మద్యం పోసి... సిగరెట్లు తాగించి Ragging at Gandhi Medical College | Sakshi
Sakshi News home page

మద్యం పోసి... సిగరెట్లు తాగించి

Published Wed, Sep 13 2023 1:29 AM | Last Updated on Wed, Sep 13 2023 1:29 AM

Ragging at Gandhi Medical College - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేయడంతో వైద్య విద్యార్థి లోకం ఉలిక్కిపడింది. ర్యాగింగ్‌ పేరిట కొందరు సీనియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఇటీవల జూనియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్‌ రూములకు రప్పించి వారికి బలవంతంగా మద్యం పోసి... సిగరెట్‌లు తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికార వర్గాలు చేపట్టిన విచారణలో విస్మయకర నిజాలు వెలుగుచూశాయి. కొందరిని బట్టలు విప్పించి డ్యాన్స్‌లు చేయించారని కూడా అంటున్నారు.  బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కాగా, కొందరు విద్యార్థినులను కూడా ర్యాగింగ్‌ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇది వాస్తవమేనా కాదా అన్న దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా  ఈ ర్యాగింగ్‌ ఉదంతంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అన్ని మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ,  ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ర్యాగింగ్‌ నిరోధక కమిటీల పటిష్టం...
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో కొన్నిచోట్ల కొందరు సీని యర్‌ విద్యార్థులు మొదటి ఏడాది విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు అధికా రుల దృష్టికి వచ్చాయి. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ ల్లోనూ ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ర్యాగింగ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న భావనతో  చూసీచూడనట్లుగా వదిలేశారు.

కానీ గాంధీ ఘటన నేపథ్యంలో ఇకపై ర్యాగింగ్‌ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంఈ కార్యాలయం ఆదేశించింది. అన్ని మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఇప్పటికీ లేకుంటే తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, హాస్టళ్ల వద్ద రాత్రి వేళ నిఘా పెంచాలని సూచించింది. మరోవైపు ర్యాగింగ్‌కు గురైన విద్యార్థుల ఫిర్యాదు నిమిత్తం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు, ఈ మెయిల్‌ ఐడీని రూపొందించాలని కూడా డీఎంఈ కార్యాలయ అధికారులు యోచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement