T20 World Cup 2024: పాక్‌పై విక్టరీ.. చరిత్ర సృష్టించిన టీమిండియా | T20 World Cup 2024, IND vs PAK: Team India Created History For Most Wins Against An Opponent In T20 World Cup History | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: పాక్‌పై విక్టరీ.. చరిత్ర సృష్టించిన టీమిండియా

Published Mon, Jun 10 2024 2:16 PM | Last Updated on Mon, Jun 10 2024 2:45 PM

T20 World Cup 2024, IND vs PAK: Team India Created History For Most Wins Against An Opponent In T20 World Cup History

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్‌ 9) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌.. పాక్‌పై తమ గెలుపు రికార్డును (టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో) మరింత మెరుగుపర్చుకుంది. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో భారత్‌-పాక్‌లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. భారత్‌ 7 సార్లు విజయం సాధించి పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఏ జట్టు ఓ ప్రత్యర్ధిపై ఇన్ని విజయాలు (7) సాధించలేదు. పాక్‌పై గెలుపుకు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండిది. శ్రీలంక పొట్టి ప్రపంచకప్‌ టోర్నీల్లో వెస్టిండీస్‌పై 6 సార్లు విజయం సాధించింది. తాజాగా భారత్‌.. శ్రీలంక రికార్డును తిరగరాసి పాకిస్తాన్‌పై 7 మ్యాచ్‌ల్లో విజయబావుటా ఎగురవేసింది.

ఇరు ఫార్మాట్ల ప్రపంచకప్‌ టోర్నీల్లో చూస్తే పాక్‌పై భారత్‌ విజయాల రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇరు ఫార్మాట్లలో (వన్డే, టీ20) భారత్‌-పాక్‌లు ఇప్పటివరకు 16 మ్యాచ్‌ల్లో తలపడగా.. పాక్‌ ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. 2021 టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లో పాక్‌.. భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఒక్క మ్యాచ్‌ మినహా ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌పై పాక్‌ ఎప్పుడూ గెలవలేదు.

వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో అయితే పాక్‌పై భారత్‌ గెలుపు రికార్డు వంద శాతంగా ఉంది. ఈ ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఇరు జట్లు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్‌ అన్ని మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించింది. వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక వరుస​ విజయాల విభాగంలో ఇదే రికార్డు. ఓవరాల్‌గా చూస్తే ఫార్మాట్‌ ఏదైనా ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్‌ డామినేషన్‌ ఓ రేంజ్‌లో కొనసాగుతుంది.

కాగా, న్యూయార్క్‌ వేదికగా నిన్న (జూన్‌ 9) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్‌ కాగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒత్తిడికిలోనైన పాక్‌ 113 పరుగులకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

తొలుత పాక్‌ పేసర్లు భారత బ్యాటింగ్‌ లైనప్‌కు కకావికలం చేయగా.. ఆతర్వాత భారత పేసర్లు మరింత చాకచక్యంగా బౌలింగ్‌ చేసి పాక్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టగా.. భారత బౌలర్లు బుమ్రా (4-0-13-3), హార్దిక్‌ (4-0-24-2),  సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ (4-0-31-1), అక్షర్‌ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి పాక్‌ చేతుల్లో నుంచి గెలుపును లాగేసుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ అత్యధికంగా 42 పరుగులు చేయగా.. పాక్‌ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్‌ రిజ్వాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement