పెన్షన్ల పంపిణీ బ్యాక్ ఫైర్.. సరిదిద్దుకోలేక టీడీపీ తిప్పలు  | Stopping Of Pension Distribution Misfire To TDP | Sakshi
Sakshi News home page

పెన్షన్ల పంపిణీ బ్యాక్ ఫైర్.. సరిదిద్దుకోలేక టీడీపీ తిప్పలు 

Published Tue, Apr 2 2024 10:55 AM | Last Updated on Tue, Apr 2 2024 12:18 PM

Stopping Of Pension Distribution Misfire To TDP - Sakshi

లేపి తన్నించుకోవడం అంటే ఇదే 

ఉచ్చు బిగించే కుట్రలో తిరిగి రొచ్చులో పడ్డారు..

కొండవీటి దొంగలో చిరంజీవిని ఎలాగైనా పట్టుకుంటానని. ఆయన్ను నిలువరిస్తానని ప్రతినబూనిన పోలీస్ ఆఫీసర్ విజయశాంతి ఆయన్ను వెంబడిస్తుంది. చిరంజీవిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరదు.. చివరకు ఆమె పెద్ద బురదగుంటలో పడిపోతుంది.. దీంతో చిరంజీవి వచ్చి నన్ను ఉచ్చులో దించుతామని నువ్వు రొచ్చులో పడ్డావేంటి అంటాడు. అచ్చం ఇపుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఐంది. రేసు గుర్రంలా దూసుకెళ్తున్న జగన్‌ను నిలువరించేందుకు వేసిన వలంటీర్ల ఉచ్చు తిరిగి చంద్రబాబు మెడకు చుట్టుకుంది. దాన్నిప్పుడు తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 

అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లుంది టీడీపీ పరిస్థితి. వాస్తవానికి టీడీపీ జనసేన  బీజేపీ కలిసి పొత్తులో సీట్లు ప్రకటించిన దగ్గర్నుంచి వారి పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎటునుంచి చూస్తున్నా ఎక్కడోచోట ఇబ్బంది కనిపిస్తూనే ఉంది. దానికితోడు టీడీపీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేని చోట్ల తమ వాళ్ళను జనసేనలోకి పంపించి అక్కడ గ్లాసు గుర్తు మీద పోటీ చేయిస్తున్నారు. అవనిగడ్డలో బుద్ధప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ అలా టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్ళే.. ఇదిలా ఉండగానే తమ కూటమిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ వేసిన తప్పటడుగు ఇప్పుడు వాళ్ళను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

చిన్న గాయాన్ని గోక్కుని... గెలుక్కుని పెద్ద పుండుగా  మార్చినట్లు ఐంది. ఇన్నేళ్ళుగా వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. ఐతే అది ఆపాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులమేరకు వాలనీర్లను పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం దూరం పెట్టింది. అది సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారని, అది తమకు లాభిస్తుందని టీడీపీ క్యాంప్ భావించింది. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ అదే అంశం మీద ప్రజల్లోకి వెళ్ళింది.

ఫస్ట్ తేదీ వచ్చినా పెన్షన్లు ఇవ్వలేకపోవడానికి టీడీపీ కారణం... చంద్రబాబే వాలంటీర్లను అడ్డుకున్నారు. లేకుంటే ఈపాటికి అవ్వాతాతలకు పెన్షన్లు అందేవి అంటూ వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాతోబాటు ఆ పార్టీ నాయకులూ ప్రచారం మొదలు పెట్టి.. ఈ అంశాన్ని ప్రజలకు వివరించారు. ఇంకేముంది... ప్రజలు.. దాదాపు 67 లక్షలమంది వృద్ధులు.. వికలాంగులు తిట్లు అందుకున్నారు. మా నోటికాడి కూడు ఆపేసారు... లేకుంటే ఈపాటికి మాకు పెన్షన్లు  అందేవి.. చంద్రబాబు పెద్ద కుట్రదారు అంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ ఎండల్లో వృద్ధులం ఎక్కడికి వెళ్తాం.. మా వాలంటీర్ ఉంటే మాకు చక్కగా పెన్షన్లు అందేవి.. ఈ చంద్రబాబు మాకు పెన్షన్లు ఆపేసాడు.. ఎన్నికల్లో అయన సంగతి చూస్తాం అంటున్నారు. 

రోజూ ఇంట్లోని రొట్టెముక్కల్ని తినేస్తున్న ఎలకను పట్టుకునేందుకు పిల్లి ఒక ఉచ్చు తయారు చేసింది... అది ఎలక మెడకు వేయబోతే తిరిగి తన మెడకే చుట్టుకోవడంతో దాన్ని తీసుకోలేక పిల్లి గిలగిలా కొట్టుకుంది... అచ్చం ఇలాగే ఇంటింటికి వలంటీర్ల ద్వారా సేవలు అందిస్తూ తన ఓట్లను సునాయాసంగా ఎత్తుకుపోతున్న సీఎం వైయస్ జగన్ను అదుపు చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు... వలంటీర్ల కాళ్లకు కర్ర అడ్డం బెట్టి వాళ్ళను పడగొట్టి తాను రేసులో ముందుకు పోదాం అనుకున్నారు... అయితే చంద్రబాబు ఆ కర్రను తన కాళ్ళమధ్య పెట్టుకుని తానే బోర్లా పడినట్లు ఐంది.. దీంతో ఇప్పుడు లేవలేక నానా అవస్థలు పడుతున్నారు.  

ఇది కాస్తా టీడీపీకి డ్యామేజ్గా మారింది. దీంతో ఇప్పుడు బాబు, టీడీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. సచివాలయంలో లక్ష ముప్ఫైవేలమంది ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్లతో పెన్షన్లు ఇప్పించండి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అసలు జగనొచ్చాక ఉద్యోగాలే ఇవ్వలేదని చెబుతూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు సచివాలయంలోని లక్షా ముప్పైవేల ఉద్యోగులు ఉన్నారుగా వాళ్లతో పెన్షన్లు ఇవ్వండి అని సలహా ఇచ్చేసారు.

మొత్తానికి కూటమి కూర్చిన తరువాత పార్టీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు ఏదేదో చేసి ప్రభుత్వాన్ని గందరగోళపరుద్దామని భావించి తానే ఉచ్చులో చిక్కుకున్నట్లు అయింది. ఇప్పుడు మెడకు చుట్టుకున్న తాడును తప్పించుకునేందుకు చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ అంశంలో పవన్ కల్యాణ్... బీజేపీలు సైలెంట్ గా ఉన్నాయ్... చంద్రబాబు చేసిన పెంటను తామెందుకు నెత్తికి రుద్దుకోవాలి అనుకున్నాయో ఏమో మరి ఆ పార్టీలు... దాని నేతలు మాత్రం ఈ అంశాన్ని విననట్లే ఊరుకున్నారు.  

:::సిమ్మాదిరప్పన్న 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement