సొంతంగా ముందుకెళ్లం!: సీఎం రేవంత్‌ CM Revanth Reddy Fires On KCR Harish Rao | Sakshi
Sakshi News home page

సొంతంగా ముందుకెళ్లం!: సీఎం రేవంత్‌

Published Wed, May 29 2024 4:35 AM | Last Updated on Wed, May 29 2024 4:35 AM

CM Revanth Reddy Fires On KCR Harish Rao

మేడిగడ్డపై నిపుణుల కమిటీ, కేంద్ర ఏజెన్సీలు చెప్పినట్లే నడుచుకుంటాం: సీఎం రేవంత్‌

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ 

మేడిగడ్డ ఎంతోకొంత నింపినా, సుందిళ్ల,అన్నారం ఉంటాయో, ఊడతాయో తెలియట్లేదు 

భారీ వరదలు వచ్చి ఎల్లంపల్లి నిండితే ఆ వరద, ఎత్తిపోసిన నీరు మూడు బ్యారేజీల నుంచే కిందికి పోవాలి 

ఇది 32 పళ్లలో ఒక పన్ను విరగడంలాంటి సమస్య కాదు.. వెన్నెముక విరిగింది 

కాళేశ్వరం అంచనాల పెంపుపై విచారణకు ఆదేశిస్తే మొత్తం ప్రాజెక్టే ముందుకెళ్లదు 

ఫోన్‌ ట్యాపింగ్‌పై కేసీఆర్, హరీశ్‌రావులు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? 

ఇందులో తన జోక్యం లేదన్న సీఎం

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పినట్లే నడుచుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాదిరి సొంతంగా నిర్ణయాలు తీసుకోబోమని చెప్పారు. మేడిగడ్డలో ఎంతో కొంత నీళ్లు నింపి, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పంపినా.. అవి ఉంటాయో, ఊడుతాయో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక సైతం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్టతపై సందేహాలు వ్యక్తం చేసిందని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం తుగ్లక్‌ రోడ్డులోని అధికారిక నివాసంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. 

ఇంకెన్ని బ్లాక్‌లు కూలతాయో తెలియదు 
‘80 వేల పుస్తకాలు చదివి, సొంత తెలివితేటలతో కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. అల్లుడు హరీశ్‌రావు వరల్డ్‌ రికార్డు కోసం ఆగమాగం పనులు చేశాడు. ఇప్పుడు అది కూలింది. మేడిగడ్డలో కూలిన బ్లాక్‌ను సరిచేసి నీళ్లు నిలిపితే, ఇంకెన్ని బ్లాక్‌లు కూలతాయో తెలియదు. ఒకవేళ రెండున్నర మీటర్లలో మేడిగడ్డ నింపి అన్నారం, సుందిళ్లకు నీటిని పంపితే వాటి పరిస్థితి ఏంటో తెలియదు. ఒకవేళ భారీ వరదలు వచ్చి ఎల్లంపల్లి నిండితే ఆ వరద నీరు, ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నుంచే కిందికి పోవాలి. 

ఇప్పటికే 52 టీఎంసీల ఎత్తిన నీళ్లు కిందకు పోయాయి. సముద్రంలోకి పోయిన నీటికి కరెంట్‌ బిల్లులు కట్టాం. 80 వేల పుస్తకాలు చదివిన తెలివి అట్లుంది. కాళేశ్వరం సమస్య.. 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చిన సమస్య లాంటిది కాదు. విరిగింది వెన్నెముక. మేడిగడ్డ పునరుద్ధరణ అంశంపై ఇప్పటికే మూడు కేంద్ర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఆ ఏజెన్సీలు ఇచ్చిన సిఫారసుల మేరకు ముందుకు వెళతాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.  

ప్రస్తుతానికి అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు 
‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరకే జ్యుడీషియల్‌ విచారణ జరుగుతోంది. ఇక్కడి తప్పిదాలకు ఎవరు బాధ్యులో అది తేలుస్తుంది. ఇది కాకుండా అంచనాలు ఎందుకు తారుమారయ్యాయి, ఎస్కలేషన్‌ ఎంత..ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యవహారంపై విచారణ మొదలు పెడితే అది ఇక్కడితో ఆగదు. మొత్తం ప్రాజెక్టే ముందుకెళ్లదు. 

అంచనాల పెంపులో అవకతవకలను విచారిస్తూ పోతే ఏ ప్రాజెక్టూ ముందుకు పోదు. ప్రభుత్వం కూడా పనులు చేయించలేదు. బిల్లులు ఇవ్వలేదు. ఒకవేళ పనులు కొనసాగిస్తే విచారణకు ఆదేశించాక కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అప్పుడు ఇందులో ఏదో మతలబు ఉందని మీడియానే రాస్తుంది. అందుకే అంచనాలు, చెల్లింపుల జోలికి పోలేదు. మేడిగడ్డ అంశం తేలాక దానిపై ఆలోచిస్తాం..’ అని సీఎం వివరణ ఇచ్చారు.  

కోర్టు ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ 
‘రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో నేనేమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. దీనిపై ఇంతవరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. ఒకవేళ జోక్యం చేసుకున్నా ఇప్పటికిప్పుడు నాకు కానీ, పారీ్టకి కానీ దక్కే ప్రయోజనం ఏంటి? ఈ విషయంలో కోర్టు ఆదేశాల మేరకే విచారణ కొనసాగుతోంది. 

విచారణలో నిందితులు చెబుతున్న అంశాలు నేను కూడా పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నా. ప్రతి చిన్న అంశంపై సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? మా ప్రభుత్వం మాత్రం ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి వెధవ పనులు చేయడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోలీసులు పారదర్శకంగా పనిచేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ పోలీసుల బదిలీలు జరగలేదు..’ అని ముఖ్యమంత్రి అన్నారు.   

కరెంట్‌ కోతల్లేవు..అంతరాయం మాత్రమే 
‘రాష్ట్రంలో ఎక్కడా కరెంట్‌ కోతల్లేవు. చెట్లు పడిపోవడం, విద్యుత్‌ వినియోగం పెరగడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వల్ల అంతరాయాలు ఏర్పడ్డాయి తప్పితే ఎక్కడా కోతలు లేవు. తెలంగాణ రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత పూర్తిగా అందెశ్రీకి ఇచ్చాం. ఆయన దానికి కీరవాణితో సంగీతం సమకూర్చుకుంటారో, మరొకరితోనో అనేది ఆయన ఇష్టం. తెలంగాణ చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూదనేది మా ఉద్దేశం. దానికి అనుగుణంగానే కొత్త చిహ్నం ఉంటుంది..’ అని రేవంత్‌ చెప్పారు.  

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా 
– సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి 
సాక్షి, న్యూఢిల్లీ: జూన్‌ 2న పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం 10 జన్‌పథ్‌ నివాసంలో సోనియాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాలంటూ ఆహ్వానించారు. సుమారు అరగంట సేపు జరిగిన సమావేశానంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.  

4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త 
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జరుపుతున్న ఉత్సవాల్లో సోనియా భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు తీర్మానం చేసింది. ఈరోజు సోనియాగాం«దీని కలిసి ఆహ్వానించాం. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఇది రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు సంతోషకరమైన వార్త. సోనియా గాంధీ పర్యటన, అవతరణ ఉత్సవాల కోసం కాంగ్రెస్‌ శ్రేణులంతా ఎదురుచూస్తున్నాం. రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు సోనియా గాం«దీని సత్కరించడం ద్వారా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించినందుకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోనియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.  

అందరికీ సముచిత గౌరవం 
ప్రజా పాలనలో చేసుకుంటున్న తొలి ఉత్సవాలు ఇవి. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాముల్ని చేస్తాం. అందరినీ అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. వారందరికీ సముచితమైన గౌరవం దక్కుతుంది. ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం..’ అని సీఎం తెలిపారు.  

కేసీ వేణుగోపాల్‌తో భేటీ 
కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కూడా రేవంత్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. సుమారు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీనికి ముందు తుగ్లక్‌ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనులను రేవంత్‌ పరిశీలించారు. బంగ్లా మొత్తం కలియ తిరిగి అధికారులకు కొన్ని మార్పులు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం సోమవారం అర్ధరాత్రి కేరళ నుంచి ఢిల్లీకి వచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement