వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై హత్యాయత్నం Assassination attempt on YSRCP councillors | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై హత్యాయత్నం

Published Fri, Jun 21 2024 5:29 AM | Last Updated on Fri, Jun 21 2024 5:29 AM

Assassination attempt on YSRCP councillors

రాయచోటిలో రెచ్చిపోయిన టీడీపీ నేత సయ్యద్‌ ఖాన్‌ గ్యాంగ్‌ 

7వ వార్డు కౌన్సిలర్‌ మున్నీసా భర్త ఇర్ఫాన్‌పై కత్తులతో దాడి

కత్తిపోట్లతోపాటు తలకు తీవ్రగాయాలు.. కడప రిమ్స్‌కు తరలింపు   

4వ వార్డు కౌన్సిలర్‌ ఇంటిపై బండరాళ్లు వేసిన టీడీపీ రౌడీలు

బైక్‌ ధ్వంసం.. చంపుతామంటూ తల్లికి హెచ్చరికలు 

బాధితులకు ఫోన్‌లో వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరామర్శ

రాయచోటి: ఎన్నికల ముందురోజు వరకు ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో టీడీపీ నేతలు వరుస దాడులతో అరాచకం సృష్టిస్తున్నారు. కౌంటింగ్‌ ముగిసిననాటి నుంచి టీడీపీ రౌడీలు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి రాయచోటి టీడీపీ నేత సయ్యద్‌ ఖాన్‌ కొంతమంది రౌడీలతో వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్లపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 

రాత్రి 11.30 గంటల సమయంలో నాలుగో వార్డు కౌన్సిలర్‌ హారూన్‌ బాషా ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నుంచి బయటికి రావాలని, చంపుతామంటూ టీడీపీ రౌడీలు కేకలు వేశారు. ఆ సమయంలో హారూన్‌ ఇంటిలో లేకపోవడంతో ఆయన తల్లి బయటకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని ప్రాధేయపడ్డారు. అయినా వినని టీడీపీ రౌడీలు పెద్ద బండరాళ్లతో ఇంటి ఆవరణలో ఉన్న బైక్‌ను ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి పీఏ నిస్సార్‌ అహ్మద్‌ను కూడా చంపుతామంటూ కేకలు పెడుతూ వెళ్లిపోయారు. 

ఆ తర్వాత వీధుల్లో బైకులపై కేకలు వేసుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్‌ మున్నీసా ఇంటికి వెళ్లి ఆమె భర్త ఇర్ఫాన్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ రౌడీల దాడిలో ఇర్ఫాన్‌ కత్తిపోట్లకు గురయ్యారు. ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. 

ఘటన సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేత సయ్యద్‌ ఖాన్, బాబ్జీ, ఫిరోజ్‌ ఖాన్, శివారెడ్డి, అఫ్రోజ్, అబూజర్‌లను అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్‌ సీఐ సుధాకర్‌ రెడ్డి, డీఎస్పీ రామానుజులు టీడీపీ నేతలపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

కౌంటింగ్‌ నాటి నుంచే వరుస దాడులు..
ఈనెల నాలుగో తేదిన ఎన్నికల కౌంటింగ్‌ పూర్తి కాగానే అదే రోజు రాత్రి రాయచోటి రూరల్‌ మండలం ఎండపల్లి పంచాయతీ బోయపల్లిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో సుబ్బారెడ్డి సోదరుడు, మరొకరు గాయాలపాలయ్యారు. ఇంటి ముందు ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు.

అలాగే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిగా ఉన్న ఆర్టీసీ కండక్టర్‌ రామ్మోహన్‌ ఇంటిపై దాడులకు తెగబడి ఆయన బైకును తగులబెట్టారు. ఇలా రాయచోటిలో టీడీపీకీ చెందిన రౌడీ మూకలు, గ్యాంగ్‌లు దాడులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు.

టీడీపీ రౌడీమూకల దాడులు దారుణం
రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపైన టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడిన రాయచోటి ప్రజలను ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురి చేయడం సరికా­దన్నారు. 

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవా­రు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అధికారమనేది ఎవరికీ శాశ్వతం కాద­న్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా కక్షపూరిత రాజకీయాలు చేయ లేదని గుర్తు చేశారు. టీడీపీ రౌడీలు అర్ధరాత్రి వేళ మద్యం తాగి గుంపులుగా వచ్చి తమ పార్టీ కౌన్సిలర్లపై దాడులు చేయడం దారుణమన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు ఆయన ఫోన్‌ చేసి పరామర్శించారు. ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని, త్వరలో బాధితులను కలుస్తానని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement