NCA: వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం గుడ్‌బై!.. కారణం? | After Declining India Head Coach Job VVS Laxman Set To Leave NCA Post: Report | Sakshi
Sakshi News home page

VVS Laxman: భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు.. వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం గుడ్‌బై

Published Mon, Jun 24 2024 7:21 PM | Last Updated on Mon, Jun 24 2024 7:57 PM

After Declining India Head Coach Job VVS Laxman Set To Leave NCA Post: Report

భారత క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. జాతీయ ‍క్రికెట్‌ అకాడమీ(ఎన్సీఏ) హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. నిజానికి వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ టీ20 మెగా టోర్నీ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేందుకు ద్రవిడ్‌ అంగీకరించాడు.

ఈ క్రమంలో అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా వీవీఎస్‌ లక్ష్మణ్‌ను బోర్డు కోరగా అందుకు అతడు నిరాకరించాడనే వార్తలు వినిపించాయి. అనంతరం రేసులోకి దూసుకొచ్చిన మరో మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ప్రధాన కోచ్‌గా నియమితుడు కావడం దాదాపుగా ఖరారైపోయింది.

కాగా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో 2021లో రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ నియమితుడయ్యాడు.

లక్ష్మణ్‌ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోనున్నట్లు సమాచారం. అయితే, కుటుంబానికి సమయం కేటాయించే క్రమంలో అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.

ఎన్సీఏ హెడ్‌గా తప్పుకొన్న తర్వాత కామెంట్రీ చేయడంతో పాటు ఐపీఎల్‌ మెంటార్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2013- 2021 వరకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మెంటార్‌గా ఉన్న విషయం తెలిసిందే.

కాగా ఎన్సీఏ చైర్మన్‌గా తన పదవీకాలంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ అబ్బాయిలు, అమ్మాయిల క్రికెట్‌లోని అన్ని కేటగిరీలపై దృష్టి సారించి జూనియర్‌ నుంచి సీనియర్‌ లెవల్‌ వరకు రాటుదేలేలా శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతమయ్యాడని చెప్పవచ్చు. అదే విధంగా.. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం, త్వరగా వాళ్లు కోలుకునేలా సహాయక సిబ్బందిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ మేరకు ది టెలిగ్రాఫ్‌ తన కథనంలో పేర్కొంది.

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌-2024లో సెమీస్‌ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్‌ సేన.. సోమవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెయింట్‌ లూసియాలోని డారెన్‌ సామీ జాతీయ క్రికెట్‌ స్టేడియం ఇందుకు వేదిక. 

చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్‌.. పట్టుబట్టిన గంభీర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement