రాజకీయాల్లోనూ పవన్‌ది నటనే Pothina Mahesh Sensational Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోనూ పవన్‌ది నటనే

Published Tue, Apr 9 2024 4:20 AM | Last Updated on Tue, Apr 9 2024 4:20 AM

Pothina Mahesh Sensational Comments On Pawan Kalyan - Sakshi

స్వార్ధం కోసమే పవన్‌ జనసేనను స్థాపించారు 

త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు 

భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్‌ చెప్పాలి 

అనకాపల్లి సీటునూ ఎందుకు త్యాగం చేశారు? 

జన సైనికులను జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా మార్చారు 

పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెండ్ల మనోహర్‌ 

జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌  

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోనూ అద్వితీయంగా నటించి జనసేన నాయకులను నట్టేట ముంచుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు ఆయన చెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో సోమవారం పోతిన మహేష్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు, కార్యకర్తలకు భరోసాను, నమ్మకాన్ని కలిగించే వారే నాయకులవుతారని, రాజకీయాల్లో నటించే వారు నాయకుడు కాలేరని పవన్‌పై ఆయన విరుచుకుపడ్డారు.

పవన్‌ను నమ్మి అతనితో అడుగులు వేశామని.. కానీ, ఆయనతో ప్రయాణం చేసినందుకు ఇప్పుడు తమపై తమకే అసహ్యం వేస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
2014లో పోటీచేయకపోయినా 2019లో ఒక్క సీటు గెలిచినా, 2024పై ఆశలు పెట్టుకున్నాం. కానీ, పారీ్టలో జరుగుతున్నది, జరిగిన పరిణామాలను చూస్తే ఏమీ అర్థంకాక పిచ్చెక్కుతోంది. ఇంత జరుగుతున్నా పవన్‌కళ్యాణ్‌ నుంచి ఎలాంటి స్పందనలేదు. జనసేన నాయకులను దారుణంగా మోసం చేసిన పవన్‌ రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు, నాలాంటి కొత్తతరం నాయకులకు సమాధానం చెప్పాలి.

గడిచిన ఐదేళ్లలో పార్టీ నిర్మాణంపై ఎక్కడా దృష్టిపెట్టలేదు. పవన్‌కళ్యాణ్‌ స్వార్థం కోసమే పార్టీని పెట్టినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్ధంకావట్లేదని అనుకున్నాం.. కానీ, స్వార్థంతో ఉన్న పవన్‌ను ప్రజలు గ్రహించారు. అందుకే జనసేనపట్ల వారికి నమ్మకం కుదరలేదు. అసలు 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకు పవన్‌ ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? అందులో సగానికి పైగా టీడీపీకి చెందిన వారికి సీట్లు కేటాయించారు.. ఒకవేళ గెలిచిన నాయకులు పార్టీ కోసం నిలబడతారా? లోపాయికారి ఒప్పందాలతో, త్యాగం పేరుతో నాలాంటి కొత్త నాయకులను పవన్‌ నట్టేట ముంచారు. నిజానికి.. రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీని నేను ఎంతో కష్టపడి నిలబెట్టా. కానీ, జనసేన నన్ను రాజకీయంగా చంపేసింది. జనసేనకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.   

గెలిచే భీమవరం వదిలి పిఠాపురం ఎందుకెళ్లారు 
పార్టీ బలంగా ఉన భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్లారో పవన్‌ స్పష్టంచేయాలి. అక్కడ మీకు అండగా నిలిచిన వ్యక్తికి సీటు ఇవ్వకుండా టీడీపీకి ఆ సీటు వదిలేయటం ఏమిటి? దీనిలో ఏ ప్రయోజనం ఆశించి బయటకొచ్చారో చెప్పాలి. అలాగే, అనకాపల్లి సీటు నాగబాబుకు అని చెప్పి తరువాత దానిని వదులుకున్నారు. అక్కడకు నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల నుంచి భారీగా ఫండ్స్‌ వసూలుచేశారు. వారంతా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాగానే అక్కడి నుంచి బయటకొచ్చారు.  

జనసేనను మనోహర్‌ పూర్తిగా నాశనం చేశారు 
జనసేన అనే బస్సు స్టీరింగ్‌ను పవన్‌కళ్యాణ్‌ నాదెండ్ల మనోహర్‌ చేతికిచ్చారు. కానీ, ఆ బస్సును మనోహర్‌ కొండకు ఢీకొట్టి పార్టీని నాశనం చేశారు. పవన్,  మనోహర్‌ ఇద్దరూ కలిసి జనసైనికులను జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు చంద్రబాబును, ఆ తర్వాత ఆయన కొడుకును, ఆపైన దేవాన్షును ముఖ్యమంత్రులను చేసేందుకు జనసేనని జనసైనికులను బలిచేస్తున్నారు. అసలు నాదెండ్ల మనోహర్‌ బాగోతమంతా తెనాలిలో ప్రెస్‌మీట్‌ పెట్టి చెబుతా. ఇక చివరిగా నాదో కోరిక.. దానిని పవన్‌కళ్యాణ్‌ తీర్చాలి. పిఠాపురంలో మీ ఇంటి గృహ ప్రవేశానికి అన్నా లెజినోవాతోనే రావాలి. మున్ముందు ఇంకా చాలా విషయాలను ఆధారాలతో బయటపెడతా. 

కాపు–బీసీల మధ్య గొడవకు పవన్‌ కుట్ర 
రాష్ట్రంలో కాపు, బీసీల మధ్య గొడవ పెట్టి తద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలనే భారీ కుట్రకు పవన్‌ ప్రయత్నిస్తున్నారు. 21 సీట్లలో పారీ్టకి తీవ్ర నష్టం జరుగుతుందని కాపులు హెచ్చరించి పారీ్టకి దూరంగా వెళ్లిపోయారు. అయితే, వారిని దగ్గర చేసుకోవడం కోసం బీసీలకు సీట్లు ఎగ్గొట్టి కాపులకు బీసీలకు మధ్య గొడవ పెట్టాలని కుట్ర పన్నారు. బీసీలు సీట్ల కోసం ప్రశ్నిస్తే కాపులు తనకు మద్దతుగా నిలిచి బీసీలపై దాడిచేస్తారన్నది ఆయన ఉద్దేశం. పవన్‌.. దయచేసి కాపులను బలిచెయ్యొద్దు.  

మేం ఆస్తులు అమ్ముకుంటే మీరు కొనుక్కున్నారు 
నేను, నాలాంటి నాయకులు పార్టీలో చేరి మా ఆస్తులు అమ్ముకుంటే మీరు మాత్రం ఆస్తులు కూడబెట్టుకున్నారు. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాలన్నింటినీ త్వరలో అన్ని ఆధారాలతో బయటపెడతా. నిజానికి.. మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు. సుజనాచౌదరి గతంలో తన బినామీ ఛానల్‌లో తన తల్లిని దూషించారని పవన్‌కళ్యాణ్‌ స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. అలాంటి సుజనాకు పవన్‌ టికెట్‌ ఎలా ఇప్పించారు? సుజనా గెలుపు కోసం మీరు ఎలా భాగస్వాములు కావాలనుకుంటున్నారు? కన్నతల్లిని విమర్శించి, పచ్చనోటు పడేస్తే అన్నీ మర్చిపోయారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement