బిగ్‌ డే.. కౌంటింగ్‌కు వైఎస్‌ఆర్‌సీపీ ‘సిద్ధం’ Ysrcp Confident On Election Victory Alerted Cadre For Counting | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు రెడీ.. గెలుపుపై వైఎస్‌ఆర్‌సీపీ ధీమా

Published Mon, Jun 3 2024 7:30 PM | Last Updated on Mon, Jun 3 2024 7:39 PM

Ysrcp Confident On Election Victory Alerted Cadre For Counting

సాధారణ ఎన్నికల ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టీడీపీతో అప్రమత్తంగా ఉండాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన కౌంటింగ్‌ ఏజెంట్లను అప్రమత్తం చేసింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ప్రావీణ్యం సాధించిన టీడీపీ ఎటువంటి అక్రమాలకైనా తెగిస్తుందని హెచ్చరించారు. విజయం పట్ల ఎంత ధీమాగా ఉన్నా ప్రత్యర్థుల విషయంలో అజాగ్రత్తగా ఉండరాదనే విధంగా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు కౌంటింగ్‌కు సిద్ధం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో  రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అధికార వైఎస్‌ఆర్‌సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గడచిన ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమకు మరోసారి అధికారాన్ని అందిస్తాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పోలింగ్ రోజున పోలింగ్ బూత్‌లకు సునామీలా ఉవ్వెత్తున వచ్చిన మహిళలే ఇందుకు నిదర్శనమంటున్నారు.

రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్ళలో ఏపీలో జరిగినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదని వైఎస్‌ఆర్‌సీపీ గుర్తు చేస్తోంది. అందుకే ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం కనిపిస్తోందని చెబుతున్నారు.

రాష్ట్రంలో నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 81.86 శాతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది గత ఎన్నికల కంటే 2 శాతం ఎక్కువ. సహజంగా పోలింగ్ భారీగా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వెల్లువలా వచ్చారని భావించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో  అనేక అనుభవాలు చూసినా..తాజా ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూసినా..ఇది ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు అందాయి. ప్రతి కుటుంబం లక్షలాది రూపాయల లబ్ధి పొందింది. వారంతా వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి రావాలనే కోరుకున్నారు. పైగా పేదలకు సంక్షేమం ఇచ్చే విషయంలో, గడచిన మూడు నెలల్లో పెన్షన్ విషయంలో వృద్ధులను చంద్రబాబు టీమ్ పెట్టిన కష్టాలు ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికల్లో తమ ఓటమి ఖాయం అని ఖరారు చేసుకున్న పచ్చ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవస్థను మేనేజ్ చేయవచ్చనే దురాలోచనతోనే నానా తిప్పలు పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగానే ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికల్లో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున కూడా అక్రమాలకు తెగబడతారనే ఆలోచనతో వైఎస్‌ఆర్‌సీపీ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా అసలైన ఫలితాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ శ్రేణులకు సూచించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement