‘ఈతరం బ్రాడ్‌మన్‌’ స్టీవ్‌ స్మిత్‌.. అరుదైన మైలురాయిని చేరుకోనున్న ఆసీస్‌ బ్యాటర్‌ | Steve Smith to play 100th Test | Sakshi
Sakshi News home page

‘ఈతరం బ్రాడ్‌మన్‌’ స్టీవ్‌ స్మిత్‌.. అరుదైన మైలురాయిని చేరుకోనున్న ఆసీస్‌ బ్యాటర్‌

Published Thu, Jul 6 2023 3:44 AM | Last Updated on Thu, Jul 6 2023 7:46 AM

Steve Smith to play 100th Test - Sakshi

2010 జూలై... లార్డ్స్‌ మైదానంలో ఆ్రస్టేలియా, పాకిస్తాన్‌ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌. దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ రిటైరై అప్పటికి మూడేళ్లవుతోంది. అతని స్థానాన్ని భర్తీ చేసే స్పిన్నర్ల వేట కొనసాగిస్తున్న ఆ్రస్టేలియా వేర్వేరు కొత్త ఆటగాళ్లతో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో 21 ఏళ్ల లెగ్‌స్పిన్నర్‌ స్టీవెన్‌ స్మిత్‌కు అవకాశం  కల్పించింది.

బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన అతను... బ్యాటింగ్‌ 8వ, 9వ స్థానాల్లో బరిలోకి దిగి 1, 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తర్వాతి రోజుల్లో  అతను బౌలింగ్‌ను పక్కన పెట్టి అద్భుతమైన బ్యాటర్‌గా ఎదుగుతాడని ఎవరూ ఊహించలేకపోయారు. టెస్టు క్రికెట్‌లో ఘనమైన రికార్డులతో ఇప్పటికే ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిన స్మిత్‌ నేడు కెరీర్‌లో 100వ టెస్టు బరిలోకి దిగనుండటం విశేషం.   

కెరీర్‌లో తొలి ఐదు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించినా... ఆ్రస్టేలియా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్మిత్‌ను బ్యాటర్‌గా గుర్తించలేదు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లే తీయడంతో సహజంగానే జట్టులో స్థానం పోయింది. మళ్లీ టీమ్‌లోకి రావడానికి అతనికి రెండేళ్లు పట్టింది. ‘హోంవర్క్‌గేట్‌’ కారణంగా సీనియర్లపై వేటు పడటంతో అదృష్టవశాత్తూ మొహాలిలో భారత్‌తో జరిగిన టెస్టులో అతనికి అవకాశం దక్కింది.

తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన స్మిత్‌ బ్యాటింగ్‌ విలువేమిటో అందరికీ అర్థమైంది. కెరీర్‌లో తొలి మూడు సెంచరీలు ఇంగ్లండ్‌పైనే నమోదు చేసిన స్మిత్‌... స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్‌ల పదునైన పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై సాధించిన శతకం అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు అత్యుత్తమ ప్రదర్శనలతో దూసుకుపోయి స్మిత్‌ టెస్టుల్లో శిఖరానికి చేరుకున్నాడు. కెరీర్‌లో ఒకదశలో అత్యుత్తమంగా 64.81 సగటును అందుకున్న స్మిత్‌... డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచి ‘ఆధునిక బ్రాడ్‌మన్‌’ అనిపించుకున్నాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచంలోనే అన్ని వేదికల్లోనూ పరుగులు సాధించగలడం స్మిత్‌ సాధించిన ఘనత.  

ఎదురులేని ప్రదర్శనలతో... 
2014–2018 మధ్య కాలం స్మిత్‌ కెరీర్‌లో అత్యుత్తమం. ఈ సమయంలో ఎన్నో అసాధారణ రికార్డులను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. 79 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 75.81 సగటుతో 5004 పరుగులు నమోదు చేశాడు. 2015 యాషెస్‌ సిరీస్‌లో 508 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అతను ఈ సిరీస్‌ ముగియగానే పూర్తి స్థాయి కెపె్టన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

భారత గడ్డపై జరిగిన బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో 3 సెంచరీలు సహా 499 పరుగులతో అతనే అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సిరీస్‌లో కఠినమైన పుణే పిచ్‌పై ప్రతికూల పరిస్థితులను అధిగమించి రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ చేసిన శతకం టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి.

కొద్ది రోజులకే కెప్టెన్‌గా సొంతగడ్డపై 4–0తో యాషెస్‌ సిరీస్‌ను గెలిపించడంతోపాటు 687 పరుగులతో టాపర్‌గా నిలిచాడు. వరుసగా నాలుగేళ్లు వేయికి పైగా పరుగులు చేసి తన స్థాయి ఏమిటో అతను చూపించాడు. 2014లో తొలిసారి 50 బ్యాటింగ్‌ సగటును స్మిత్‌ అందుకోగా, ఇప్పటి వరకూ అది అంతకంటే తగ్గకపోవడం అతని నిలకడను చూపిస్తోంది.  

టాంపరింగ్‌ వివాదాన్ని దాటి... 
తెలివితేటలు, వ్యూహ చతురత, సాంకేతికాంశాలపై పట్టు స్మిత్‌ను విజయవంతమైన కెపె్టన్‌గా నిలిపాయి. అయితే ఇదే తెలివి కాస్త ‘అతి’గా మారడంతో 2018 ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఏడాది పాటు నిషేధం కూడా పడింది.

అయితే సంవత్సరం తర్వాత తిరిగొచ్చాక అతను తనలోని పాత స్మిత్‌ను మళ్లీ చూపించాడు. 2019 యాషెస్‌లో 4 టెస్టుల్లోనే ఏకంగా 774 పరుగులతో సత్తా చాటాడు. తర్వాత కొన్నాళ్లపాటు తడబాటు కనిపించినా... గత ఏడాది గాలే టెస్టులో 145 పరుగులతో ఫామ్‌లోకి వచ్చిన అతను ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తున్నాడు.

తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో, లార్డ్స్‌ టెస్టులోనూ శతకాలు బాది మరిన్ని రికార్డులపై స్మిత్‌ గురి పెట్టాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో 99 టెస్టులు ముగిసేసరికి అత్యుత్తమ సగటు (59.56)తో నిలిచిన ఆటగాడైన స్మిత్‌ 32 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 9113 పరుగులు సాధించాడు.  


నేటి నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో ‘యాషెస్‌’ టెస్టు లీడ్స్‌లో జరగనుంది. హెడింగ్లీ మైదానంలో జరిగే ఈ పోరు కోసం ఇంగ్లండ్‌ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. గత మ్యాచ్‌ ఆడిన పోప్, అండర్సన్, టంగ్‌ స్థానాల్లో వోక్స్, అలీ, వుడ్‌లను ఎంపిక చేశారు. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆ్రస్టేలియా 2–0తో ఆధిక్యంలో ఉంది. 

మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను ‘సోనీ నెట్‌వర్క్‌’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.  

- సాక్షి క్రీడా విభాగం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement