Ashes 2023: 'Pat Cummins Is The New Mr. Cool' - Virender Sehwag Praises Australia Captain After Thrilling Win - Sakshi
Sakshi News home page

Ashes 2023: వాటే టెస్ట్‌ మ్యాచ్‌...! కొత్త మిస్టర్‌ కూల్‌.. ఆకాశానికెత్తిన సెహ్వాగ్‌.. ట్వీట్‌ వైరల్‌

Published Wed, Jun 21 2023 2:53 PM | Last Updated on Wed, Jun 21 2023 3:25 PM

Cummins Is New Mr Cool Sehwag Praises Australia After Thrilling Win - Sakshi

England vs Australia, 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో శుభారంభం చేసిన ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా మాజీ బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసలు కురిపించాడు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్కంఠభరిత టెస్టు మ్యాచ్‌ చూడనేలేదంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆసీస్‌ సారథిని ‘న్యూ మిస్టర్‌ కూల్‌’గా అభివర్ణించిన వీరూ భాయ్‌.. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖావాజా అద్భుతం అంటూ ఆకాశానికెత్తాడు.

తొలి రోజే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌
ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జూన్‌ 16-20 వరకు మొదటి టెస్టు జరిగింది. బజ్‌బాల్‌ విధానం పేరిట సంప్రదాయ క్రికెట్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌.. మొదటి రోజే 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌ దిగిన ఆసీస్‌.. ఉస్మాన్‌ ఖవాజా అద్భుత సెంచరీ(141)కి తోడు.. ట్రవిస్‌ హెడ్‌ అర్ధ శతకం(50)తో రాణించడంతో 386 పరుగులకు ఆలౌట్‌ అయి మొదటి ఇన్నింగ్స్‌ ముగించింది.

అద్భుతం చేసిన కమిన్స్‌, నాథన్‌
ఇదిలా ఉంటే.. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌, వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ నాలుగేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో ఉస్మాన్‌ ఖవాజా (65) మరోసారి బ్యాట్‌ ఝులిపించగా.. ప్యాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు.

కమిన్స్‌ 73 బంతుల్లో 44 పరుగులతో.. నాథన్‌ 28 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి ఓటమి నుంచి ఆసీస్‌ను గట్టెక్కించి గెలుపుబాట పట్టించారు. దీంతో అనూహ్య రీతిలో సొంతగడ్డపై తొలి టెస్టులోనే ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. 

వాటే టెస్ట్‌ మ్యాచ్‌!
ఈ నేపథ్యంలో రెండు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0తో ముందంజ వేసిన ఆస్ట్రేలియా, జట్టును గెలిపించిన టెయిలెండర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ఆసీస్‌ను కొనియాడుతూ చేసిన ట్వీట్‌ అభిమానులను ఆకర్షిస్తోంది.

‘‘వాటే టెస్ట్‌ మ్యాచ్‌! ఇటీవలి కాలంలో నేను చూసిన అత్యంత గొప్ప మ్యాచ్‌ ఇదే. నిజంగా టెస్ట్‌ క్రికెట్‌ బెస్ట్‌ క్రికెట్‌. మొదటి రోజే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి ఇంగ్లండ్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా వాతావరణం అలా ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడం అంటే మాటలు కాదు! ఏదేమైనా ఖవాజా రెండు ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. ఇక ప్యాట్‌ కమిన్స్‌ టెస్టు క్రికెట్‌లో మరో మిస్టర్‌ కూల్‌గా అవతరించాడు. 

తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలో కమిన్స్‌, లియోన్‌ నమోదు చేసిన భాగస్వామ్యం సుదీర్ఘ కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది’’ అని సెహ్వాగ్‌ కమిన్స్‌ను ప్రశంసించాడు. కాగా సాధారణంగా టీమిండియా లెజెండరీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని మిస్టర్‌ కూల్‌గా అభిమానులు పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే.

చదవండి: శుబ్‌మన్‌ గిల్‌ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. శుబ్‌మన్‌ గిల్‌కు నో ఛాన్స్‌! రుత్‌రాజ్‌ రీ ఎంట్రీ
బంగ్లాదేశ్‌ చిత్తు.. ఆసియాకప్‌ విజేతగా భారత్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement