కావ్య కనుసైగలతో మాలేపాటిపై కేసుల నమోదు? - | Sakshi
Sakshi News home page

కావ్య కనుసైగలతో మాలేపాటిపై కేసుల నమోదు?

Published Tue, Jun 25 2024 12:44 AM | Last Updated on Tue, Jun 25 2024 11:19 AM

-

కావ్య వర్సెస్‌ మాలేపాటి, బీద!

ఆగ్రహంతో రగిలిపోయి..

మానసిక క్షోభతో తీవ్ర అస్వస్థత

ఐసీయూలో చికిత్స పొందుతున్న మాలేపాటి

కావలి టీడీపీలో ఆధిపత్యం.. అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. ‘ఏరు దాటే వరకు మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందానా సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సాగిన ఐక్యతారాగం.. ఇప్పుడు శృతి తప్పింది. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా, సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఎదురొడ్డి నిలిచిన నేతలనే టార్గెట్‌ చేయడం ఇప్పుడు ఆ పార్టీలో అగ్గి రాజుకుంది. అధికారంలోకి వచ్చామనే అహంకారంతో చెలరేగిపోయిన మాలేపాటి కుటుంబంపైనే కేసులు నమోదు చేయించడంతో జీర్ణించుకోక మానసిక క్షోభతో తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి చూస్తే టీడీపీలో అంతర్యుద్ధానికి అద్దం పడుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ అంటే బీద రవిచంద్ర.. మాలేపాటి సుబ్బానాయుడు. ఇది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా పరిపాలన గాడిలో పడలేదు. కానీ అప్పుడే టీడీపీలో రాజకీయ ముసలం మొదలైంది. ఆ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ కాడి మోసే నేత లేని పరిస్థితుల్లో దగదర్తికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు రూ.కోట్లు ఖర్చు పెట్టుకుని ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడు. 

ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అండతో అధిష్టానం ఆశీస్సులతో నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగారు. తానే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ విస్తృత ప్రచారం చేసుకున్నాడు. అయితే రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో కావ్య కృష్ణారెడ్డి తెరపైకి రావడం, సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మార్పు జరగడం చకాచకా జరిగిపోయాయి. ఈ క్రమం పార్టీకి విదేయుడిగా పని చేసిన సుబ్బానాయుడు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి విజయంలో తనదైన పాత్ర పోషించారు.

అయితే ఇప్పుడేం జరిగిందంటే..
ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యాక కావ్య కృష్ణారెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విజయోత్సవాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలుచోట్ల వైఎస్సా ర్‌సీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు అనేక చోట్ల భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో మాలేపాటి సుబ్బానాయుడు తన స్వగ్రామమైన దగదర్తిలో ఈ నెల 9న టీడీపీకి చెందిన మాలేపాటి రవీంద్రనాయుడు, మాలేపాటి భాను, వడ్డే వినయ్‌, తాండ్రా కార్తీక్‌, తాండ్రా వెంకటేశ్వర్లు తదితరులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు మారెళ్ల వెంకటేశ్వర్లు ఇంటి ప్రహరీని జేసీబీతో ధ్వంసం చేశారు. 

దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు దగదర్తి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మాలేపాటి సుబ్బానాయుడు, భాను, గోపాల్‌, సూరయ్య, వినయ్‌ తదితరులు జేసీబీతో తమ ఇంటి ప్రహరీని కూల్చి వేశారని, అడ్డుకోబోయిన తన కోడలు, తనను దుర్భాషలాడుతూ దాడి చేయబోయారని దగదర్తికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారు అయిన కాండ్రా కామేశ్వరమ్మ టీడీపీ నేతలపై మరో ఫిర్యాదు చేశారు. ‘నీ కొడుకు శ్రీనివాసులు ఎక్కడున్నా వెతికి చంపేస్తామంటూ’ తమపై దాడి చేయబోగా వారి నుంచి తప్పించుకొని పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

మాలేపాటికి షాక్‌ ఇచ్చిన కావ్య
మాలేపాటి అండ్‌ గ్యాంగ్‌ సాగించిన అరాచకంపై తన మండలంలోనే తమపై కేసులు నమోదు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన మాలేపాటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మాపై కేసులు పెడుతుంటే..చూస్తూ ఊరుకుంటావా? అంటూ ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో కావ్య కూడా గట్టిగానే తిరిగి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరి మధ్య వాగ్యువాదం తారస్థాయికి చేరింది. 

‘ఎవర్ని అడిగి గోడలు కూల్చారు.. ఎవరిని అడిగి విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేశారంటూ’ కావ్య నిలదీశారంట. ఎన్నికల ముందు నుంచి మాలేపాటి ఆర్థికంగా తనను వేధించిన విషయాలను మనస్సులో పెట్టుకున్న కావ్య ఒక్కొక్కటిగా కడిగిపారేయడంతో సుబ్బానాయుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని కుటుంబ సభ్యులు చైన్నెలోని ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుతంలో ఐసీయూలో కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.

కావ్య వైఖరితోనే ఈ పరిస్థితి.. 
కావ్య కృష్ణారెడ్డి ఉద్దేశ పూర్వకంగానే మాలేపాటిపై కేసులు పెట్టించి.. ఆయన్ను తీవ్రంగా అవమానించడంతో పాటు వేధింపులకు గురిచేయడం కారణంగానే మాలేపాటి చావుబతుకుల్లో ఉన్నాడని ఆయన బంధువులు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. టీడీపీ ప్రారంభం నుంచి వీరవిధేయులుగా ఉన్న తమను కాదని, ధన బలంతో పార్టీ టికెట్‌ చేజిక్కించుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి తమను ఇంతగా కించపరచడాన్ని మాలేపాటి వర్గీయులు ఏ మాత్రం సహించబోమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. 

రానున్న రోజుల్లో అసలైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటికి అండగా నిలవాలని అంతర్గతంగా జోరుగా చర్చ జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కావలి టీడీపీలో రెండు రాజకీయ కుంపట్లు ఏర్పడి మరింత సంక్షోభావానికి దారి తీయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కావ్య కృష్ణారెడ్డి వైఖరిపై బీద రవిచంద్ర కూడా కక్కలేక.. మింగలేక రగిలిపోతున్నట్లు సమాచారం. మాలేపాటి విషయంలో కావ్య వ్యవహరిస్తున్నట్లు తీరు, పార్టీ పరిస్థితిపై లోకేశ్‌ వద్ద పంచాయితీ పెట్టన్నట్లు తెలుస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement