Dog bite cases increased in Hyderabad city - Sakshi
Sakshi News home page

Hyderabad City: విశ్వనగరానికి వీధికుక్కల బెడద.. మూడు రెట్లు పెరిగిన ఘటనలు 

Published Wed, Feb 22 2023 4:33 AM | Last Updated on Wed, Feb 22 2023 8:49 AM

Dog Bite Incidents Increased In Hyderabad City - Sakshi

రాష్ట్రంలో వీధి కుక్కలు పేట్రేగిపోతున్నాయి. కాలనీలు, బస్తీల్లో స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. కొన్నిచోట్ల క్రూర మృగాల్లా రెచి్చపోతూ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనూ వీటి బెడద తప్పడం లేదు. సోమవారం బాగ్‌ అంబర్‌పేటలో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో కూడా ఇద్దరు చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.  

2022లో నవంబర్‌ నాటికే 80,281 కుక్కకాట్లు 
రాష్ట్రంలో కుక్కకాటు కేసులు ఏడాది కాలంలోనే గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం భారీగా ఉన్న కేసులు.. మరుసటి రెండేళ్లు తగ్గగా.. తర్వాత నాలుగో ఏడాది మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 24,124 కుక్క కాట్లు సంభవించగా, 2022లో నవంబర్‌ నాటికే ఏకంగా 80,281 మందిని కుక్కలు కరిచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక వెల్లడించింది. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే  ఏకంగా మూడురెట్లకు పైగా కుక్కకాట్లు జరిగాయి. దేశంలో కుక్కకాట్లలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2019లో 1.67 లక్షల కాట్లు, 2020లో 66,782 కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్‌లో సమస్య తీవ్రం 
హైదరాబాద్‌లోని ఐపీఎంకు కుక్క కాట్లకు గురై చికిత్స కోసం వస్తున్నవారు నెలకు 2,000– 2,500కు పైగా ఉంటుండగా, నిజామాబాద్, కరీంనగర్‌ వంటి నగరాల్లో నెలకు 400 వరకు కుక్కకాటు కేసులు నమోదు కావడం.. వాటి బెడద ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇక హైదరాబాద్‌తో పాటు జీహెచ్‌ఎంసీని ఆనుకొని ఉన్న జవహర్‌నగర్, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేటల్లో వీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది.

జవహర్‌నగర్‌లో డంపింగ్‌ స్టేషన్‌ కుక్కలకు ప్రత్యేక ఆవాస కేంద్రంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ కార్పొరేషన్లలో వెటర్నరీ విభాగాలున్నా, అవి నామమాత్రంగా కొనసాగుతున్నాయి. వీధి కుక్కలు పెరిగిపోవడానికి, నగరాల్లో ఏటా వేల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవడానికి ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో అధికార యంత్రాంగాల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్‌ వరంగల్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లలో వీధికుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తక్కువేనన్న విమర్శలూ ఉన్నాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఈ ఏడాది కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాలలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన మునిసిపల్‌ శాఖ స్టెరిలైజేషన్‌ (సంతాన నియంత్రణ) చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఒక కుక్క, దాని పిల్లలు..పిల్లల పిల్లలు! 
ఒక కుక్క దాని పిల్లలు కలిపి ఏడాది కాలంలో దాదాపు 42 కుక్క పిల్లలను పెడతాయి. వాటి పిల్లలు.. పిల్లల పిల్లలు ఇలా మొత్తం ఏడేళ్ల కాలంలో దాదాపు 4 వేల కుక్కలు పుడతాయని అంచనా. ఇలా కుక్కల సంతతి అభివృద్ధి చెందుతున్నా వాటిని తగ్గించే కార్యక్రమాలు అంత చురుగ్గా సాగడం లేదు. దీంతో వీధికుక్కల సంఖ్య తగ్గడం లేదు.  

స్టెరిలైజేషన్‌తోనే నియంత్రణ.. 
వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్‌ ఒక్కటే మార్గం. అంటే కుక్కల పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేలా శస్త్రచికిత్సలు చేయడం. మొత్తం కుక్కల్లో ఆడకుక్కలన్నింటికీ ఒకేసారి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరిగితేనే కుక్కల సంతతి తగ్గుతుంది. ఏటా వేలాది కుక్కలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆయా కార్పొరేషన్ల వెటర్నరీ విభాగాల అధికారులు చెపుతున్న మాటలన్నీ డొల్ల మాటలేనని కుక్కల సంఖ్య పెరిగిపోతున్న తీరు స్పష్టం చేస్తోంది. ఒక్క వరంగల్‌ కార్పొరేషన్‌లోనే సుమారు 60 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు లెక్కలేశారు.

ఇక్కడ కుక్కల సంతాన నియంత్రణ కోసం ఓ ప్రైవేటు ఎన్‌జీవోకు శస్త్ర చికిత్సల బాధ్యత అప్పగించారు. ఒక కుక్కకు స్టెరిలైజేషన్‌ చేస్తే కార్పొరేషన్‌ రూ.750 చెల్లిస్తోంది. ప్రతిరోజు 20 కుక్కల వరకు పట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నట్లు ఎన్‌జీవో సంస్థ చెపుతున్నప్పటికీ, వేలల్లో ఉన్న కుక్కల సంతతి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు 20 నుంచి 30 కుక్క కాటు కేసులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, రామగుండంలలో కార్పొరేషన్‌ అధికారులే కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్‌ చేపట్టినా, అవి ఎంతోకాలం సాగలేదు. కరీంనగర్‌లో స్టెరిలైజేషన్‌ పేరుతో కుక్కలను చంపుతున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ పేర్కొనడంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.

రామగుండం పూర్తిగా కోల్‌బెల్ట్‌ ఏరియా కావడం, ఓపెన్‌ నాలాలు ఎక్కువగా ఉండడంతో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కొత్తవారు ఎవరు కనిపించినా పిక్కలు పీకేసే పరిస్థితి ఈ కాలరీస్‌లో ఉంది. కరీంనగర్, నిజామాబాద్‌ నగరాల్లో ప్రతి నెల 400 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 2021లో కుక్కల స్టెరిలైజేషన్‌ కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేషన్‌ అధికారులు సుమారు 2,500 కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కానీ తర్వాత ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా వీధికుక్కల గుంపులే కనిపిస్తున్నాయి.  

29,789 కుక్కలకు స్టెరిలైజేషన్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీహెచ్‌ఎంసీ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 20 జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాల్లో 29,789 కుక్కలకు సంతతి నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపింది. నగరాలు, మునిసిపాలిటీలలో ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలతో పాటు కోతులను కూడా ఈ సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్‌ చేస్తున్నట్లు తెలిపింది. 

కుక్కలకు ఆహారం దొరక్కే..: మేయర్‌ విజయలక్ష్మి 
 గ్రేటర్‌ నగరంలో 2022 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 20 మధ్యకాలంలో 5,70,729 కుక్కలుండగా 4,01,089 కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసినట్లు హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి చెప్పారు. అంబర్‌పేట ఘటనలో కుక్కలకు ప్రతిరోజూ ఆహారం వేసే వారు రెండురోజులుగా వేయనందునే ఆకలికి తట్టుకోలేక బాలునిపై దాడి చేసి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ కుక్కలకు మాంసం వేసే దుకాణాలు వారు దుకాణాలు మూసేసినా అలాగే వ్యవహరిస్తాయని చెప్పారు. ఇదొక ప్రమాదం మాత్రమేనంటూ.. బాలుడు మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నగరంలో మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఆహారం కోసం నగరాలకు.. 
గతంలో వీధి కుక్కలు గ్రామాల్లో ఎక్కువగా ఉండేవి. అయితే నగరాల్లో వాటికి ఆహారం ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుండడంతో వాటి సంఖ్య భారీగా పెరిగింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి వదిలేయకుండా.. వీధికుక్కల సమస్యపై కార్పొరేషన్‌లకు ప్రజలు ఫోన్లు చేసినప్పుడు స్పందించి ఆయా బస్తీలు, కాలనీల్లోని కుక్కలను తీసుకెళ్లి స్టెరిలైజేషన్‌ చేసి దూరంగా వదిలేస్తే ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని ప్రజలు అంటున్నారు.  

ఆడకుక్కలన్నిటికీ ఆపరేషన్లు చేయాలి 
హైదరాబాద్‌లో కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) కార్యక్రమాలు నిబంధనల కనుగుణంగా జరగడం లేవని, అవినీతి జరుగుతోందని జంతు ప్రేమికురాలు, సంబంధిత అంశాలపై అవగాహన ఉన్న డాక్టర్‌ శశికళ తెలిపారు. జైపూర్, గోవాల్లో ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలోనే (8–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తున్నారన్నారు. వీటితో పాటు ‘మిషన్‌ ర్యాబిస్‌’పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తారని, కుక్కల బారిన పడకుండా ఎలా వ్యవహరించాలి, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అసోంలోనూ కొన్ని సంస్థలు ఇలా పనిచేస్తున్నాయని వివరించారు.  

మాయమైన ‘మాఇంటి నేస్తం’.. 
పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ లోపం వల్ల, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల కుక్కల సంచారం పెరుగుతోంది. వీటి సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు ఐదేళ్ల క్రితం వీధికుక్కలను పెంచుకునే పథకం ‘మా ఇంటి నేస్తం’ప్రారంభించారు. అప్పట్లో 3 వేల వీధికుక్కల్ని ఆసక్తి ఉన్నవారికి దత్తత ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆ పథకం కనుమరుగైంది. అది కొనసాగినా వీధికుక్కల సంఖ్య తగ్గి ఉండేదనే అభిప్రాయాలున్నాయి. హైదరాబాద్‌ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని దాదాపు 8 నెలల క్రితం హైకోర్టు ఆదేశించినప్పటికీ చర్యల్లేక పోవడం విచారకరం. 

హైదరాబాద్‌ ఐపీఎంలో 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు నమోదైన కుక్కకాటు కేసులు  
నెల        కేసులు  
2022 
జనవరి         2,286 
ఫిబ్రవరి        2,260 
మార్చి        2,652 
ఏప్రిల్‌        2,540 
మే            2,569 
జూన్‌        2,335 
జూలై        2,201 
ఆగస్టు        2,272 
సెపె్టంబర్‌        2,177 
అక్టోబర్‌        2,474 
నవంబర్‌        2,539 
డిసెంబర్‌        2,554 
2023     
జనవరి         2,580 
––––––––––––––––––––– 
హైదరాబాద్‌లో గతంలో... 
– 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో కుక్కలు దాడి చేయడంతో 8 ఏళ్ల బాలిక మృతి. 
– 2020లో అమీర్‌పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. 
– 2020 ఆగస్టులో లంగర్‌హౌస్‌లో నలుగురు చిన్నారులకు గాయాలు  
– 2022 డిసెంబర్‌ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు. 
– 2021 జనవరి 30న బహదూర్‌పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి.  
– 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు. ఇలా ఏటా కుక్కకాట్ల వల్ల మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.  
–––––––––––––––– 
ప్రతిసారీ 4–8 పిల్లలు 
– కుక్కల జీవిత కాలం 8–12 సంవత్సరాలు.  
– 8 నెలల వయసు నిండేటప్పటికి సంతానోత్పత్తి సామర్ధ్యం వస్తుంది. 
– కుక్కల గర్భధారణ సమయం 60–62 రోజులు 
– ఒక్కో కుక్క సంవత్సరానికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది.  
– సంతానోత్పత్తి జరిపిన ప్రతిసారీ 4–8 పిల్లలు పెడుతుంది.  
––––––––––––––––––––– 
పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: కేటీఆర్‌  
అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.  వీధికుక్కల దాడిలో గాయపడి మరణించిన బాలుడి కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంతాపం తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కలు, కోతుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ అధికారులతో ఈ నెల 23 న ఉదయం 11.00 గంటలకు మాసాబ్‌ట్యాంక్‌లోని తమ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.  

కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు 
సుజాతనగర్‌: కుక్కల దాడిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, బేతంపూడి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. సుజాతనగర్‌లోని సుందరయ్యనగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఫజీమా మంగళవారం స్థానిక అంగన్‌వాడీ సెంటర్‌ నుంచి ఇంటికి వస్తుండగా.. ఒక్కసారిగా వచి్చన కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఫజీమా చేతికి గాయాలు కాగా.. స్థానికులు కుక్కలను తరిమేశారు. బేతంపూడిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న యశ్వంత్‌ అనే బాలుడిపై అకస్మాత్తుగా వచి్చన వీధి కుక్కలు దాడి చేసి గొంతుపై కరిచాయి. కుక్కల నుంచి బాలుడిని విడిపించేందుకు వెళ్లిన గ్రామస్తుడు బానోత్‌ లాలుపై కూడా దాడి చేయగా స్థానికులు వాటిని తరిమేశారు. 

అసలేం జరిగింది.. 
హైదరాబాద్‌లో తండ్రితో కలిసి అతను పనిచేసే చోటుకు వెళ్లిన బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయికి చెందిన గంగాధర్‌ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి భార్యాపిల్లలతో కలిసి బాగ్‌అంబర్‌పేటలో నివాసముంటున్నాడు. ఛే నంబర్‌లోని కార్ల సరీ్వసింగ్‌ సెంటర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 19న తన కుమారుడు ప్రదీప్‌ (4), కుమార్తెతో కలిసి కారు సరీ్వసింగ్‌ సెంటర్‌కు వెళ్లాడు. పిల్లల్ని ఆడుకొమ్మనిచెప్పి విధుల్లో నిమగ్నమయ్యాడు. ప్రదీప్‌ అక్కడ ఆటవిడుపుగా ఒంటరిగా తిరుగుతున్న సమయంలో కుక్కల గుంపు ఒకటి అకస్మాత్తుగా దాడి చేసింది. బాలుని అక్క గమనించి కేకలు వేయడంతో గంగాధర్‌తో పాటు ఇతర సెక్యూరిటీ గార్డులు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement