రాష్ట్రంలో స్కిల్‌ వర్సిటీ: మంత్రి శ్రీధర్‌బాబు Minister Shridhar Babu revealed that Skill University will come up in Telangana state soon | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో స్కిల్‌ వర్సిటీ: మంత్రి శ్రీధర్‌బాబు

Published Thu, Feb 8 2024 9:13 AM | Last Updated on Thu, Feb 8 2024 9:13 AM

Minister Shridhar Babu revealed that Skill University will come up in Telangana state soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని, ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) తరహాలో ఈ వర్సిటీ నైపుణ్య మానవ వనరులను అందిస్తుందని వివరించారు.

టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్‌ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయని చెప్పారు. వర్సిటీ కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉంటారని వ్యాఖ్యానించారు. బుధవారం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన టెలిపర్‌ ఫార్మెన్స్‌ ఇంప్రెసివ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగించారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతుందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌ అత్యంత అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు.

జూన్‌లో హైదరాబాద్‌లో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నామని, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వనిస్తున్నామని శ్రీధర్‌బాబు వివరించారు. ఏఐ సాంకేతికతలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ హెడ్‌ క్వార్టర్స్‌గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిసారించామని, టూరిజం అభివృద్ధిని 20 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. 

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్‌ ఖాయం 
1990వ దశకంలో దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఉన్నప్పుడే హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... తాము హైదరాబాద్‌లో ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్‌ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

టెలిపర్‌ ఫార్మెన్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌ డానియల్‌ జులియన్, సీఈఓ అనీష్‌ ముక్కర్‌ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వివరించారు. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, ఇండస్ట్రీ, ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ పాలసీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement