కేజ్రీవాల్, కవితల అరెస్ట్‌ ప్లాన్‌ ప్రకారమే జరిగిందా? | Kommineni Srinivasa Rao Comments On MLC Kavitha And Arvind Kejriwal Arrest, Details Inside - Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్, కవితల అరెస్ట్‌ ప్లాన్‌ ప్రకారమే జరిగిందా?

Published Sun, Mar 24 2024 2:55 PM | Last Updated on Sun, Mar 24 2024 5:11 PM

Ksr Comments On Kavitha And Kejriwal Arrest - Sakshi

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, శాసనమండలి సభ్యురాలు కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రింకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనే, సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఒక రోజు ముందుగా, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలంగాణలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ అరెస్టు జరగడం విశేషం. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంటిపైకి దాడి చేసి, సోదాలు చేసి ఆయనను అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారిగా కనిపిస్తుంది.

కేజ్రీవాల్, కవితలకు ఈడీ ఇచ్చిన ఒకటి, రెండు నోటీసులకు స్పందించారు. విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత వారికి అరెస్టు అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ విచారణకు హాజరవకుండా కాలయాపన చేశారు. ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ దర్యాప్తు సంస్థలు వేల కోట్ల అక్రమాలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న వారిని చూసి, చూడనట్లు వదిలేస్తూ, వంద కోట్లు ఆరోపణలపై ఇంత గట్టిగా హడావుడి చేయడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తోంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంపై కోపంతోనే, అక్కడ బీజేపీకి ఉన్న బలం తగ్గడంతోనే తన చేతిలోని అధికారాన్ని బీజేపీ ఇలా వినియోగిస్తోందన్నది పలువురి అభియోగం. లిక్కర్ స్కామ్  జరిగింది కనుకే అధికారులు చర్య తీసుకున్నారన్నది బీజేపీ వాదన.

2023 శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందే కవితను ఈ కేసులో అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. ఎందువల్లో కానీ అలా జరగలేదు. దాంతో బీఆర్‌ఎస్‌, బీజేపీల మద్య రాజీ కుదిరిందేమో అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి కొంత నష్టం జరిగింది. కనీసం ఇరవై సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నది బీజేపీ నేతల మనోగతంగా ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణ చేయడానికి కాంగ్రెస్కు అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతోనే ఈ అరెస్టుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇందువల్ల బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందా అన్నది చర్చనీయాంశం.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ విపక్షంలో ఉంది. తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. అలాంటప్పుడు తమవంతుగా ఒక దెబ్బకొట్టి బీఆర్‌ఎస్‌ను ఇంకా బలహీనపరిస్తే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగవచ్చని బీజేపీ నేతలు భావించి ఉండవచ్చు. విశేషం ఏమిటంటే బీజేపీ ఢిల్లీలో జరిగినట్లు చెబుతున్న వంద కోట్ల రూపాయల స్కామ్ పై ఇంత శ్రద్ద చూపుతోంది కానీ, వేల కోట్ల స్కామ్‌ల గురించి పట్టించుకోకుండా, తమ వైపునకు వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.

ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులలోకానీ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు కొందరిపై ఉన్న కేసులలో కానీ,ఆదర్శ్ స్కామ్ లో పదవీచ్యుతుడైన కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీ మారి బీజేపీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చిన తీరుకానీ, చీలిక వర్గం శివసేన, చీలిక వర్గం ఎన్‌సీపీ నేతల పట్ల  అనుసరించిన వైఖరులు కానీ ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. కవిత ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తప్పే  అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆప్‌కు చెందిన మంత్రి మనీష్ సిసోడియా ఇదే కేసులో సంవత్సర కాలంగా జైలులో ఉన్నారు. లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడానికి వీలుగా విధానాన్ని మార్చడంపై వచ్చిన ఆరోపణలు, ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు కనుక, కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీ వంటి వాటిని ప్రయోగించగలిగింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని బీజేపీ తలపెట్టిందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. నిజంగానే అవినీతిపై బీజేపీ ఫోకస్ పెడితే మంచిదే. అలాకాకుండా కేవలం ప్రత్యర్ధులను భయపెట్టడానికి, తన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికే ఈడీ, సీబీఐ వంటివాటిని వాడితే అది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. గతంలో బీజేపీ ఈ సంస్థలపై, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసిందో, అదే పని ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుందని భావించవలసి ఉంటుంది.

  • ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదిని టెర్రరిస్టుతో పోల్చారు.
  • సీబీఐ, ఈడీ వంటివాటితో తమపై దాడులు చేయిస్తోందని ద్వజమెత్తేవారు.
  • సీబీఐ తనను అరెస్టు  చేయడానికి రావచ్చని, అప్పుడు ప్రజలంతా తన చుట్టూ నిలబడి రక్షించుకోవాలని అనేవారు.
  • తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారు.


అప్పట్లో కొందరు టీడీపీ ప్రముఖులపై ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలు దాడులు చేశాయి. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలయ్యాక, చంద్రబాబుకు పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో ఐటీ శాఖ సోదాలు చేసి రెండు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఆదారాలు దొరికినట్లు సీబీటీడీ ప్రకటించింది. అలాగే చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ మనీ లాండరింగ్ తదితర ఆరోపణలకు సంబందించి పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆయన ఏదో రకంగా వాటి నుంచి బయటపడుతూనే ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు యుటర్న్ తీసుకుని ప్రధాని మోదిని, బీజేపీని పొగడడం ఆరంభించారు. అంతవరకు మోది అంత అవినీతి పరుడు లేడని, టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలతాడని అంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు దాడి చేసేవారు.

కానీ ఓటమి తర్వాత బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయారు. తన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించారు. పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ గూటికి పంపించి, తనకు, బీజేపీకి మధ్య రాయబారిగా వాడుకున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు కేసుల జోలికి రాకుండా వదలిపెట్టేసిందని అనుకోవాలి. ఏపీలో చంద్రబాబు టైమ్ లో జరిగిన పలు కుంభకోణాలలో సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రం స్పందించలేదంటేనే చంద్రబాబు మేనేజ్‌మెంట్ స్కిల్ ఏ రకంగా ఉన్నది జనం అర్దం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడుకున్నారని మోది ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చారు.

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు సంచలన ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్‌లకు 150 కోట్ల మేర ముడుపులు చెల్లించామని చెప్పారు. అయినా ఈడీ, సీబీఐ ఏవీ స్పందించలేదు. ఐటీ ఇచ్చిన నోటీసులో దుబాయిలో జరిగిన మనీలాండరింగ్ గురించి కూడా ప్రస్తావించినా తదుపరి చర్యలేదు. చంద్రబాబు ఏపీలో స్కిల్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు అయితే బీజేపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్‌షాను కలిసి సాయం చేయాలని అడిగారు. ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది!

తాజాగా హైదరాబాద్‌లో ఐఎమ్.జి భరత్ అనే సంస్థకు అప్పనంగా 850 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన కేసులో సీబీఐ విచారణ జరగాలని హైకోర్టు అబిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయమై ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎటూ చంద్రబాబు శిష్యుడే కనుక దానినుంచి తప్పించవచ్చు. ఈ రకంగా అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను మేనేజ్ చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించగలుగుతున్నారని చెప్పాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ అనేవారు. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొందరు, న్యాయ వ్యవస్థలోని ఒకరిద్దరు ప్రముఖులు అండగా నిలిచి చంద్రబాబుపై కేసు రాకుండా చూడగలిగారు.

ఇలా పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు జోలికి ఈడీ, సీబీఐ వంటివి ఎందుకు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెబుతాం. బీజేపీలో చేరిన సుజనా చౌదరి సుమారు ఏడువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగవేశారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా పార్టీ మారగానే ప్రధాని ఎదురుగా కూర్చోగలిగారు. అలాగే చంద్రబాబు కూడా మోదితో కలిసి సభలో పాల్గొనగలిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేర్పరితనం కేసీఆర్‌లో, కేజ్రీవాల్‌లో కొరవడడం వల్లే ఇప్పుడు కేసీఆర్‌ కుమార్తె కవిత, అలాగే కేజ్రీవాల్  జైలు పాలయ్యారా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్‌ టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం, మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించడానికి ప్రయత్నించడం, ప్రధాని మోదిపై, బీజేపీ నేతలపై తీవ్రంగా విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. తొలుత మోదితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా, ఎందువల్లో కేసీఆర్‌ ఆయనకు దూరం అయ్యారు. చివరికి పలకరించుకోలేని స్థితికి వచ్చారనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కూడా తన కుమార్తెను అరెస్టు చేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఇంకో వైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్‌ నేతలపై దాడి పెంచింది. ఎంపీగా పోటీచేయాలని ఉబలాటపడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెక్‌ పెడుతూ ఆయన కుటుంబానికి చెందిన కాలేజీలో ప్రభుత్వ స్థలంలో రోడ్డు వేశారని అధికారులు తవ్వేశారు. ఆక్రమిత స్థలంలో భవనాలు కట్టారని వాటిని కూల్చివేశారు. దీంతో మల్లారెడ్డి కర్నాటకకు పరుగెత్తి డీకే శివకుమార్‌ను వేడుకున్నారు. ఆ మీదట తాము ఎంపీ సీటుకు పోటీచేయడం లేదని ప్రకటించారు.

అంతేకాక బీఆర్‌ఎస్‌ నుంచి ఎందరు దొరికితే అందరిని కాంగ్రెస్, బీజేపీలు గుంజుకుంటున్నాయి. ఎంపీలు  కొందరిని బీజేపీ లాగితే ఎమ్మెల్యేలు ఇంతవరకు పదహారు మందిని కాంగ్రెస్ లాగేసినట్లేనని చెబుతున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి మద్దతు ఇస్తున్నారట. అందువల్లే తన ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆయన ఉన్నారు. పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి సోదరుడిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేశారు. ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్ ధోరణులేనని బీఆర్‌ఎస్‌ అంటోంది. కేసీఆర్‌ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. కానీ అప్పట్లో ఈ రకంగా దాడులు జరగలేదు. వారిని ప్రలోభపెట్టి ఆకర్షించుకున్నారు. అయినా అది కూడా విమర్శలకుగురి అయింది.

ఇప్పుడు దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఎదురైంది. నైతికంగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న దానిని తప్పు పట్టలేని దైన్యంలో కేసీఆర్‌ పడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తే తెలంగాణలో బలపడడానికి కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న గేమ్‌లో బీఆర్‌ఎస్‌ బలి అవుతుందా అన్న సందేహం వస్తుంది. అయితే కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయజాలం. ఆయన పలు డక్కీలు తిన్నవాడే. వీటన్నిటిని ఎలాంటి వ్యూహాలతో తిప్పి కొట్టి బీఆర్‌ఎస్‌ను సురక్షితంగా నిలబెట్టుకుంటారో చూడాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇదేమాదిరిగా చిత్తశుద్దితో కాకుండా ప్రత్యర్ధులను లొంగదీసుకునే వ్యూహాలనే అమలు చేస్తే ఏదో ఒక రోజు దెబ్బతింటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement