అపరిచిత వ్యక్తులు ఆన్‌లైన్‌లో మనకు పంపే మెసేజ్‌లను నమ్మవద్దు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement