Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్‌కు చెరో '8' | Congress And BJP Won 8 Seats Each In Telangana Lok Sabha Election 2024 | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్‌కు చెరో '8'

Published Wed, Jun 5 2024 4:42 AM | Last Updated on Wed, Jun 5 2024 1:38 PM

Congress and BJP won 8 seats each Lok Sabha Election 2024

రాష్ట్రంలో హోరాహోరీ 

పోరాడిన జాతీయ పార్టీలు 

హైదరాబాద్‌ లోక్‌సభ నుంచి ఐదోసారి అసదుద్దీన్‌ ఎన్నిక

ఒక్క సీటు కూడా సాధించలేని గులాబీ పార్టీ 

ఉత్తర తెలంగాణ, హైదరాబాద్, శివార్లలో బీజేపీ హవా 

దక్షిణ తెలంగాణపై పట్టు నిలుపుకొన్న హస్తం పార్టీ 

ఐదుగురు సిట్టింగ్‌ ఎంపీల ఓటమి.. తొలిసారిగా ఎన్నికైన 8 మంది

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్‌ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. 

ఓడినవారిలో నామా నాగేశ్వర్‌రావు, మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్‌ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్‌ మాత్రమే తమ సీట్లను నిలుపుకొన్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. 

దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పట్టు.. 
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్‌సభ సీట్లనూ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. 

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్‌సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. 

పట్టుపెంచుకున్న ఇరు పార్టీలు.. 
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ.. ఈసారి తన బలాన్ని 8 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్‌ కూడా 3 సీట్ల నుంర్టీచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి.. ఆ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలే గెలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి సమ ఉజ్జీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ ఒక్క లోక్‌సభ సీటు గెలవలేదు. 

గత, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివీ.. 
పార్టీ    2014    2019    2024 
కాంగ్రెస్‌    2    3    8 
బీజేపీ    1    4    8 
ఎంఐఎం    1    1    1 
బీఆర్‌ఎస్‌    11    9    0 

నల్లగొండ: రికార్డు స్థాయి మెజారిటీ 
నల్లగొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ తమ పట్టు నిలుపుకొంది. కౌంటింగ్‌ ఆద్యంతం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపారు. చివరికి ఏకంగా రికార్డు స్థాయిలో 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 

భువనగిరి: అంతా తొలిసారి ఎంపీలే.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తమకు ఉన్న పట్టును కాంగ్రెస్‌ పార్టీ మరోసారి నిలుపుకొంది. భువనగిరి లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తొలిసారిగా ఎంపీలు అయినవారే కావడం విశేషం. 

నాగర్‌ కర్నూల్‌: మళ్లీ ‘చేతి’కి.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌పై గెలుపొందారు. మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలవడం గమనార్హం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. 

పెద్దపల్లి: మళ్లీ కాంగ్రెస్‌ ఖాతాలోకి.. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌పై విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) మనవడు, చెన్నూర్‌ ఎమ్మెల్యే జి.వివేక్‌ తనయుడే గడ్డం వంశీకృష్ణ. ఈయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. 

వరంగల్‌: పార్టీ మారి పోటీచేసినా.. 
2009లో జరిగిన పునర్విభజనలో వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్‌ గెలవగా తర్వాత వరుసగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌పై 2,20,339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కావ్యకు బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అరూరి రమేష్‌ కూడా ఎన్నికల ముందే బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరి పోటీ చేయడం గమనార్హం. 

మహబూబాబాద్‌: సెగ్మెంట్‌ చరిత్రలో అధిక మెజారిటీ 
మహబూబాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పి.బలరాంనాయక్‌ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు. 1957 నుంచీ కొనసాగిన మానుకోట పాత పార్లమెంట్‌ స్థానంలోగానీ, 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలోగానీ.. ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్‌ తరఫున ఇదే లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన బలరాంనాయక్‌ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. ఈసారి మళ్లీ గెలిచారు. 

ఖమ్మం: ఆద్యంతం కాంగ్రెస్‌ ఆధిక్యమే.. 
తొలి రౌండ్‌ నుంచి చివరిదాకా కాంగ్రెస్‌ ఆధిక్యమే కొనసాగింది. చివరికి 4,67,847 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 18 ఎన్నికల్లో.. ప్రస్తుతం రామసహాయం రఘురాంరెడ్డి సాధించిన మెజారిటీయే రికార్డు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్‌ పెంచుకుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 20,488 ఓట్లే రాగా.. ఈసారి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు 1,18,636 ఓట్లు సాధించారు. 

జహీరాబాద్‌: ఇక్కడా హస్తం హవా 
ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. సురేశ్‌ షెట్కార్‌ ఇదే సెగ్మెంట్‌ నుంచి 2009లో ఎంపీగా గెలిచారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన బీబీ పాటిల్‌ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే జరిగింది. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ మూడో స్థానంలో నిలిచారు. 

నిజామాబాద్‌: పోటాపోటీ మధ్య కమలానికి.. 
ఇందూరు గడ్డపై మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ కొనసాగిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను.. అరవింద్‌కు బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్‌ రూరల్‌లలో ఆధిక్యత వచ్చింది. జీవన్‌రెడ్డికి జగిత్యాల, నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ సెగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది. 

కరీంనగర్‌: పట్టు పెంచుకున్న జాతీయ పార్టీలు 
తొలి నుంచీ బీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో జాతీయ పార్టీలు పట్టుపెంచుకున్నాయి. ఇక్కడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 4,98,276 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,79,258 ఓట్లు రాగా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. క్రితంసారితో పోలిస్తే 86,840 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు 3,59,907 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్‌కు 1,80,649 ఓట్లు అదనంగా వచ్చాయి. ఈసారి బీఆర్‌ఎస్‌కు 2,82,163 ఓట్లు వచ్చాయి. 1.25 లక్షలకుపైగా ఓట్లు తగ్గాయి.  

మహబూబ్‌నగర్‌: కౌంటింగ్‌ ఆద్యంతం ఉత్కంఠ 
మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి డీకే అరుణ 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన డీకే అరుణ లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఈ లోక్‌సభ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. 

మల్కాజిగిరి: దేశంలోనే పెద్ద సెగ్మెంట్‌.. తొలిసారి బీజేపీ విజయం 
దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్‌సభ సెగ్మెంట్‌ మల్కాజిగిరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌లో ప్రముఖ నేతగా కొనసాగి, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈటల తొలిసారి ఎంపీ అయ్యారు. 

చేవెళ్ల: కొండా వశం 
చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన 2014లో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల సెగ్మెంట్‌లో ఏకంగా 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 

మెదక్‌: గులాబీ కంచుకోటలో కమలం 
బీఆర్‌ఎస్‌ పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉన్న మెదక్‌లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌పై గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్‌రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కంటే సుమారు 35 వేల ఓట్లు తక్కువగా వచ్చిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 

ఆదిలాబాద్‌: మళ్లీ కమలమే! 
ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో కమలం పార్టీ మళ్లీ వికసించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కౌంటింగ్‌ తొలుత ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నా.. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. చివరికి నగేశ్‌ గెలిచారు. 

హైదరాబాద్‌: ఐదోసారి లోక్‌సభకు అసదుద్దీన్‌ 
హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో తన ప్రచార, వ్యవహార శైలితో జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన మాధవీలత ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయ్యారు. 2019లో 2.82 లక్షల ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్‌ గెలవగా.. మెజారిటీ మరో 50వేలకుపైగా పెరిగింది. 

సికింద్రాబాద్‌: ఓట్లు మరింత పెంచుకున్న బీజేపీ 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో బీజేపీ తన ఓట్లశాతాన్ని మరింత పెంచుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో బీజేపీకి 42.05 శాతం ఓట్లురాగా.. ఈసారి 45.15శాతం వచ్చాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement