వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ.. | Rachakonda Police Busted Child Selling Gang at Medipally | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..

Published Wed, May 29 2024 10:08 AM | Last Updated on Wed, May 29 2024 10:41 AM

Rachakonda Police Busted Child Selling Gang at Medipally

 చిన్నారులను విక్రయించే ముఠా అరెస్టు

11 మంది మధ్యవర్తులకు రిమాండ్‌

16 మంది చిన్నారులను కాపాడిన రాచకొండ కాప్స్‌

ఢిల్లీ, పుణే కేంద్రంగా దందా.. 

ఏపీ, తెలంగాణలో విక్రయం  డిమాండ్‌ను బట్టి 

రూ.1.80–5.50 లక్షల వరకు..

సాక్షి, హైదరాబాద్‌: పాలుతాగే పసికందులను అపహరించి, విమానాలు, రైళ్లలో రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఆస్పత్రులు, క్లినిక్‌లలో పనిచేసే ఫోర్త్‌క్లాస్‌ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకొని, దంపతుల సమాచారం సేకరించి, మధ్యవర్తుల సహాయంతో ఐదేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఢిల్లీ, పుణే నగరాల్లో రోజుల శిశువులను ఎత్తుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. 

డిమాండ్‌ను బట్టి ఒక్క పసికందును రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన 11 మంది మధ్యవర్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను మల్కాజ్‌గిరి డీసీపీ పీవీ.పద్మజ, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులతో కలిసి రాచకొండ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు.

👉ఈనెల 22న పీర్జాదిగూడలో మూడు నెలల పాపను విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు స్థానిక ఆర్‌ఎంపీ శోభారాణితోపాటు స్వప్న, షేక్‌ సలీంలను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులను విచారించగా వీరి తరహాలోనే ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 8 మంది మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసును రివర్స్‌ ఇన్వెస్టిగేషన్‌ చేశారు. అన్నోజిగూడకు చెందిన బండారి హరిహర చేతన్‌– బండారి పద్మ, కుషాయిగూడకు చెందిన యాట మమత, ఉప్పుగూడకు చెందిన ముధావత్‌ రాజు, విజయవాడకు చెందిన బలగం సరోజ, ముధావత్‌ శారద, ముంతాజ్, జగన్నాథం అనురాధలను పట్టుకున్నారు. 

ఈ మధ్యవర్తుల సహాయంతో ఢిల్లీకి చెందిన 
కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యలు తెలు­గు రాష్ట్రాల్లో సంతానం లేని దంపతులకు పిల్లలను విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో 60 మంది శిశువులను విక్రయించారు. తాజా కేసులో 16 మంది పిల్లలను విక్రయానికి పెట్టగా.. ఏడుగురిని ఏపీ, 9 మందిని తెలంగాణకు చెందిన దంప­తులు కొనుగోలు చేశారు. మధ్యవర్తులను వి­చా­రించిన పోలీసులు 16 మంది చిన్నారులను కా­పాడారు. శిశువిహార్‌కు తరలించారు. వీరిలో 12 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు­న్నా­రు. ప్రతి శిశువు అమ్మకంపై ఒక్క ఏజెంట్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం పొందే­వారు. పరారీలో ఉన్న నిందితులు కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం పోలీసులు గాలిస్తున్నా­రు.

ముహూర్తం చెబితే పిల్లాడు డెలివరీ
వాట్సాప్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాలలో పిల్లల ఫొటోలు పంపిస్తారు. శిశువుల రంగు, ముఖ కవలికలను బట్టి ఎంపిక చేసుకుంటారు. ఫలానా ముహూర్తానికి పిల్లాడు కావాలని చెబితే చాలు ఆ సమయానికే పిల్లాడిని తీసుకొచ్చి అప్పగిస్తారు. రోజుల వయస్సున శిశువులనే దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో అయితేనే తనకు పుట్టిన బిడ్డగా, పిల్లలకు కూడా వీరే సొంత తల్లిదండ్రులని భావిస్తారు.

పిల్లలకు దూరం చేయకండి 
పిల్లలను రెస్క్యూ హోంకు తరలిస్తుండగా అప్పటివరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రాచకొండ కమిషనరేట్‌ ముందు అడ్డుపడ్డారు. దీంతో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తల్లిదండ్రులను మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. పెళ్లై 12 ఏళ్లు అయినా పిల్లలు కలగలేదని, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి దిక్కుతోచని స్థితిలో రెండున్నర ఏళ్ల క్రితం ఆరు రోజుల పసికందును కొనుగోలు చేశామని రావులపాలెంకు చెందిన ఓ జంట తెలిపారు. రూ.3.5 లక్షలు ఖర్చు చేసి 21వ రోజును ఘనంగా చేశామన్నారు.  రూ.కోట్లాది ఆస్తిపాస్తులను వారసుడి పేరు మీద రాసేందుకూ సిద్ధమయ్యామని చెప్పారు. ఇలాంటి సమయంలో  పిల్లాడిని పోలీసులు తమ నుంచి దూరం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement