దర్భంగ పేలుడు: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచే ‘పార్సిల్‌’ | Darbhanga Blast: Parcel From Secunderabad Railway Station | Sakshi
Sakshi News home page

దర్భంగ పేలుడు: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచే ‘పార్సిల్‌’

Published Sat, Jul 3 2021 11:40 AM | Last Updated on Sat, Jul 3 2021 2:05 PM

Darbhanga Blast: Parcel From Secunderabad Railway Station - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ‘పార్సిల్‌ వ్యవస్థ’ అస్తవ్యస్థంగా మారిందని, ఎలాంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 17న బిహార్‌లోని దర్భంగ రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని పార్సిల్‌ సర్వీస్‌ కేంద్రం నుంచే వెళ్లినట్లు తేలడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. బుక్‌ చేసిన పార్సిల్స్‌ను స్కానర్‌ యంత్రం ద్వారా తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా పార్సిల్స్‌ను డిస్పాచ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఆదాయంపైనే దృష్టి... 
అటు లీజు హోల్డర్లు, ఇటు నగర ప్రజల నుంచి వచ్చిన పార్సిళ్లను ఎడాపెడా స్వీకరించి ఆదాయం రాబట్టుకుంటున్న రైల్వే అధికారులు అందులో ఏముందనే విషయంలో మాత్రం దృష్టి సారించడం లేదు. దర్భంగ రైల్వేస్టేషన్‌లో పేలిన బాంబు సికింద్రాబాద్‌ పార్సిల్‌ సర్వీసు నుంచి వెళ్లిందేనని తేలాక అనుమానాస్పద వ్యక్తుల సంచారం పట్ల రైల్వే రక్షక దళం పోలీసులు గస్తీ పెంచారే తప్ప రవాణా చేయాల్సిన పార్సిళ్లను తనిఖీ చేసే విషయంలో మాత్రం ఎటువంటి చర్యలు లేవు. ఒక్క సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నిత్యం సుమారుగా 130 వరకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బయలుదేరుతున్నాయి. ఒక్కో రైలులో రెండు బోగీలను పార్శిల్‌ సర్వీసు సేవలకు వినియోగిస్తున్నారు. ఈ బోగీల్లో సరుకులు రవాణా చేసేందుకు 29 మంది లీజుదారులు ఉన్నారు. వారు చేస్తున్న బుకింగ్‌ల ఆధారంగానే సరుకులు వెళ్తుంటాయి. 

స్కానర్లు లేని కారణంగానే.. 
ఒక లీజుదారు బుక్‌ చేసుకున్న పార్సిల్‌లోనే బాంబు ఉంచారు. రాత్రి 10.40 గంటలకు బయలుదేరాల్సిన దర్భంగా రైలులో పార్సిల్‌ పంపించాలని ఒక వ్యక్తి లీజుదారుడిని రాత్రి 8.30 గంటలకు సంప్రదించడంతో హడావుడిగా బుక్‌ చేసుకుని రైల్లో పంపించగా..ఆ పార్శిల్‌లోని బాంబే  దర్భంగ స్టేషన్‌లో పేలింది. ప్యాసింజర్‌ రైళ్లలో పార్సిళ్లను పంపించడానికి కాంట్రాక్టు దక్కించుకున్న 29 మంది లీజుదారుల్లో ఏ ఒక్కరి వద్ద పార్సిళ్లు తనిఖీ చేసేందుకు స్కానర్లు లేవు. టెండరు సొమ్ము, లాభాన్ని రాబట్టుకోవడం కోసం స్కానింగ్‌ తదితర భద్రతా చర్యలు చేపట్టకుండానే బుకింగ్‌లు చేసుకుంటున్నారు. బుకింగ్‌దారుల వద్దకు ప్రైవేటు వాహనాలు, వ్యక్తులు పంపిస్తున్న లీజుదారులు దుస్తులు, వస్తువులతో కూడిన పార్సిళ్లను నేరుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పార్సిల్‌ కార్యాలయానికి చేరవేస్తున్నారు.  

అన్ని స్టేషన్లలోనూ అదే పరిస్థితి.. 
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తోపాటు నగరంలో పార్సిల్‌ సేవలు అందిస్తున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఎక్కడా స్కానింగ్‌ మెషిన్‌లు లేవు. అటు లీజుదారుల నుంచి, ఇటు నగర ప్రజల నుంచి వస్తున్న అన్ని రకాల వస్తువులతో కూడిన పార్సిళ్లను స్వీకరిస్తున్న పార్సిల్‌ కార్యాలయ సిబ్బంది నేరుగా రైళ్లకు ఎక్కించేస్తున్నారు. రైల్వేస్టేషన్లలో స్వీకరించిన బాక్సులు, లగేజీలకు తూకం వేయడం, బిల్లులు రాయడం మినహా వేరే ఎటువంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్శిల్‌ సేవలను వినియోగించుకునేందుకు వందల సంఖ్యలో వ్యక్తులు బారులు తీరుతున్నారు. బుకింగ్‌ కోసం వచ్చే వ్యక్తుల నివాస ధృవీకరణలు, ఫోన్‌ నెంబర్లు స్వీకరించడం మినహా వారు వెంట తెచ్చిన పార్శిల్‌లో ఏముందన్న విషయాన్ని పట్టించుకునేవారు లేరు.  

గస్తీ పెంచాం..లేఖలు రాశాం 
దర్భంగ ఘటన నేపథ్యంలో పార్సిల్‌ కేంద్రాల వద్ద గస్తీ ముమ్మరం చేశాం. పార్సిల్‌ సర్వీసు లీజుదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. పార్సిల్‌ సేవలను వినియోగించుకునేందుకు వచ్చే వ్యక్తుల వివరాలు పూర్తిగా తీసుకోవాలని సూచించాం. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు పోలీసులకు అందించాలని తెలియజెప్పాం. పార్సిల్‌ కార్యాలయాల వద్ద స్కానర్ల ఏర్పాటు కోసం రైల్వే అధికారులకు లేఖలు రాశాం. 
– కె.బెన్నయ్య, ఇన్‌స్పెక్టర్‌ రైల్వే రక్షణ దళం  

చదవండి: దర్భంగ పేలుడు: తండ్రికి తగని కుమారులు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement