కాంగ్రెస్‌కు రుణమాఫీ చేసే తెలివిలేదు: కేటీఆర్‌ EX Minister KTR Sensational Comments Over Congress Govt | Sakshi
Sakshi News home page

తెలంగాణలో సన్న బియ్యం కొనుగోళ్లపై పెద్ద స్కాం జరిగింది: కేటీఆర్‌

Published Sun, May 26 2024 11:52 AM | Last Updated on Sun, May 26 2024 12:37 PM

EX Minister KTR Sensational Comments Over Congress Govt

సాక్షి, తెలంగాణభవన్‌: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని వ్యాఖ్యలు చేశారు.

కాగా, కేటీఆర్‌ ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి  దీనిపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటేనే స్కాములు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్న, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం  కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది కాంగ్రెస్. ధాన్యం కుంభకోణంలో సుమారు రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. ఇవన్నీ ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులుగా వెళ్ళాయి.

అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్‌తో జరిగింది. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇందులో వందల కోట్ల రూపాయలు ముడుపులు అందాయా లేదా ఎంక్వైరీ వేయాలి. పాడిలో మొదటి స్కాం, పాఠశాలల్లో సన్నబియ్యం విషయంలో రెండో స్కామ్‌. రెండిట్లో దాదాపు రూ.1100 కోట్లు స్కాం జరిగింది.

నాలుగు సంస్థలకే టెండర్లు..
బహిరంగ మార్కెట్లలో సన్నబియ్యం ధర 42 నుండి 45 వరకు ఉంది. దానిని పక్కకు పెట్టీ 56.90 పైసలతో కొంటున్నారు. కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే టెండర్లు ఎందుకు?. సివిల్‌ సప్లై, ఎఫ్‌సీఐ ఉన్నప్పటికీ వాటిని ఎందుకు పట్టించుకోరు?. కాంట్రాక్టు సంస్థలతో కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయ్యారు. బహిరంగ మార్కెట్లలో తక్కువ ధరకు సన్నబియ్యం వస్తుంటే ఇంత ధరలు ఎందుకు ఖరారు చేశారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్‌ నడుస్తోంది. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ప్రభుత్వానికి రూ.2లక్షలు రుణమాఫీ చేసే తెలివి లేదు. 

బీజేపీపై అనుమానాలు..
ధాన్యం కొనుగోలు, కాంట్రాక్టు, ఎంఎస్‌పీ అంత నిర్వహించేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బీజేపీ నాయకుడు గొంతు చించుకుంటున్నా కేంద్రంలో ఉన్న FCI నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ విషయంలో FCI వెంటనే ఈడీకి ఫిర్యాదు చేయాలి. మీ బీజేపీ ఎంఎల్ఏ చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఈడీ విచారణ చేయాలి. FCI స్పందించకపోతే బీజేపీపైన కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వం అనేక కుంభకోణాలు అంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పుడెందుకు రేవంత్ రెడ్డి స్పందించటం లేదు. దమ్ముంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపించాలి. లేదంటే మేమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. విచారణ సంస్థలను కూడా కలుస్తాం అని వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement