Bairstow's Stump Out: Usman Khawaja Confronts Fan, Ashwin Says Nothing Wrong - Sakshi
Sakshi News home page

బెయిర్‌స్టో స్టంపౌట్‌ వివాదం.. ఆసీస్‌ ఆటగాడిపై దూషణ పర్వం.. తప్పేమీ లేదన్న అశ్విన్‌

Published Mon, Jul 3 2023 7:40 AM | Last Updated on Mon, Jul 3 2023 8:58 AM

Bairstow Controversial Stump Out: Usman Khawaja Confronts Fan, Ashwin Says Nothing Wrong - Sakshi

లార్డ్స్‌ టెస్టు చివరి రోజు ఆటలో బెయిర్‌స్టోను స్టంపౌట్‌ చేసిన తీరు వివాదాన్ని రేపి తీవ్ర చర్చకు దారి తీసింది. లంచ్‌ ముందు ఈ ఘటన జరిగింది. గ్రీన్‌ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్‌ క్యారీ అండర్‌ఆర్మ్‌ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది.

ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండటంతో థర్డ్‌ అంపైర్‌ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్‌ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఆసీస్‌ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ‘పాత ఆ్రస్టేలియా...ఎప్పటిలాగే మోసగాళ్లు’ అంటూ ప్రేక్షకులంతా గేలి చేశారు. 

లంచ్‌ సమయంలో పరిస్థితి మరింత ముదిరింది. లార్డ్స్‌ మైదానంలో ప్రతిష్టాత్మక లాంగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు నడుస్తుండగా కొందరు మాటలతో ఖ్వాజాను దూషించారు. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీనిపై ఆ్రస్టేలియా క్రికెట్‌ బోర్డు ఆగ్రహంతో ఎంసీసీకి ఫిర్యాదు చేయగా...వారు చివరకు ఘటనపై క్షమాపణ చెప్పారు. నిబంధనల ప్రకారం చూస్తే బెయిర్‌స్టో అవుట్‌లో తప్పు లేదు.

బంతి ఇంకా ‘డెడ్‌’ కాకముందే అతను క్రీజ్‌ వీడాడు. బయటకు వెళ్లే ముందు అతను తన కాలితో క్రీజ్‌ లోపల నేలను గీకడం కూడా కనిపించినా బంతి కీపర్‌ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉన్న క్యారీ స్టంప్‌ చేశాడు. దాంతో మరోసారి క్రీడా స్ఫూర్తి చర్చ ముందుకు వచ్చింది. కామెంటేటర్లంతా వాదనకు చెరో వైపు నిలిచారు.  

ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో స్పష్టంగా ఉండే భారత స్పిన్నర్‌ అశ్విన్‌ మాత్రం ఇందులో తప్పేమి లేదని, అది అవుట్‌ అని స్పష్టం చేశాడు. ‘ఒకటి మాత్రం నిజం. వెనక అంత దూరం నిలబడిన కీపర్‌ స్టంప్స్‌పైకి బంతి విసిరాడంటే అప్పటికే బెయిర్‌స్టో ఇలాంటి ప్రయత్నం చేసి ఉండటం అతను చూసి ఉంటాడు’ అని అశ్విన్‌ విశ్లేషించాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement