T20 WC: రిటైర్మెంట్‌ ప్రకటించిన వెటరన్‌ క్రికెటర్‌ | Sybrand Engelbrecht Retires After Netherland Exit From T20 WC 2024 | Sakshi
Sakshi News home page

T20 WC: రిటైర్మెంట్‌ ప్రకటించిన వెటరన్‌ క్రికెటర్‌

Published Mon, Jun 17 2024 4:28 PM

Sybrand Engelbrecht Retires After Netherland Exit From T20 WC 2024

నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రాయల్‌ డచ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.

టీ20 ప్రపంచకప్‌-2024 లీగ్‌ దశలో శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్‌ ఓటమి తర్వాత సిబ్రాండ్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో 1988లొ జన్మించిన సిబ్రాండ్‌.. అక్కడే క్రికెటర్‌గా మారాడు.

విరాట్‌ కోహ్లి క్యాచ్‌ అందుకుని
అండర్‌-19 ప్రపంచకప్‌-2008లో సౌతాఫ్రికా తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. నాడు యువ భారత్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు.

జాంటీ రోడ్స్‌ మాదిరి క్యాచ్‌ పట్టాడంటూ అప్పట్లో సిబ్రాండ్‌పై ప్రశంసలు కురిశాయి. ఇక తర్వాత సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో కేప్‌ కోబ్రాస్‌(2008/09, 2015/16), వెస్టర్న్‌ ప్రావిన్స్‌(2009/10 to 2016/17) జట్లకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించాడు.

చాంపియన్స్‌-2014 లీగ్‌లో భాగంగా కోబ్రాస్‌ తరఫున.. జేపీ డుమిన్‌ స్థానంలో బరిలోకి దిగి.. సూపర్‌ ఓవర్‌లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అయితే, ఆ తర్వాత ఉన్నత విద్యనభ్యసించడంపై దృష్టి పెట్టిన సిబ్రాండ్‌ క్రికెట్‌కు విరామం ఇచ్చాడు.

ఉద్యోగం కోసం అక్కడికి
ఎంబీఏ చేసేందుకు ఆటను పక్కనపెట్టి.. చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో ఉద్యోగ విధుల నిమిత్తం 2021లో నెదర్లాండ్స్‌కు మకాం మార్చాడు. అక్కడ క్లబ్‌ క్రికెట్‌ ఆడిన సిబ్రాండ్‌.. డచ్‌ టాప్‌క్లాసెస్‌ చాంపియన్‌షిప్‌-2023లో వూబర్గ్‌ సీసీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఈ నేపథ్యంలో 2023లో వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2024లో టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన సిబ్రాండ్‌.. ప్రపంచకప్‌-2024 జట్టులోనూ భాగమయ్యాడు.

ఇక ఇప్పటి వరకు మొత్తంగా డచ్‌ జట్టు తరఫున 12 వన్డేలు, 12లు ఆడిన ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ ఆయా ఫార్మాట్లలో 385, 280 పరుగులు చేశాడు. ఇక రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ అయిన 35 ఏళ్ల సిబ్రాండ్‌ టీ20లలో 5 వికెట్లు కూడా పడగొట్టాడు.

టీ20 వరల్డ్‌కప్‌-2024 - గ్రూప్‌-డి శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌
👉వేదిక: సెయింట్‌ లూసియా, వెస్టిండీస్‌
👉టాస్‌: నెదర్లాండ్స్‌.. తొలుత బౌలింగ్‌

👉శ్రీలంక స్కోరు: 201/6 (20)
👉నెదర్లాండ్స్‌ స్కోరు: 118 (16.4)

👉ఫలితం: 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన శ్రీలంక
👉ఈ మ్యాచ్‌లో సిబ్రాండ్‌ చేసిన పరుగులు: 11.

చదవండి: అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement