Telangana-IPS Officers: పోస్టింగ్‌ లేదు.. వెళ్లిపోదాం! Telangana: Four IPS Officers Applied to Center for Deputation | Sakshi
Sakshi News home page

Telangana-IPS Officers: పోస్టింగ్‌ లేదు.. వెళ్లిపోదాం!

Published Fri, Aug 12 2022 11:24 AM | Last Updated on Fri, Aug 12 2022 3:32 PM

Telangana: Four IPS Officers Applied to Center for Deputation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌శాఖలో పోస్టింగ్‌ లేకుండా నెలలకొద్దీ అటాచ్‌మెంట్‌ల మీద పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడింది. దీంతో బయటకు చెప్పలేక, పోస్టింగ్‌ కోసం తిరగలేక కొంతమంది కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏడాది నుంచి వెయిటింగ్‌లో ఉన్న ఓ సీనియర్‌ ఐపీఎస్‌తోపాటు డీఐజీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న మరో అధికారి, ఇద్దరు సీనియర్‌ ఎస్పీ ర్యాంకు అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు జీఏడీకి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కేంద్ర సర్వీసుల్లోని 17 విభాగాల్లో ఎక్కడో ఒకచోట అవకాశం రాకపోతుందా అని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్‌ లేకపోయినా కనీసం కేంద్ర సర్వీసులో అయినా మూడేళ్లు, అవకాశం ఉంటే మరో రెండేళ్లు అక్కడే పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు...
కేంద్ర సర్వీసుల్లో పనిచేసి వచ్చిన రాష్ట్ర కేడర్‌ అధికారులు, ఇంటర్‌ కేడర్‌ డిప్యుటేషన్, కేడర్‌ మార్చుకొని వచ్చిన అధికారులు పోస్టింగ్‌ లేక ఏడాదిగా ఖాళీగా ఉన్నారు. అయితే కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌ పూర్తి చేసుకున్నవారు మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలంటే ఏడాదిపాటు కూలింగ్‌ పీరియడ్‌గా సొంత కేడర్‌ స్టేట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే డిప్యుటేషన్‌ పూర్తిచేసుకొని వచ్చినవారికి ఏడాదిపాటు వెయిటింగ్‌లో ఉండటం నిరాశను కలిగించినట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడ చేసేదేమీలేక మళ్లీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. కేడర్‌ మార్చుకొని తెలంగాణకు వచ్చిన అధికారులు సైతం ఇదే పద్ధతిలో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోవాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 

భారీగానే ఖాళీలు
కేంద్ర సర్వీసుల్లోని 17 విభాగాల్లో డిప్యుటేషన్‌కు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జూలై చివరి వరకు ఉన్న వేకెన్సీ పరిస్థితిని పరిశీలిస్తే భారీగానే ఖాళీలున్నట్టు కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) ర్యాంకులో రెండు పోస్టులు, స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ర్యాంకులో రెండు పోస్టులు, ఐజీ ర్యాంకులో 25 పోస్టులు, డీఐజీ హోదాలో 102 పోస్టులు, ఎస్పీ ర్యాంకులో 116 పోస్టులు కేంద్ర పోలీస్‌ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల్లో ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పోస్టింగ్‌ లేని అధికారులు కేంద్రంలోకి వెళ్లేందుకే సానుకూలంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement