భీమిలి సీటుపై గంటా కర్చీఫ్‌.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం! | Ganta Srinivasa Rao ready to Bhimili Assembly seat TDP | Sakshi
Sakshi News home page

భీమిలి సీటుపై గంటా కర్చీఫ్‌.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం!

Published Mon, Nov 13 2023 7:41 AM | Last Updated on Mon, Nov 13 2023 9:02 AM

Ganta Srinivasa Rao ready to Bhimili Assembly seat TDP - Sakshi

 విశాఖ జిల్లాలో టిడిపి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది. చంద్రబాబు నాయుడు అక్రమాలు ఒక్కొక్కటి బయటపడడంతో ఇప్పటికే పార్టీ బ్రష్టు పట్టింది. ఈ దశలో ఎన్నికలు వస్తున్న పరిస్థితుల్లో  పార్టీ నేతల నిర్ణయాలు పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన నేతలను కాదని  ఎన్నికల ముందే హడావిడి చేసే  నేతలను అందలం ఎక్కించాలన్న  పార్టీ అధినేత ఆలోచనల పట్ల కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. మాజీ మంత్రి  గంటా శ్రీనివాసరావు పై  భీమిలి పార్టీ క్యాడర్ భగ్గుమంటోంది. 

గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి గెలిచి  చంద్రబాబు నాయుడి కేబినెట్ లో మంత్రి పదవి అనుభవించిన గంటా శ్రీనివాస్ అయిదేళ్ల పాలనలో నియోజక వర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి పోటీ చేస్తే  ప్రజలు ఓడించడం ఖాయమని గమనించిన గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజక వర్గంపై కన్నేశారు. ఇలా నియోజక వర్గాలు మార్చడం గంటాకు కొత్త కాదు. ప్రతీ ఎన్నికలోనూ నియోజక వర్గాన్నో పార్టీనో మార్చడం ఆయనకు అలవాటే.  అయితే గత ఎన్నికల్లో బీమిలిలో పార్టీ ఓటమి అనంతరం  అయిదేళ్ల పాటు పార్టీనే అంటిపెట్టుకుని  ఉన్న నియోజక వర్గ ఇన్ ఛార్జ్ రాజబాబు వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండి పోటీ చేయాలని చూస్తున్నారు.

గత ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు  ఉత్తరాంధ్ర పర్యటించినపుడు కూడా గంటా హాజరు కాకుండా తన ఇంటికే పరిమితం అయ్యారు. అటువంటి గంటా ఇపుడు భీమిలినియోజక వర్గంపై కర్చీఫ్ వేస్తున్నారు.  కొంతకాలం గంటాపై కోపంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా గంటాకు భీమిలి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే రాజబాబుకు మంట తెప్పిస్తోంది.

గంటాకు టికెట్ ఇస్తే  నియోజక వర్గంలో పార్టీ క్యాడర్ ఎవ్వరూ కూడా గంటా కోసం పనిచేసే పరిస్థితిలేదని రాజబాబు అధిష్టానానికి  సమాచారం పంపారు.ఈ క్రమంలోనే తాజాగా గంటా శ్రీనివాసరావు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు  భీమిలి వచ్చారు. ఆ కార్యక్రమ వేదికపై ఉన్న రాజబాబు గంటా రావడంతోనే లేచి  వేదిక దిగి వెళ్లిపోయారు. గంటాపై తన నిరసనను ఆ విధంగా వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన గంటా డబ్బులు వెదజల్లి అయినా భీమిలి టికెట్ కొనుక్కోగలరని భావిస్తోన్న రాజబాబు ..పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న తనవంటి వారిని  పక్కన పెట్టి అవకాశ వాద రాజకీయాలు చేసే గంటాకు టికెట్ ఇస్తే  పార్టీ ఓటమి చెందడం ఖాయమని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు రెండు దశాబ్దాల పాటు భీమిలి నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వెలిగింది.
2004 ఎన్నికల్లో  దివంగత వై.ఎస్.ఆర్. ప్రభంజనంలో భీమిలి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
2009లో   చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో దిగిన అవంతి శ్రీనివాస్  గెలిచారు.
2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ టిడిపి అభ్యర్ధిగా భీమిలిలో గెలిచారు. గత ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగ పోటీ చేసి విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement