బీఆర్‌ఎస్‌తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే! | Nitish Kumar backed out of meeting KCR due to Congress pressure | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే!

Published Tue, May 23 2023 2:11 AM | Last Updated on Tue, May 23 2023 9:10 AM

Nitish Kumar backed out of meeting KCR due to Congress pressure - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేలా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్న బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌.. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీకావడంపై సందిగ్ధం నెలకొంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందే కేసీఆర్‌తో నితీశ్‌ భేటీ ఉంటుందని జేడీయూ నేతలు ప్రకటించినా ఇంతవరకు జరగలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడితోనే కేసీఆర్‌తో భేటీకి నితీశ్‌ వెనక్కి తగ్గారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

వరుసగా కీలక నేతలతో భేటీలు 
బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో దేశంలోని ప్రధాన పార్టీల అధినేతలను నితీశ్‌కుమార్‌ కలుస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ముందు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రివాల్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియకు మరింత పదునుపెట్టారు. శివసేన ఉద్ధవ్‌ థాక్రే వర్గం నేతలతోపాటు జేఎంఎం నేత, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌లతో సమావేశమయ్యారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌తో మరోమారు భేటీ అయ్యారు. తాజాగా సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో నితీశ్‌ సమావేశమయ్యారు. ఈ భేటీల సందర్భంగా విపక్ష పార్టీల ఐక్యత, బీజే పీని ఎదుర్కొనే వ్యూహాలు, పొత్తులు, ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అయితే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొన్నట్టుగానే బీఆర్‌ఎస్‌ను కూడా కలుపుకొని పోవాలని నితీశ్‌ భావిస్తున్నా.. కాంగ్రెస్‌ పెద్దలు దీనికి సానుకూలంగా లేరని సమాచారం. 

ఎన్నికల తర్వాత ఆలోచిద్దాం! 
బీఆర్‌ఎస్‌ను కలుపుకొనిపోయే విషయంలో రాహుల్‌ గాంధీ అంత సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎస్‌)ను విలీనం చేస్తామని మాట ఇచ్చి తప్పారని.. అలాంటి బీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో అధికారంలోంచి దింపేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు బలంగా పనిచేస్తున్నాయని నితీశ్‌కు రాహుల్‌ స్పష్టం చేశారని అంటున్నాయి.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ బలహీనమవుతూ, కాంగ్రెస్‌ బలపడుతున్న దృష్ట్యా.. ఆ పార్టీని కలుపుకొంటే తమకు నష్టం వస్తుందని రాహుల్‌ పేర్కొన్నట్టు వివరిస్తున్నాయి. రాహుల్‌ వ్యాఖ్యలకు సంకేతం అన్నట్టుగానే కర్ణాటక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి 17 విపక్షాలను పిలిచినా బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించలేదని సమాచారం.

ఒకవేళ బీఆర్‌ఎస్‌ను కలుపుకోవాలని అన్ని పార్టీలు కోరితే.. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక, లోక్‌సభ ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికల తర్వాతగానీ ఆలోచిద్దామని ఏఐసీసీ పెద్దలు నితీశ్‌కు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో భేటీపై నితీశ్‌ ఊగిసలాడుతున్నారని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి.

వారం, పది రోజుల్లో బిహార్‌లోని పట్నాలో విపక్షాల ఉమ్మడి భేటీ నిర్వహించాలని నితీశ్‌ యోచిస్తున్నారు. దీనికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను పిలిచే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement