T20 World Cup 2024: పేలవ ఫామ్‌లో విరాట్‌.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..? Virat Kohli In Poor Form In T20 World Cup 2024, Fans Expecting To Regain His Form In Semifinal Against England | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: పేలవ ఫామ్‌లో విరాట్‌.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?

Published Wed, Jun 26 2024 12:47 PM | Last Updated on Wed, Jun 26 2024 1:10 PM

Virat Kohli In Poor Form In T20 World Cup 2024, Fans Expecting To Regain His Form In Semifinal Against England

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి.

ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు భారత క్రికెట్‌ అభిమానులను విరాట్‌ ఫామ్‌ కలవరపెడుతుంది. సెమీస్‌లో అయినా విరాట్‌ బ్యాట్‌ ఝులిపించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్‌ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా విజయావకాశాలు భారీగా దెబ్బ తింటాయి. విరాట్‌ ఎలాగైనా ఫామ్‌లోకి రావాలని టీమిండియా అభిమానులు దేవుళ్లకు ప్రార్ధిస్తున్నారు.

ప్రస్తుత వరల్డ్‌‍కప్‌లో విరాట్‌ చేసిన స్కోర్లు..

ఐర్లాండ్‌పై 1(5)
పాక్‌పై 4 (3)
యూఎస్‌ఏపై 0 (1)
ఆఫ్ఘనిస్తాన్‌పై 24 (24)
బంగ్లాదేశ్‌పై 37 (28)
ఆస్ట్రేలియాపై 0 (5)

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్‌కు జతగా విరాట్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా ప్రమోషన్‌ లభించాక విరాట్‌ ఐపీఎల్‌ తరహాలో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. అయితే విరాట్‌ పేలవ ఫామ్‌న ప్రదర్శిస్తూ అందరినీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్‌ 2024లో భీకర ఫామ్‌లో ఉండిన విరాట్‌ దేశం తరఫున ఆడాల్సి వచ్చే సరికి తేలిపోతుండటంతో అతని వ్యతిరేకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ఏకంగా విరాట్‌ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. విరాట్‌ స్థానంలో యశస్వి జైస్వాల్‌ లేదా సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్‌ కీలకమైన సెమీస్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్‌లోకి రావాలి.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. తొలి సెమీస్‌ ట్రినిడాడ్‌ వేదికగా రేపు (జూన్‌ 27) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. రెండో సెమీస్‌ గయానా వేదికగా రేపు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement