వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై కక్షసాధింపు Assault on YSRCP Sarpanch | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై కక్షసాధింపు

Published Sat, Jun 22 2024 5:35 AM | Last Updated on Sat, Jun 22 2024 5:35 AM

Assault on YSRCP Sarpanch

ఇంటికి దారిలేకుండా చేసేందుకు కుట్ర 

పట్టా స్థలం ఆక్రమించి ఆలయ నిర్మాణం పేరుతో దురాక్రమణకు యత్నం 

చంద్రగిరిలో బరితెగిస్తున్న టీడీపీ నేతలు 

చంద్రగిరి (తిరుపతి జిల్లా): చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రగిరి మండలం కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు రామిరెడ్డిపల్లి వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిపై కక్ష సాధింపు శృతిమించుతోంది. 

ఎన్నికల రోజు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై టీడీపీ నాయకులు దాడిచేసి ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పంటించారు. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిపోయింది. అయినా వారు సర్పంచ్‌పై ఇంకా కక్ష సాధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. సర్పంచ్‌ ఇంటికి దారిలేకుండా చేయాలనే కుట్రతో ఆలయం పేరుతో నాటకానికి తెరలేపారు. సర్పంచ్‌ ఇంటి ముందు 10 అడుగుల దారి ఉంది. 

ఆ పక్కనే ప్రైవేటు ఇంటి స్థలాలూ ఉన్నాయి. దీంతో శుక్రవారం టీడీపీ నేతలు ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించుకుని ఆలయం ముసుగులో అక్రమ నిర్మాణాలను ప్రారంభించారు. దీంతో స్థలాల యజమానులు తమ స్థలాలను కొనుగోలు చేసి తమకు డబ్బులిస్తే వెళ్లిపోతామన్నారు. రిజి్రస్టేషన్‌ అయిన  స్థలాలను సైతం ఆక్రమించుకోవడం దారుణమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

సర్పంచ్‌ ఇంటికి దారిలేకుండా చేసి ఆయన్ను గ్రామంలోకి రానీయకూడదన్నదే వీరి లక్ష్యమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కూచువారిపల్లిలో ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.  

ప్రభుత్వ భూమి కబ్జాకూ యత్నం.. 
ఇదిలా ఉంటే.. కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు ప్రభుత్వ భూముల కబ్జాకూ పాల్పడుతున్నారు. అడ్డొచ్చిన మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. మీకు దిక్కున్నచోట చెప్పకోండంటూ శుక్రవారం బెదిరింపులకు పాల్పడ్డారు. గ్రామస్తుల వివరాల మేరకు.. రామిరెడ్డిపల్లి సర్వే నంబరు 413, 414లో సుమారు 2.77 ఎకరాల కుంట పోరంబోకు స్థలం ఉంది. ఇందులో పాడి రైతులు కొందరు పశువుల కోసం తాత్కాలిక షెడ్లు వేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. 

అయితే, కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు మురళీనాయుడు, సునీల్‌ మరికొంతమంది శుక్రవారం జేసీబీ తీసుకొచ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. దీంతో చెలరేగిపోయిన టీడీపీ నేతలు మహిళలపట్ల అసభ్య పదజాలంతో దూషించారు. అడ్డుకోబోయిన వీఆర్‌ఓపైన విరుచుకుపడ్డారు. 

ఇక్కడే ఉంటే కొడతామని బెదిరించడంతో రైతులు, మహిళలు వెనుదిరిగారు. ‘ఇది మా ప్రభుత్వం.. మా ఇష్టమొచ్చినట్లు మేం చేస్తాం.. మీవల్ల ఏమికాదు’.. అంటూ బెదిరించారు. ఇక్కడకు పోలీసు, రెవెన్యూ అధికారులు వచ్చినప్పటికీ ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిచ్చింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement