ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన BRS leaders visit to tribal ​​woman | Sakshi
Sakshi News home page

ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన

Published Sun, Jun 23 2024 4:44 AM | Last Updated on Sun, Jun 23 2024 4:44 AM

BRS leaders visit to tribal ​​woman

మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి 

చెంచు మహిళకు బీఆర్‌ఎస్‌ నేతల పరామర్శ 

నాగర్‌కర్నూల్‌: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తోంది ప్రజాపాలన కాదని.. రాక్షస పాలనని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రిలో ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను శనివారం మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. పార్టీ తరపున ఆమెకు రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమెకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.

 అక్కడి నుండే కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి బాధితురాలికి వెంటనే మహిళా వైద్యురాలి పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం సత్యవతి రాథోడ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆడబిడ్డపై ఇలాంటి దారుణ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. తనపై దాడికి పాల్పడిన వారి పేర్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు బాధపడుతోందని చెప్పారు. బాధితురాలికి మహిళా వైద్యురాలి పర్యవేక్షణ కూడా లేదని, తూతూమంత్రంగా డ్రెస్సింగ్‌ చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. 

బాధితురాలి కుటుంబానికి వెంటనే రూ.50 లక్షల పరిహారం ప్రకటించి, ఆమె ముగ్గురు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిందితులకు పోలీస్‌ స్టేషన్‌లో కొత్త అల్లుడిలా మర్యాదలు చేస్తుండడం బాధాకరమని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జిల్లా మంత్రి బాధితురాలిని పరామర్శించి.. ఆమె వద్ద మహిళా వైద్యులు లేరని గుర్తించకపోవడం దారుణమన్నారు. దాడిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు బీఆర్‌ఎస్‌ తరపున పోరాడతామన్నారు. 

జిల్లా ఆస్పత్రిలో కేవలం నలుగురు  మహిళా వైద్యులుండటం ఘోరమని విమర్శించారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల మాట్లాడుతూ ఆడబిడ్డపై ఘోరమైన పాశవిక దాడి జరిగి వారం రోజులు దాటినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement