బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుకు ఏమైంది..? Brs Lost Its Vote Share In Loksabha Polls | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు ఓటు ‍బ్యాంకు ఉందా..లేదా..?

Published Sat, Jun 22 2024 6:57 PM | Last Updated on Sat, Jun 22 2024 7:17 PM

Brs Lost Its Vote Share In Loksabha Polls

ఏ పార్టీకైనా సొంతగా ఓట్‌ బ్యాంక్ ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఓట్‌ బ్యాంక్ ఆ పార్టీకి అండగా ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ ఓట్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకుని కాపాడుకుంటూ ఉంటుంది. అధికారంలో ఉన్నపుడు తమకు అనుకూలంగా ఉన్నవర్గాలకు అవసరమైన పథకాలు అమలు చేయడం కూడా సహజమే.

తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తనకంటూ ఓట్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయిందా? అధికారం కోల్పోయాక గులాబీ నేతల్లో దీనిపై అంతర్మథనం మొదలైంది. ఇంతకీ బీఆర్ఎస్‌కు ఓట్‌ బ్యాంక్ ఉందా? లేదా?  

ఒక రాజకీయ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంతనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ పార్టీకి నిబద్దతతో ఓటు వేసేవారు ఎంతమంది ఉన్నారో వారినే ఓట్‌ బ్యాంక్‌గా భావిస్తారు. అలా ప్రజల మద్దతు ఉన్న పార్టీకే విలువ ఉంటుంది. కులం, మతం, ప్రాంతం లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా ఓటు బ్యాంక్‌ ఏర్పాటవుతుంది. 

తెలంగాణలో ఉద్యమ పార్టీగా  ఆవిర్భవించి..2014 తర్వాత అసలు సిసలైన రాజకీయ పార్టీగా రూపొందిన గులాబీ పార్టీ 23 ఏళ్ళుగా అనేక ఎన్నికలను ఎదుర్కొంది.  కేసీఆర్ ఆకట్టుకునే ప్రసంగాలు, రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన ఓటు బ్యాంకు ఇప్పుడు ఏమైందనే చర్చ జరుగుతోంది.

గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్‌కు వచ్చాయి. అంటే ఆరు నెలల కాలంలో గులాబీ పార్టీకి చెందిన 21 శాతం ఓట్లు దాని ప్రత్యర్థి పార్టీలకు మళ్ళాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా పొందగా..మిగిలిన ఓటర్ల మద్దతును బీజేపీ పొందింది. 

అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా ఇతర పార్టీల వైపు షిఫ్ట్‌ అయిపోయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్‌ మినహా చెరిసగం ఎంపీ సీట్లను దక్కించుకున్నాయి. దీనికి కారణం  బీఆర్ఎస్‌కు బలమైన, సుస్ధిర ఓటు బ్యాంక్ లేకపోవమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

గులాబి బాస్ కేసీఆర్‌కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై అవగాహన వుంది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సామాజిక వర్గం బలం చూసుకుంటే చాలా పరిమితంగా ఉంటామని ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలందరినీ ఓటు బ్యాంక్‌గా మలచుకోవచ్చని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదంతో సొంత పార్టీ స్థాపించారు. 

ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి తెలంగాణ సెంటిమెంట్‌ను అస్త్రంగా మలుచుకున్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో వున్న తెలంగాణ పేటెంట్‌ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.

కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్‌గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ గత ఎన్నికల్లో పెద్దగా పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ తన వ్యూహంతోనే రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. 

పదేళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఏ ఒక్క సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ వాదం క్రమంగా బలహీనపడటంతో ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పార్టీలోను, ప్రభుత్వంలోనూ రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఆరుగురు రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వుంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వారంతా బీఆర్ఎస్‌కు షిఫ్ట్ అయ్యారు.

మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపునకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది.

 రాష్ట్రంలోని అన్ని బలమైన సామాజిక వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటేనే పార్టీ బలపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement